Tuesday, April 23, 2013

మౌనించిన "స్వర వసంతం " అన్నపూర్ణ దేవి ( ఎన్ అన్హర్డ్ మెలడీ )







మౌనించిన "స్వర వసంతం " అన్నపూర్ణ దేవి ( ఎన్ అన్హర్డ్ మెలడీ )

సప్త స్వరాలే సమ్మె చేస్తే , ప్రణవ నాదమే ప్రకోపిస్తే 
సరస్వతి వీణా గానం మానిమౌనిస్తే 

ఏమౌతుంది , ప్రపంచమంతా నిశ్శబ్దం లో శూన్యం లో మునిగి పోతుంది . కానీ ఈ అపర సరస్వతి అలా చెయ్యలేదు . తన కున్న సంగీత సంపదను విద్య దానం చేసి తానూ మూగావోయినా వారిని తన సంగీత  సౌరభానికి ప్రతీకలుగా చరిత్ర లో నిలిపింది .  ఒక హరి ప్రసాద్ చౌరసియా , నిత్యానంద్ హల్దిపూర్ , నిఖిల్ బెనర్జీ , సురేష్ వ్యాస్ లాంటి ఉత్తమ కళాకారులను ఎందరినో మన కందించిన ఒక మౌనించిన సంగీత సరస్వతి అన్నపూర్ణా దేవి గురించి మనం ఇప్పుడు మాటాడు కుంటున్నాం. 

ఇటీవలే కాలం చేసిన పండిట్ రవిశంకర్ మొదటి భార్య అని చెప్పాల్సి రావడం నిజంగా దురదృష్టమే . ఎందుకంటే ఎవరికీ కనిపించక వినిపించక ఈ లోకాన్ని త్యజించిన తాపసి ఈమె. ఒక గొప్ప కళాకారునిగా మనమందరం గౌరవించిన రవి శంకర్ జీవితాన్ని పంచుకున్న భాగస్వామిని ఏ కాక అతని వల్ల దాదాపు ఐదు దశాబ్దాలుగా తనకి తానూ విధించుకున్న శిక్ష లా ఇహ లోకానికి దూరమైన విదుషీమణి అన్నపూర్ణా దేవి . 

ఆమె సాక్షాత్తూ భారత దేశం గర్వించే సుర్ బహార్  విద్వాంసులు బాబా అల్లౌద్దిన్ ఖాన్ గారాల  పట్టి . ముస్లిం ఇంట హిందూ పేరా అని మనం అందరం ఆశ్చర్య పడటం సహజమే. చైత్ర పౌర్ణమి నాడు దివి నుండి భువికి అరుదెంచిన అన్నపూర్ణ వంటిదని , ఈ మాటలే మహారాజ బ్రిజ్ నాథ్ సింగ్ ఉస్తాద్ బాబా తో అనగా అతని మీదున్న వాత్సల్యం తోనూ , కాశీ అన్నపూర్ణ దేవి ని గూర్చి రాజా వారు చెప్పిన కథ విన్నాక , అల్లౌద్దిన్  ఖాన్ తన కూతురికి అన్నపూర్ణ అన్న నామమే స్థిరపరిచారు . అన్నపూర్ణ ఎంత అందంగా సంగీతం  లా వినబడుతోంది ఈ మాటా అనుకుంటూ 
" ఆ ని ని పా రెని " అని గళ మెత్తి  పాడుకుని మురిసిపోయాడు తండ్రి  . ఐతే అప్పుడు ఆమె ఇంత విద్వాంసురాలు అవుతుందని , కను మరుగై పోతున్న  అద్వితీయమైన వాయిద్యం " సుర్ బహార్ " కు చేతులోడ్డి కాపాడుతుందని అనుకోలేదు . 
సంప్రదాయానికి ఏదో రోషనార అని ముస్లిం పేరు పెట్టినా ఎవరికీ ఆమె పేరు రోషనార అని తెలీదు గుర్తులేదు . అన్నపూర్ణ గానే విరాజిల్లింది ఈ అమృత గాన లాహరి . 

ఘరానా సంప్రదాయ సంగీతాన్ని కేవలం తమ పుత్రులకే వారసత్వంగా బోధించి తయారు చేసేవారు. ఇందులో కూతుళ్ళకు స్థానం లేదు . అలాగే బాబా కూడా అన్నపూర్ణను అసలు సంగీతం వైపుకే రానివ్వలేదు .  మరో ముఖ్య కారణం కూడా ఉంది , అన్నపూర్ణ కంటే పెద్దమ్మాయి జహానారకి సంగీతమంటే ప్రాణం . ఆమె ఉత్సాహానికి ఊతం ఇచ్చి పుట్టింట్లో ఆమెకు సంగీతాన్ని నేర్పేరు కుడా . కానీ ఆమె దురదృష్టం అత్తవారింట్లో గొంతు విప్పి కనీసం కూనిరాగం కూడా తీసేందుకు వీలుకాలేదు . అన్ని అంక్షల మధ్య బ్రతకలేక నిరాశతో ఆత్మ హత్య చేసుకుంది ఆమె . అప్పటినుండీ అస్సలు ఆడపిల్లలను సంగీతం జోలికే రానిచ్చేవారు కాదు ఆమె తల్లి తండ్రి . 

