Thursday, January 3, 2013

మీ అందరితో ఒక మాట



ప్రమాదమెప్పుడూ హఠాత్తుగానే కదా జరిగేది 
ఎక్కడి నుండో ఎవరి నోటి నుండో హఠాత్తుగా ...

ఒక్క మాట వచ్చిపడింది 
పడుతూనే  కపాలాన్ని ముక్కలు చేసి 
హృదయాన్ని తూట్లు పొడిచింది 
ఒక్క మాటుగా నాడీ  వ్యవస్థ సర్వస్వమూ 
అచేతనమై పోయింది 
మనసు నిస్సహాయంగా చూస్తుంది
ప్రమాదమనుకున్నా గానీ 
కావాలనే సంధింపబడ్డ అస్త్రం అని తెలిసాక 
మ్రాన్పడిపోయాను ..

చిత్రం దు:ఖమూ కలగలేదు 
కన్నీళ్లు చింద లేదు ...
ఎక్కడో ఎద  లోతుల్లోకి 
బల్లెం గుచ్చినంత నొప్పి మాత్రం తెలిసింది 
నొప్పి తీవ్రతలో దేహం కూడా 
చలించి పోతూ మూలగనాన్నా లేదు 

అయిన గాయం మాత్రం తీవ్రమైనదే 
ఇంతవరకూ బల్లెమూ కత్తీ శూలమో 
లోహపు వస్తువులో  గాయం చెయ్యగలిగే పరికరాలనుకున్నాను  
కానీ! మాట ఇంత మనసు కోస్తుందని ఇప్పుడే 
అనుభవం తో తెలుసుకున్నాను 

ఇంతటి గాయం నాకు కలగడానికి నే చేసిన
పాపమో తప్పో  నాకైనా తెలియాలిగా 
అందుకే ప్రయత్నించి తెలుసుకున్నా 
నన్ను ఎందుకు గాయ పరిచారు అని మాటలనే అడిగా 

నీవు చేసిన తప్పిదానికే అన్నాయి 
ఏం చేసానో చెప్పమన్నాను 
మనసు విప్పి మమ్మల్ని వదిలేసావుగా 
అన్నాయవి  ఖచ్చిగా ....

ఆశ్చర్యం తో చూస్తున్న నాతో తిరిగన్నాయిలా 
మనసులోని ప్రేమను మా ద్వారానే గా 
నీవు  అందరికీ పంచావు
నీ మటుకు అవి నీకు మంచివేనేమో గానీ 
చాలామంది మమ్మల్ని అసహ్యంగా చూసారు 
అనురాగ రంజితమైన నీ పలుకులని 
అభాసుపాలు జేసి నవ్వుకున్నారు 
అవమానం తో క్రుంగి పోయాము మేము 

అందుకే మాటలాడ రాదు అనేది 
విసురుగా వచ్చి తగిలింది విసుగు 
ప్రేమగా  మనసు విప్పి ఒక్క మాట 
ఆత్మీయంగా ఒక్క పలకరింపు 
ఆర్తిగా ఆవేదనని పంచుకుంటూ 
నేను మాటలెన్నో ఆడాను నిజమే 
కానీ ! అందుకు ఇంత  తీవ్రమైన  శిక్షా ?

మాటలకు ప్రేమను అద్ద డమే తెలుసు నాకు 
భావాలకు మాటలిచ్చి 
ఆప్యాయతగా మాటాడటమే చేతవును 
అంతకు మించి నే చేసిన నేరం లేదు సుమా 

అనురాగం ఒక అసహ్యంగా అగుపిస్తే 
అభిమానం అసహజంగా వినిపిస్తే 
నేనంటూ చెయ్యగలిగేది ఏమీ లేదు 
చెయ్యని తప్పుకి శిక్షలూ 
అనర్ధంగా మోసే శిలువలూ 
తక్కువేమీ లేదీ మనుషుల లోకం లో 
నన్ను అనురాగం పంచినందుకే కనుక శిక్షిస్తే 
ఆనందంగా జన్మ జన్మ లోనూ  భరిస్తాను చిరునవ్వుతో 

మాటలతో అన్ననప్పుడు నేనిలా 

మీతోనూ చెప్తున్నా ఎప్పటికైనా 
ప్రేమే జయిస్తుంది ప్రేమే 
మానవాళిని ఏకం చేస్తుంది 
మీ ఉనికిని మీరు కోల్పోకండి 
అవమానాలు ఎన్ని ఎదురైనా
మీ అస్తిత్వాన్ని విడవకండి 
ప్రేమ అన్ని ఆయుధాలకంటే  బలమైన అస్త్రం 
ఇందులో రక్త పాతం ఉండదు  
ఎన్నటికైనా అనురాగమే జయ పతాక ఎగరవేస్తుంది 
ఇది నిజం ఒక మనిషి మాట కోసమో 
ఒక మనసుని బాధించడం కోసమో 
ఈటేల్లా మిమ్మల్ని వాడుకున్న వారిని 
చూసి జాలిపడండి 

అది వారి నైజమని సానుభూతి చూపండి 
మాటలతో మది ఛిద్రం చెయ్యడం 
గొప్పతనం కాదు 
మాటలతో మంచిని నిలబెట్టిన నాడు 
మీకు , మిమ్మల్ని పలికే వారికీ 
జన్మ సార్ధకత అన్నాను ఓదార్పుగా 

ఇప్పుడు నాకు తగిలిన మాటల గాయాల 
సలపరింత లేదు బాధా లేదు 
ఆ మాటలన్న వారి మనస్థితి తల్చుకుని 
జాలి వేసింది నిజమే 
మాట జారడం మాట తూలడం 
కూడా ఒక దీర్ఘకాల వ్యాధే సుమా 
వ్యాధి గ్రస్తులపై ఆగ్రహమేల 
నాలో నేను నవ్వుకుంటూ ప్రేమ 
మాటలాడటం మొదలు పెట్టాను 

.....................................................మాటలతో గాయ పరిచిన వారందరికీ ప్రేమతో ..మీ జగతి
                                    12.45 ఏ .ఎమ్  2 జనవరి 2013 బుధవారం   






1 comment:


  1. చాల బాగా రాసారు అక్కా,
    మా పెద్దమ్మ కూతురు కాకినాడలో వుంటారు ,మీలాగే వుంటారు అందుకే అక్కా అన్నాను.
    ఈ భావాలూ,భావనలు కూడా ఎప్పటినుండో నా మనసులో మెదలుతున్నాయి.
    మీరు వాటికి చక్కటి అక్షర రూపంతో ప్రాణప్రతిష్ట చేసారు.
    ప్రేమతో సాధించ లేనిది ఏది లేదు. కాకపోతే 'నిజం' లాగ కొంచెం ఓరిమి కావ అంతే.
    "మాట జారడం మాట తూలడం
    కూడా ఒక దీర్ఘకాల వ్యాధే సుమా"
    అదే నేను చేశాను. జాలి పడటం కొందర్కి మృత ప్రాయమే

    ReplyDelete