Sunday, December 11, 2011

నా కృష్ణా!

నా కృష్ణా!
              ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి గాని.....అన్నట్టు ఊహ తెలిసిన నాటినుండీ ఒళ్ళంతా కళ్ళు గా ఎదురుచూస్తున్న,ఇక తీరదులే  అని ఆశ చంపుకున్న తీయని  కోరిక ఇలా హటాత్తుగా అమృతపు జల్లు కురిసినట్లు నీ అక్షరాలలో అక్షరాలా లేఖ గా అందుకుంటానని కలలో కూడా ఊహించలేదు. ఉత్తరాన్ని కవిత్వంగా రాసేవో కవిత్వాన్ని ఉత్తరంగా మలిచావో కానీ నీ అమృతాక్షరాలలో నాకోసం రాసిన ఓ చిన్ని ప్రేమ లేఖ , నిజం చెప్పాలంటే అసలు నేను జీవితం లో అందుకున్న తొలి ప్రేమ లేఖ.
  

కృష్ణా! ఈ ఆనందాన్ని మాటలలో వర్ణిస్తే వన్నె తగ్గి పోతుంది. నిజం, నా మనో భావానికే ఓ రంగు రూపు మాట వస్తే "హరివిల్లు' లోని సప్త వర్ణాలని మించిన నీ ప్రేమాక్షరాలు నా హృది నిండా పరుచుకున్న నీ మంత్రాక్షరాలు నన్ను నిలువునా వేల వేల పులకింతల తో శత కోటి  సరాగాలతో నన్ను రాగరంజితం  జేసాయి..
"మోహన  వంశి" లోని లత వర్ణించిన కృష్ణుడు కూడా చెయ్యని పని నా కోసం నా చిన్నారి కృష్ణుడు చేసాడన్న తలపు నన్ను భూమికి ఒకింత ఎత్తులో నడిపిస్తోంది....నా మాటలు అతిశయంగా కనిపిస్తే నేనేమీ చేయలేను..కానీ నేనెప్పుడూ సహజం కానిది  ఏదీ సహించలేను, నీవు  రాసిన ఆ గుప్పెడు అక్షరాల పరిమళంతో నా గుండె నిండి పోయింది ఇది సత్యం.

కృష్ణా! నీకిది ఓ కవిత కావచ్చు , మామూలుగా నువ్వు చేసే ఓ ప్రయోగం కావొచ్చు నేమో కానీ నాకు మాత్రం జీవనవనం లో విరిసిన తొలి పారిజాతం. నవ్వుతున్నావు కదూ నా పిచ్చికి , అయినా నేనేమీ సిగ్గు పడనులే. రాసింది నీకు కాదు అంటావా ? పోనీ కాసేపు నీ "బంగారు కొండ" అని నువ్వు సంబోధించిన నీ ప్రేయసి నేనే అనుకుని సంబర పడతాను.
అందుకు ఏమీ అనవు కదా. 

కృష్ణా! మన్నించు నువ్వు నిజంగా నీ ప్రేయసికే రాసి  ఉంటే అది అందుకునే అర్హత నాకు లేకున్నా చదువుకుని నన్ను "ఆమె" గా ఊహించుకుని రాస్తున్నందుకు. బహుశా అత్యుత్సాహంతో మరీ రాసేస్తున్నానేమో...కదూ ....ఏదో తట్టుకోలేని సంతోషం ......ఎల్లలులేక పంచప్రాణాలు ఎగిరి వచ్చి నీ పాదాల పై వాలాలన్ననా అంతరంగపు అనాది ఆకాంక్ష ని మాత్రం ఆపుకునే శక్తి లేని దాన్ని ...మన్నించవూ....నా అనురాగ అనుతప్త హృది లో నిలిచిన నీకు కాక ఇంకెవరికీ అర్ధం కాని నా పిచ్చి రాతలు ....నా నుదుటి గీతాలు....అందుకే ఇలా కురిసిపోతున్నాపదాలుగా ......నీ లేఖామృతము గ్రోలిన మైమరపులో ......మన్నించు.....

                                     అనుక్క్షణం నీ కోసం పరితపించే ఓ మమతా మనస్విని .......నీ.....జగతి 3.20pm sunday 11/12/2011


2 comments:

  1. very great feelings.. heart filling emotions.. so great of u dhatri..

    ReplyDelete
  2. ఈ మమతానురాగాలు నీకే కృష్ణా..
    అంటు సంపూర్ణంగా ఆ కృష్ణుడికి అంకితమవుతున్న
    ధాత్రీ నిన్నేమని పొగడను..?? !!! నీ ఇమోషనల్..
    నా గుండెను ఒక్కసారి చప్పుడు ఆపి తిరిగి స్పందించింది
    నీ మాటలు..రాతలు..కవితలు..అన్నీ..నాకు నచ్చాయి ధాత్రీ

    ReplyDelete