ఒక నాడు బాబా తన వారసుడు సుపుత్రుడు అయిన అలీ అక్బర్ ఖాన్ కు సంగీతం నేర్పుతూ ,కొన్ని స్వరాలూ పలకించడం లో అపశృతి పలుకుతుంటే ఓర్చుకోలేని కోపం తో బయటకు వెళ్లి పోయారు బాబా . కాసేపు పోయాక కోపం లో వెళ్ళిపోయారు కానీ డబ్బులూ సంచీ తీసుకుని బజార్ కి వెళదామని తిరిగి వచ్చిన ఆ సంగీత విద్వాంసునికి తన ఇంటి  నుండి సుస్వర సుమధురమైన సంగీతం వినిపించింది . చూస్తే పదేళ్ళ అన్నపూర్ణ సోదరునికి తండ్రి చెప్పిన స్వరాలూ సరిగ్గా ఎలా పలకాలో పాడి వినిపిస్తోంది . వెనుకగా నించుని తన గానం తండ్రి వింటున్నాడని తెలియని అన్నపూర్ణ గాన పరవశం తో పాడుతోంది . అప్పుడు ఆమెను అలాగే కూర్చున్న ఫళాన జుట్టు పట్టుకుని దాదాపు ఈడ్చుకేల్తున్నట్టుగా సంగీత 
వాయిద్యాల గదిలోనికి సరస్వటి దేవి విగ్రహం ముందుకి తీసుకెళ్ళి ఆమె చేతిలో సుర్ బహార్  ఉంచారు బాబా అల్లుద్దిన్ ఖాన్ . ఈ క్షణం నుండి నీవు సంగీతానికే కట్టుబడి ఉండాలి . ఇన్నాళ్ళూ నిన్ను నేను గుర్తించలేదు . నీలోని అంకిత భావం నన్ను ముగ్ధుణ్ణి చేసింది అన్నపూర్ణా , ఇక నీవు వివాహితావు సంగీతానికే ఇచ్చి నిన్ను వివాహం చేస్తున్నాను . నీ జీవితం లో ఏ పరిస్థితిలోనూ సంగీతాన్ని విడిచి పెట్టనని మాట ఇవ్వు అని అడిగారు బాబా . ఆనందం , ఆశ్చర్యం, అనుకోకుండా వచ్చిపడిన అదృష్టం అన్నీ అన్నపూర్ణను ఆ క్షణాన సంగీతానికి బద్దురాలిని చేసాయి . తండ్రి విద్వత్తు పట్ల ఉన్న హిమాలయ శిఖరమంత  గౌరవం  సంగీతం పట్ల ఉన్న ప్రాణ ప్రదమైన ఇచ్ఛ ఆమెను వివశు రాలిని చేసాయి . 
అది ఎటువంటి దివ్య క్షణమో ఆ క్షణాన తండ్రికిచ్చిన మాట నేటికీ తప్పలేదు ఆమె . సంగీతమే సర్వస్వంగా జీవించింది , జీవిస్తోంది . 

అండ్ ఆల్ ఈస్ వెల్ అన్నది జీవన లక్షణం కాదు కదా . అందుకే సంగీత ధ్యానం లోనూ తపస్వినిగా అలరారుతున్న అన్నపూర్ణ పదునాల్గవ  ఏట ఆమె జీవితం లో రవి శంకర్  ప్రవేశించాడు  . ఆమె తండ్రి వద్ద విద్య అభ్యసించడానికి వచ్చిన రవి శంకర్ , బాబాకు అత్యంత ప్రియ శిష్యునిగా మారడం , అన్నపూర్ణను ఇష్టపడి . తండ్రి అనుమతి తోనే వివాహం చేసుకోవడం జరిగాయి . అప్పటికే రవి శంకర్ పేరున్న సితార్ వాద్యుడు . కానీ  అల్లౌద్దిన్ ఖాన్ శిష్యరికం లో తన విద్యకు చాలా మెరుగులు దిద్దుకున్నాడు . వజ్రాన్ని   సాన పట్టినట్టు రవిశంకర్ ని తీర్చి దిద్దారు బాబా . అందులో అన్నపూర్ణ కూడా సహాయం చేసేది . బాబా దగ్గర అభ్యాసం ( ఉర్దూ లో తాలిమ్ అంటారు) , సాధన చాల కఠినమైనవి . అంతటి దీక్షా పట్టుదల లేకుంటే వారికి సంగీతం నేర్పేవారే కాదు బాబా . 

