Tuesday, August 2, 2011

ఎలా ..???

ఎలా...????
చెలీ! 

 ఎన్నెన్ని అందాలు 
ఎన్నో భావనలు
ఎన్నెన్నో  కష్టాలు 
ఎక్కడె క్కడివో కన్నీళ్లు 
ఎందరివో చిత్రాలు
చిత్రించానీ చేతితో
కానీ....ప్రియా...!!!
నీ సుమధుర గళాన్ని 
ఎలా చిత్రించను?
అని ప్రశ్నిస్తోంది 
నా చేతిలోని కుంచె
నిస్సహాయంగా ....
నీ దేహ చిత్రాన్ని 
గీశా.....నా ఊహల రంగులద్ది
నిన్నో మరపురాని 
మొనలిసాని చెయ్యగలిగాను
కానీ..........ప్రేయసీ
నీ సుస్వర నాదాన్ని 
చిత్రించాలంటే 
ఎ రంగు వాడాలి
ఏ రూపు నివ్వాలి
సప్త స్వరాలూ పలికే 
నీ తేనె గాత్రానికి
నీ చిలిపి  పలుకులకి 
ఏ వర్ణ మద్దాలి ? 
ఎన్ని రంగులు 
ఎన్ని చాయలు 
మరెన్నికలబోసి
నీ ప్రణయ సౌందర్యాన్ని
ఎ తలపుల కుంచెతో
దిద్ది తీర్చాలి
నీ వొంపు సొంపులు
నీ మేని సొగసులు
చేయి తిరిగిన నా సృజనలో 
ఇమిడి పోయాయి గాని
నీ నవ్వు సందళ్ళు 
నీ మాట పరవళ్ళు 
నీహృది లయలనెలా పలికించాలి
చిత్రకారునిగా అశక్తుడనైనా 
నీ ప్రేమ పాత్రునిగా 
ప్రియతమా....!!!
ఫలించిన  నా చిర మనోహర స్వప్నానివి
నిను నా మనో కాన్వాస్ పై
అనురాగ రంజితంగా
నా వలపు కుంచెతో 
పదిలంగా చిత్రించుకున్నాను 
నా మనో ఫలకం పై
శాశ్వత ప్రేమ కుడ్య  చిత్రమై
ఉంటావుగా....ఎన్నటికీ..
వెళ్లవుగా...నన్నొదిలి....
మన చిత్రానుబంధ మందిరం వీడి 
వెళ్ళవులే   తెలుసు నాకు ...!!!

             ..........................ప్రేమతో...జగతి 5.21pm Tuesday 02-08-2011 

















Saturday, July 30, 2011

నా అస్తిత్వం


అందంగా కవితనల్లలేనేమో                           
కానీ స్వచ్ఛంగా ప్రేమించగలను
అద్వితీయ సౌందర్యం కాదు కదా
చూడచక్కని దాన్నీ కాను
ఏ కవి మధుర కావ్యానికీ 
ప్రేరణ కాను
ఏ చిత్రకారుని
వలపు కుంచెకీ
చిత్రాన్ని కాలేదు
కుల మతాలూ లేని దాన్ని
వర్గ బేధాలు తెలియవు
వర్ణ వివక్ష ఎరుగనే ఎరుగను
ఏ క్షణాన ఫలవంతమై
జీవినైనానో
ఈ అనంత కోటి రాశిలో
ఓ భాగ మైనానో
ఏనాడు జ్ఞాన కుసుమం 
వికసించి  విరాజిల్లిందో
నాటి నుండి నాకు తెలిసినదొక్కటే
ప్రేమించడం ప్రేమ పంచడం
ద్వేషం నా దరిదాపుల్లో ఉండదు
కార్పణ్యం ముఖం కుడా చూడలేదేన్నడూ
గొప్పదాన్ని కాదు
అందరి లెక్కల్లో
ఆస్తులూ అంతస్తులో
లేవుగా మరీ
పేదదాన్ని అంటే ఒప్పుకోను
ససేమిరా అంటాను
నా వద్ద ఉన్నది 
కోటానుకోట్ల మమత సిరి
ఎంత పంచినా తరగని
ఎంత పంచితే అంత గా
విలసిల్లే ప్రేమ ఖని
ప్రేమ నా ఆయుధం
ప్రేమ నా ఆయుష్షు 
ఊహ తెలిసిన 
నాటినుండీ
ఊపిరి ఆగి  పోయేదాకా
నే చేస్తున్నదొక్కటే          
ప్రేమించడం
ప్రేమ నా చిరునామా కాదు
నేనే ప్రేమ అస్తిత్వాన్ని 
తుది శ్వాస వరకు
ప్రేమనే శ్వాసిస్తా
ప్రేమనై ప్రేమిస్తా
నిరంతర తపస్వినినై..!!!


.......................ప్రేమతో.....జగతి ....... 6.05 pm 30th july 2011 saturday
     
అర్ధం కాని రంగులను అందమైన  చిత్రాలుగా మలిచే అర్ద్రమైన ఓ చిత్రకారునికి...ప్రేమతో...జగతి 





రంగులని తన భావాల కుంచెతో అపురూపాలుగా చిత్రించే చిత్రకారుడు "అక్బర్" కి ...ప్రేమతో....జగతి  







Tuesday, July 19, 2011

ఇవీ........