అప్పటికే  ప్రాచీనా వాయిద్యమైన "సుర్ బహార్ "  ను బాబా అన్నపూర్ణకు నేర్పేరు . సితార్ ను మించిన అతి కష్ట మైన మధురమైన వాయిద్యం సుర్ బహార్ . వీణ సితార్ కన్నా చాలా కష్ట తరమైన వాయిద్యం . సుర్ బహార్ ఆహా ఎంత అందమైన పేరు "స్వర వసంతం " (సుర్= స్వరం, బహార్ = వసంతం ) . ఇంతటి అన్దమైఅన్ కష్టమైనా ఇప్పటికీ ఎవరూ సాధించలేని ఈ వాయిద్యాన్ని వారసత్వంగా తన పుత్రికకు సరస్వతీ రూపమైన అన్నపూర్ణకు ఇచ్చారు ఉస్తాద్ అల్లౌద్దిన్ ఖాన్ . ఆయన నాటికే భారత దేశం గౌరవించే అతి కొద్ది మంది విద్వాంసులలో ప్రసిద్ధి పొందిన కళాకారులు . 
అన్నపూర్ణ రవి శంకర్ వైవాహిక జీవితం :

1938 లో ఒక నాడు తండ్రి ఆధ్వర్యం లో అతని శిష్యుడైన రవి శంకర్ కు భార్య అయింది అనపూర్ణ . సంగీత సాధనే తప్ప కనీసం తన దేహం లోని మార్పులు కుడా సరిగా అర్ధం చేసుకోలేని పసి మొగ్గ , రవి శంకర్ పట్ల విపరీతమైన ఆరాధనా భావం భార్తగానే గాక , సంగీత విద్వాంసుడిగా కూడా అతనంటే పంచ ప్రాణాలు అన్నపూర్ణ కి . సంగీతం , భర్త తో కలిపి సాధన , అతని ప్రేమ తీవ్రత , ఇందులోనే మునిగి పోయిన అన్నపూర్ణకు తాను పెళ్ళైన మొదటి నెలలోనే నెల తప్పానని కుడా తెలియలేదు . తాను తల్లిని కాబోతున్న విషయం రవి శంకర్ కు చెప్పింది . తమ ప్రేమ ఫలించ బోతుందని ఆనందం రవి శంకర్ వదనం లో . 30మార్చ్  వ  తేదీ 1942 లో శంకర్ వంశాంకురం అయిన తనయుడు జన్మించాడు వారికి . తల్లి పరిచర్య లో తోలి బిడ్డను కన్నది అన్నపూర్ణ . మన పుత్రుడు మనకన్నీ శుభాలనే తీసుకుని వచ్చాడు అందుకు అతనిని " సుభేంద్ర శంకర్ " అని పిలుద్దామని తండ్రి అయిన ఉత్సాహం తో రవి శంకర్ ఉద్విగ్నంగా పలికాడు . 

తన సుర్ బహార్ , రవి శంకర్ , సుభేంద్ర తో కలం గడిచిపోతోంది అన్నపూర్ణకు . కానీ పిల్లడు మెలిక పడిన పేగులతో పుట్టడం వల్ల ఎప్పుడూ అనారోగ్యం తో బాధ పడేవాడు . రాత్రంతా నిద్ర పోయేవాడు కాదు . దీనికి తోడు  సుభో పుట్టిన రెండున్నరేళ్ళకి  1944 నవంబర్ లో రవిశంకర్ కు విపరీతమైన విష జ్వరం సోకింది . దేహ ఉష్ణోగ్రత 106 కు తగ్గేది కాదు . తండ్రీ కూతుళ్లిద్దరూ హడలి పోయారు రవి శంకర్ స్థితికి . రవి శంకర్ సోదరుడైన రాజేంద్ర శంకర్ వీరిని తన ఇంటికి బొంబాయి తీసుకెళ్ళి ఉంచుకున్నారు . ఇది విషమ పరీక్షా సమయం అన్నపూర్ణ కి  ఒక పక్క జ్వరం తో భర్త , మరొక పక్క అనారోగ్యమైన కొడుకు , వీరికి సపర్యలు చేస్తూనే తన సంగీత సాధన ఎప్పుడూ వదల లేదు ఆమె . 

అన్నిటికంటే కష్ట తరమైన విషయం రవి శంకర్ జ్వరం నెమ్మదించిన తర్వాత చాలా మటుకు జ్ఞాపక శక్తిని కోల్పోవడం . అసలు సితార్ ముట్టుకునే పరిస్థితిలో కూడా లేకుండా నీరసించిపొయిన భర్తను తన సపర్యలతో సేవ చేస్తూ , మరో పక్క అతను  మరిచిన సంగీతాన్ని స్వరాలని , రాగాలని గుర్తు చేస్తూ మళ్ళీ మామూలు మనిషిని చేసింది అన్నపూర్ణ లోని ఆత్మా విశ్వాసం , ప్రేమ . 

రవి శంకర్ ది భ్రమరం లాంటి ప్రేమ . అతనికి శ్వాస తీసుకున్నంత సుళువుగా  స్త్రీల పట్ల  ప్రేమ ఏర్పడుతుంది . తన జీవితం లో ఇది వరకే ఉన్న కమల అనే స్త్రీ గురించి కూడా రవి అన్నపూర్ణకు చెప్పేడు . ఇది ఆ చిన్నారి మనసు తట్టుకోలేక పోయింది . తను సర్వస్వంగా , సత్యం గా ప్రేమించిన భర్త మనసులో మరొక స్త్రీ . వివాహం తర్వాత రవి శంకర్ తప్ప లోకం లో సత్యం లేదని నమ్మిన ఏకోన్ముఖి  , అన్నపూర్ణకు ఇది విఘాతం . ఆమె తన నిరసనను తెలిపే విధానం మౌనమ్ . ఎవరినీ ఏమీ నిందించేది కాదు , పరుషంగా  ఒక్క పలుకు పలికేది కాదు ,అరిచి గోల చెయ్యడం వలన , నిందించడం వలన ప్రయోజనం లేదని ఉండదని ఆమెకు తెలుసు అందుకే  స్థాణువు లా అలా రాత్రంతా మౌనంగా కూర్చునేది . 

రవి శంకర్ కు అంతు  పట్టని విషయం ఇదే . వివాహమంటే ఒకరి కొకరు ఒక స్ఫూర్తిగా ఉండాలని , అతని భావన . అన్నపూర్ణ ఒక్క సారిగా  తనను పట్టుకుని ఎందుకిలా చేస్తున్నావు అని నిలదీసి ఉంటె జీవితం మరో రకంగా ఉండేది అనిపించింది రవి శంకర్ కి . కానీ అమెది మౌన ప్రతిఘటన అంతే . అన్ని పనులూ చేసేది ఇంటి పనులూ పిల్లాడి పనులూ భర్త పనులూ అన్నీ కానీ మౌనం వీడేది కాదు . ఇది  నడుమా పెద్ద అగాధాన్నే సృష్టించింది . కమలతో తన ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకున్నాడు భర్త . సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన ఆమెకు ఆయన ఒప్పుకోవడం మరో స్త్రీతో ప్రేమ సంబంధం ఇవన్నీ సహించ లేనివి గా కనిపించాయి . కమల రాజేంద్ర శంకర్ ల వివాహం కూడా ఆమె మనసు ను కుదుట పరచలేదు . 
మన్నించలేక పోయింది . 
రవి శంకర్ అన్నపూర్ణ ల వైవాహిక జీవితాన్ని మూడు దశల్లో వివరించవచ్చునంటారు ఈ పుస్తక రచయిత స్వపన్ కుమార్ . అది మైహార్ లో బాబా ఇంట్లో వారి కలయిక పరిచయం , ఆల్మోర లో వారి వివాహం , సుభేంద్ర పుట్టుక, కమల మరల రవి హీవితం లో ప్రవేశించడం , అన్నపూర్ణ తిరిగి మైహార్ కు చేరుకోవడం . ఇవన్నీ 1938 -1942 నడుమ జరిగి పోయాయి .  రెండవ దశ 1942 -1956 వరకు వారు , బొంబాయి , లక్నౌ , ఢిల్లీ , మైహార్ , కలకత్తాలోని వారి జీవితం , కాపురం . మూడవ దశ ఆక్కడి నుండి నేటి వరకు అన్నపూర్ణ జీవిస్తోన్న జీవితం . 

రెండవ దశ లో రవి శంకర్ బొంబాయి లోనూ , ఢిల్లీ లోనూ ఆల్ ఇండియా రేడియో లో పనిచేస్తున్నప్పుడు ఆమె ఇటు పుట్టింటికీ అటు రవి ఉన్న ఊరికి వెళ్లి వస్తుండేది . జరిగినదేదో జరిగింది మళ్ళీ జీవితం సరి దిద్దుకుందామని రవి అడిగినప్పుడు ఆమె వ్యతిరేకించలేదు . సర్దుకు పోవాలనే ప్రయత్నించింది . కొంచం కొంచం గా ఆమె బయటి లోకానికి దూరం కాసాగింది . ఐదారు ప్రదర్శనలు  రవి శంకర్ తో ఇచ్చిన మీదట అతనిలో ఆమె పట్ల ఈర్ష్య అసూయ , తనకంటే ఆమెకే అందరూ పెద్ద పీట వెయ్యడం తన భర్తకు రుచించలేదని గ్రహించింది . ఇక ఆనాటి నుండీ కచేరీలు చెయ్యడం అతనితో కానీ  , ఒంటరిగా కానీ పూర్తిగా మానేసింది . 