 అన్ని కన్నీళ్లు ఉప్పనే.....అన్ని కన్నీళ్ళూ ఉప్పెనే ....ప్రేమతో ...జగతి 



ఇవీ........
నయనాల నిత్య సంతానాలు
ఆనందంలో అక్షింతల ఆశీర్వాదాలు
బాధలలో చిట్లిన హృది బీటల చెమ్మలు   
దుఃఖంలో మౌనంగా పారే సెల ఏళ్ళు
తలపులు  తల్లడిల్లిన క్షణాన 
ఓడి చేర్చుకునే కనుల తల్లి కౌగిలిలో 
మదికి తోడుగా ప్రవహించే 
నిరంతర అపూర్వ చెలులు
ప్రాణం పోసుకున్న క్షణాన మొదలై
జీవితాంతం ఏకైక నేస్తంగా నిలిచి
ఉసురు వదిలిన వేళ
మన వాళ్లనుకునే
కొద్దిమంది మంది కళ్ళలోనైనా
చిప్పిల్లే ప్రేమాస్పద 
స్మృతుల చినుకులు 
కాల గర్భంలో మనిషి కలిసిపోయినా
తన వారి కళ్ళలో తానో  జ్ఞాపకంగా  మెదిలే
ఈ అశ్రువుల ముత్యాలు   
ప్రేమకు మానవత్వానికి
సార్వ కాలిక ప్రతీకలు..
మానవునికి  సృష్టి 
ఒసగిన అపురూప అమూల్య 
కానుకలు ....కన్నీళ్లు...!!!
...............................................ప్రేమతో....జగతి 4.55pm tuesday 19th july 2011




                   









Thursday, July 14, 2011

ప్రేమ దుర్గం






నిజం నన్ను నిలువునా దహించి వేస్తుందని
అబద్ధపు తెరలతో అడ్డుకుంటావు  
సత్యపు పెనుగాలి నా ఆశల చిన్ని రెక్కలను విరిచేస్తుందని
నా పంచ ప్రాణాలూ ఎగిరి పోతాయని
అసత్యపు కవచాలను నా చుట్టూ అల్లా జూస్తావు 
వాస్తవానికీ, వాస్తవం ఒకనాటికి తెలియక మానదు
తెలిసాక నేనేమౌతానో ఏమో కానీ
నన్ను కాపాడుకోవాలనే నీ యక్ష ప్రయత్నం
నీ పై మరింత ఆరాధన పెంచుతుంది
యధార్ధానికీ నాకూ మధ్య నువ్వు గోడ కట్టినా......
అది నా ప్రేమ రక్షణ దుర్గమని 
తెలుసు నాకు....!!!
..................................ప్రేమతో...జగతి 7.10pm 18.09.09
              

Sunday, July 10, 2011

గర్భ శోకం


అందరూ నా పేగు బంధాలే 
నా ఇరు రొమ్ముల పాలు తగి పెరిగిన వారే
ఏ మాయలు, ఏమాటలు, ఏ వేటులు
వేరు చేసాయో.... 
కుడి ఎడమలై విడిపోయి 
శోక తప్తగా నన్ను మిగిల్చారు 

ఆదర్శాల అగ్నిపుష్పమాలలు ధరించి 
ఆవేశంతో ఆయుధం పట్టిన వారు కొందరు 
అడవుల అగాంతరాల పాలౌతూ 
అనుక్షణం అసిధారా వ్రతంలో 
అందుకోలేని ఆశయాల శోధకులై 
గుర్తింపులేక  గుర్తులే మిగలక
గుళ్ల వర్షంలో గుప్తమై పోతారు 
వారికి పతకాలుండవు 
పతనాలు తప్ప
ఆదరణలుండవు ఆప్తుల ఆక్రోశం తప్ప ....

ప్రాణాలకు తెగించి 
తమవారిని త్యజించి 
రక్షణే కర్తవ్యంగా 
విధి నిర్వహణలో 
తమని తాము అర్పించుకుంటారు కొందరు 
సమరంలో స్వైర విహారులు
సహజ జీవన మాధుర్యానికి నోచుకోని వారు 
అకాల వైషమ్య దురాక్రమణకి 
అధాటుగా బలి పశువులౌతారు
జల సమాధులలో ఆశువులు బాసి 
కర్మవీరులౌతారు 
పరమ వీర చక్రాలుగా 
వీర పతాకలుగా
ఆత్మీయులకు మిగులుతారు 

బాటలు వేరైనా 
అందరూ సమ సమాజ స్వాప్నికులే....

అసహాయ విధ్వంసాల ఆదర్శం ఒకరిది
నిస్సహాయ కర్తవ్య పాలన ఇంకొకరిది                           

అహరహమూ సాగే పోరు బాటయే
ఇరువర్గాలదీ......
ప్రాంతమేదైనా , పేరు ఏదైనా, కారణమేదైనా 
రాలేది మాత్రం నా బిడ్డల ప్రాణాలే
నా పేగు ముడిని తెంచుకున్న 
కడుపుతీపి తుంచుతున్న
పల్లేరు బాటల పయన మిరువురిదీ

ప్రాణాల హవిస్సులనర్పిస్తూ 
ఆప్తుల అనుబంధాలకందని దూరాలకు చేరి 
జ్ఞాపకాలుగా, జ్ఞాపికలుగా మిగిలిపోయే 
అనునిత్యం హననమై సాగే 
ఈ విషాద విధ్వంసక పయనం
ఆగే దెన్నడు?

నా నిరంతర    గర్భ శోకానికి 
ముగింపు పలికే దెన్నడు????? 

.............................................................ప్రేమతో ....జగతి 

5.35pm wednesday 02-07-2008.....లో రాసినది