ఈ అంశం ఆధారంగానే ప్రఖ్యాత దర్శకులు హృషీ కేశ్ ముఖర్జీ " అభిమాన్ " చిత్రాన్ని నిర్మించారు . అయితే చిత్రం కనుక చివరిలో భార్య భర్తలు కలుస్తారు , కానీ అన్నపూర్ణా రవి శంకరుల దాంపత్యంలో  మాత్రం ఆ వెలితి అలాగే ఉంది పోయింది . 
మౌన వ్రతం రాను రాను బలీయం కాసాగింది . బాధా తప్త హృదయం తో , ఆమె టాగోర్ గీతాంజలి వంటి పుస్తకాలను చదవడం , తనకి తానుగా ఒక లోకం లోకి వెళ్లి పోవడం జరిగింది .   
ఇన్ని జరిగినా ఆమె జీవితం లో వదలని సడలనిది కేవలం సంగీతమూ , సుర్ బహార్ మాత్రమే . మనో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు వంటివి చదవడం లో మునిగి పోయేది . పైకి భర్త కోసం , బిడ్డ కోసం సంసారం లో ఉన్నా ఆమె ఎప్పుడో తన గమ్యాన్ని నిర్ణయించుకుంది అది బాబా ఆమెకు ఇచ్చిన సంగీతం . అది తానూ ప్రదర్శన మానుకున్నా మరి కొంతమందికి నిజంగా సంగీతాన్ని జీవిక గా గాక జీవితం గా స్వీకరించిన కొద్ది మంది శిష్యులను వజ్రాల వంటి వారిని తయారు చేసింది . అందులో హరి ప్రసాద చౌరాసియా లాంటి వారు ముఖ్యులు . 

 రవి శంకర్ ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ లో డైరెక్టర్ పదవి లో ప్రవేశించారు 1949 లో . ఇక ఆమెకు మిగిలింది ఇటు అటు సంసారం సంగీతం , ఆమె ఆశల మొలక సుభేంద్ర ని సుర్ బహార్ లో సుశిక్షితుణ్ణి చేయడం . ఇది ఆమె జీవిత ధ్యేయం గా పెట్టుకుంది . చిన్నారి సుభో కి తల్లి చేయించే కఠిన మైన సంగీత సాధన నచ్చేది కాదు . ఏవో బొమ్మలు గీసుకోవడం , తండ్రి వచ్చి తనని తీసుకుని వెళితే బాగున్ను అని ఉండేది . ఆరోజు రానే  వచ్చింది కొడుకు కోసం తల్లి తండ్రులను పుట్టింటిని వదిలి మౌనంగా మళ్ళీ భర్త వెంట నడిచింది అన్నపూర్ణ . భర్త వెంట అడవికి సీతమ్మ లా వెడలిపోతున్న కూతుర్ని చూసి తల్లి కన్నీరు మున్నీరయ్యింది . ఆమె లేని ఇల్లు శూన్యంగా అగుపించింది తండ్రికి . 

సంగీత సామ్రాజ్యం లో మకుటం లేని మహారాజుగా పండిట్ రవి శంకర్ సితార్ విద్వాంసుడిగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నారు . సుభో ని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చిత్ర కళ నేర్పే పాఠశాల లో పెట్టేరు రవి శంకర్ . 1967 లో తన విదేశీ పర్యటనలో కమల ను తన సహచరిగా పర్యటించి వచ్చారు . కామాలను వివాహం చేసుకున్నారు తర్వాత . 

తల్లి , తాతయ్య ల శిక్షణలో అతని వయసుకు మించిన ప్రతిభతో రాణిస్తున్న సుభో ని తండ్రి తీసుకుపోతాను అని రావడం ఆమెకూ బాబాకూ చాలా  వ్యాకులత కలిగించింది . అతని మాటనే పట్టుకుని తానూ చిత్రకళ లో రానిస్తాననే నమ్మకం తో సుభో సంగీతాన్ని విడిచాడు . అప్పటికీ అన్నపూర్ణ ఒకే ఒక్క విషయం చెప్పింది సంగీతం మొదలైన దగ్గరనుండి అది కొన్ని సంవత్సరాలు సాగుతుంది ఆ సమయాన్ని  "తాలిమ్ " అంటారు అంటే శిక్షణా సమయం . అది ఇంకా ఒక ఏడాదిన్నర ఐతే పూర్తవుతుంది అప్పుడు  సుభో ని తీసుకెళ్ళండి అని చెప్పినా రవి శంకర్ ఆమె మాట వినలేదు . ఇది తట్టుకునే శక్తి ఆమె లో లేక పోయింది . బాబా అంతటి వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు సుభో సంగీత శిక్షణ సగం లో ఆపేయడం చూసి . " మనది సంగీత సంప్రదాయం గల వంశం , చిత్ర కళ  కేవలం నీకు కాలక్షేపం మాత్రమే సంగీత శిక్షణ పూర్తి చేసాక నేర్చుకోవచ్చ్సును " అని ఎంతగా నచ్చ చెప్పా ప్రయత్నించినా సుభో నిలకడలేని మనసు తండ్రి ప్రోత్సాహం తో ఆమెకు ఎదురు తిరిగింది . రవి శంకర్ తో ఈ విషయం చర్చించాలనుకుంటుంది కానీ చెయ్యదు . మౌనంగా ఊరుకుంటుంది తన ఆశయాలను , ఇష్టాలను ఏవీ ఎవరి పైనా రుద్దే స్వభావం కాదు అన్నపూర్ణ ది . 


నిర్దయమైన కాలం కరిగిపోయింది . సుభో ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్న రోజున రవి శంకర్ హతాశు డయ్యాడు . ఈలోపల మైహార్ లో తల్లి కి మొదలైన మూర్ఛ (ఫిట్స్ ) , మరొక పక్క తండ్రి నిరాదరణ ఇవన్నీ సుభో ని తల్లీ తండ్రిని ద్వేషించే లా చేసాయ్ . అతి సాధారణ మైన బిడ్డకి కుడా దక్కే తల్లి తండ్రుల ప్రేమ తనకు లేదనిపించేది . 

అమ్మ తనను ఎంతగానో ప్రేమించేది , నాన్నా అంటే కానీ తానూ ఎవరికీ చెందని వాడి పోయిన ఒంటరితనం సుభో ని కాల్చివేసేది . తనలోకి తనే ముడుచుకు పోయేవాడు . అలాంటి  సమయం లో లిండా అనే అమెరికన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు . ఇద్దరు పిల్లలు సోమ , కావేరి . భారత్ టెలిఫోన్స్ లోపనిచేస్తూనే తండ్రితో కలిసి మళ్ళీ సంగీత ప్రదర్శనలలో పాల్గొనడం మొదలు పెట్టేడు . తండ్రి యశ స్సూ కీర్తీ , ఆతని ప్రదర్శనా చాతుర్యం ఇవన్నీ చూస్తుంటే తానూ ఏమీ కాను తండ్రి ముందు అనే న్యూనతా భావం ఏర్పడింది సుభో లో 

. కొన్ని సార్లు తండ్రి తో కలిసి కచేరీ   వెలితి లోపం కనిపించేవి , కాళ్ళ ముందు  తల్లి అగ్రహ రూపం కనిపించేది , తనని దిద్ది  ఆమె పడిన శ్రమ గుర్తొచ్చేది . నెమ్మదిగా సుభేంద్ర ఒంటరి తనం లోకి జారుకున్నాడు 1992 లో అతి దారుణ మైన మానసిక స్థితిలో అమెరికాలోని ఒక హాస్పిటల్ లో మరణించాడు  సుభో . 

ఒక గొప్ప సంగీత వారసత్వానికి ప్రతీక అయిన సుభో ఆకహ్రి రోజుల్లో తల్లినే తలుచుకుని కునిలి పోయేవాడు . తాతయ్య ఇంటిలో మైహార్ లో ని తన బాల్యాన్ని గుర్తు చేసుకునేవాడు , అమ్మ చివరి సారిగా ఏమి నిర్ణయించుకున్నావు అని తనని అడిగిన క్షణాన స్వతంత్రంగా బతకలనుకుంటున్నాను అనే తన సమాధానం గుర్తొఛ్చి , అప్పుడు అమ్మ టాటా చేతిలో ఉన్న తన సంగీటం నోట్ పుస్తకాన్ని విసిరేసి వెళ్లి గది తలుపేసుకుని " తీసుకెళ్ళి పోండి , వాడు నా కక్కరలేదు " అని ఏడుస్తూ అరవడం రాత్రుళ్ళు గుర్తొచ్చేది మరణ శయ్య పైన . తండ్రితో కనీసం మాటాడటం కూడా మానేసాడు . అలా చివరికి కుములి పోతూ ఒక తెలిజాము 4 గంటలకి 15 సెప్టెంబర్, 1992 నాడు తుది శ్వాస విడిచాడు అన్నపూర్ణా రవిశంకర్ ల కళల , కలల పంట అయిన సుభేంద్ర శంకర్ . 

ఇది ఇంతవరకు జరిగిన జీవన నాటకం అయితే ఇక గురువుగా అన్నపూర్ణ సాధించిన దేమిటో చూద్దాం . 

పండిట్ హరిప్రసాద్ చౌరసియా అప్పటికే సినీ వినీలాకాశం లో ధ్రువతారగా వెలిగిపోతున్న సమయం . అయినా ఒక నాడు అన్నపూర్ణ విద్వత్తును తెలుసుకుని ఆమెను వెదుక్కుంటూ బయల్దేరాడు . ఆమె చాలా ఉద్విగ్న స్వభావం నిన్ను పలకరించాను కూడా పలకరించాడు అన్న నేస్తం మాటలు పక్కకు నెత్తి అన్నపూర్ణను కలిసాడు హరి ప్రసాద్ . ముందు సినిమా వాళ్ళకి నేర్పించాను నేను పైగా నాకు వెనువూ గురించి ఏమీ తెలీదు అని కొట్టి పారేసింది అతన్ని ఆమె. కానీ సాధన మళ్ళీ మొదటి నుండీ నేర్చుకోవడానికి ఒప్పుకున్నాక తాలిమ్ (శిక్షణ ) మొదలయ్యింది . ఒక నాడు పాఠo చెప్తుండగా ఆమె ఆరోగ్యం సరిగా లేదని విపరీతంగా దగ్గు వస్తోందని గుర్తించి మరునాడు ఆమెకు కొన్ని మందులు తీసుకెళ్ళి ఇచ్చాడు . ఆమె ఆ మందులు పారేసి ఎందుకు నాకు మందులు బతకాలి అనుకున్న వారికీ  గానీ నాకెందుకు అని కసురుకుంది .

 హరి ప్రసాద్ తన మాటల్లో అంటాడిలా  ఆమెను గూర్చి " ఆమె ఒక "మౌన సాధిక" , సంగీతం మాత్రమె శ్వాసించే చక్కని గురువు . ఆమె శిక్షణలో ఏంటో నేర్చుకున్నాడు తాను. ఆమె ఒంటరితనం ఎందుకు కోరుకుందో తెలీదు ? అన్న ప్రసన కి ఆమెను  కొన్నాళ్ళు  గమనించాక అప్పుడు అనుకున్నాడిలా "నిజమే ఆమె సాధారణ మానవి కాదు , బాబా అల్లౌద్దిన్ లాంటి సరస్వతి పుత్రుల ఇంట పుట్టిన అపర సరస్వతి ఆమె ఈ మామూలు మనుషులతో , సాధారణమైన మాటలు ఎలా కలపగలదు . ఆమె దివి నుండి ఒక కార్యార్ధం వచ్చిన దేవతా మూర్తి . ఆమెను అతి దగ్గరగా చూసిన  , ఆమె దీక్షను , కఠినమైన నియమాలను అటు జీవితం లోనూ , ఇటు సంగీతం లోనూ కలిగిన ఆమెకు శిష్యుడు కావ డం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాడు హరి ప్రసాద్ . 

ఆమెకు మరో శిష్యుడు రూషి . తర్వాత అన్నపూర్ణ రూషిని వివాహం చేసుకున్నారు . అయినా నేను ఆమెకు ఎప్పుడూ శిష్యుడినే అనే రూషి ఒక వ్యక్తిత్వ వికాస తరగతులు చెప్పే ఒక మనో విజ్ఞాన శాస్త్ర వేత్త , పైగా మానేజ్మెంట్ లెక్చర్స్ దేశ  విదేశాల్లో ఇచ్చే వారు . సంగీతం నేరుచుకోవడానికి అన్నపూర్ణ దేవి వద్దకు వచ్చి తనను ఆమె సోదరుడు ఆలి అక్బర్ ఖాన్ పంపేడని  చెప్పినప్పుడు " నేను హిప్పీలకు నేర్పను " అని ఖచ్చితంగా చెప్పేసింది ఆమె . తన సోదరుడు పంపిన కారణంగా ఆ గౌరవం  తో అసలు ముందుగా రూషి కి సంగీత శిక్షణ మొదలు పెట్టింది .  

" మరి ఆమెను మీరెలా పెళ్లి చేసుకున్నారు ?" అంటూ ఆసక్తిగా అడిగిన స్వపన్ కుమార్ ప్రశ్నలకి  రూషి నవ్వేస్తూ ఇలా అంటాడు , " మేమిద్దరం మంచి స్నేహితులుగా పరస్పర గౌరవం  తో మెలుగుతాము . ఇప్పటికీ నాకు అనపూర్ణ గురువే . మీరు ఊహించిన ప్రేమ కథలేమీ జరగలేదు మామధ్య . కొన్నేళ్ళు గడిచాక ఒకానొక రోజు వివాహం చేసుకుందాం అనుకున్నాం అంతే . అందులో మీరు ఎంత ఊహించి కల్పించి రాయడానికి ఏమీ లేదు . ఒక మామూలు నిర్ణయం తీసుకున్నట్టు గానే మా వివాహం జరిగింది . " 

ఒకరికొకరు తోడుగా సంగీతం శ్వాసగా జీవించే వీరు 1982 లో రవి శంకర్ నుండి ఆమె విడాకులు తీసుకున్న చాల కాలానికి వివాహం చేసుకున్నారు . 
జీవితం లో కొన్ని చిత్రాలు ఇలాగే ఉంటాయేమో అంటాడు రూషి , కేవలం భయ భయంగా ఆమె తనకు సంగీతం నేర్పితే చాలనుకుని వచ్చిన తనకు , అన్నపూర్ణ కూ  మధ్య ఈ బంధం ఏర్పడటం దైవికం . ఒకరి స్వేచ్ఛను మరొకరు గౌరవిస్తూ , ఆమె నిర్ణయాలకు , లోకంలో  మనుషులతో కలవని ఆమె ఒంటరితనం నుండి ఆమెను ఏ  మాత్రం చికాకు పరచకుండా చూసుకుంటాడు తను . 

అన్నపూర్ణ ప్రస్తుత జీవితం : 

ఒకే ఫ్లాట్ లో ఉంటున్నా ఆమె జీవితం ఆమెది . తన పనులన్నీ తనే చేసుకుంటుంది . వంట , ఇంటి పనీ కూడా . ఎవరితోనూ మాటాడదు . ఆ ఇంటి ముందు బోర్డ్ మీద రాసుంటుంది మూడు సార్లు బెల్లు మోగించండి ఎవరూ రాకుంటే వెళ్లి పొండి  దయచేసి అని . రూషి ఉంటేనే ఎవరకోసమైనా ఆ తలుపులు తెరుచుకునేది . లేదా ఆమె ఎవరితోనూ మాటాడదు . తనేమో తన సంగీత సాధన అంతే . 
ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నపుడు స్వపన్ కుమార్ అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబులు కొన్నిచూద్దాం . 

అన్నపూర్ణను గూర్చి అన్నపూర్ణ :

1994 నుండి 2004 వరకు ఆమె ను తరచూ ఈ పుస్తక విషయమై కలిసేవాడు  స్వపన్. కొన్ని సత్యాలు వెలుగు చూడాలన్న ఆకాంక్ష తప్ప అనపూర్ణ కు తన గురించి పుస్తకం రాయించుకోవడం ఇష్టం లేదు సుతరామూ .  
కమలను వివాహం చేసుకోవడానికి రవి శంకర్ తన శీలం పై అపనిందలు వెయ్యడం . అవి బాబా తో చెప్పడం . అందుకు బాబా ఉద్విగ్నులై నా కూతురు అలాంటి పని చేసి ఉంటె నేనే ఆమె కింత విషమిచ్చి చంపేస్తాను అనడం .ఆమెకు మనస్తాపం కలిగించిన విషయం ఒక వ్యక్తిని వదలాలనుకుంటే ఆమె మీద యింత క్రూర మైన నిండా వేస్తారా ?

" మీరిచ్చే శిక్షణ లో ఏంటి గొప్పతనం ?" స్వపన్ ప్రశ్న 
" ఏమో నాకు తెలియదు . నేను నేర్పేది మనుషులకి కాస్త మనసుకి సాంత్వన ఇస్తుందని అంతే . అదే నమ్ముతాను  . హరి ప్రసాద్ కి కూడా నేనదే చెప్పాను . కొన్ని స్వరాలూ వేణువుపై పలకవు అన్నాడు తానూ అన్నీ పలుకుతాయి పలికించే నేర్పు మనసు దీక్ష ఉండాలి అని " 
" ఒంటరితనాన్ని ఎందుకు కోరుకున్నారు ?" 
" మనుషులతో కలవడం కన్నా ఇది మనసుకు శాంతి గా ఉంటుంది ఈ ఒంటరితనం . పైగా నాకు కావాల్సిన పనులు నేను చేసుకుందికి వీలవుతుంది " క్లుప్త సమాధానం 
" నేను మీరేదో ప్రతిన బూనారని అనుకున్నాను . మీరు కోల్పోయినవి చాలా ఉన్నాయి జీవితం లో అందుకని ఇలా ..' స్వపన్ 
" లేదు లేదు , అలాంటిదేమీ లేదు , సాధారణంగా నేను ఎందుకు మనుషులను కలవడానికి ఇష్ట పడను అంటే  , వారు ద్వంద్వ స్వభావాలతో ఉంటారు . నా ముందు మంచిగా మాట్లాడి వెళ్లి బయట వేరే గా మటాడుతారు  అది నాకు నచ్చదు . అందుకే ఇలా ఉండిపోయాను " చాలా మామూలుగా ఈ విషయాన్నీ చెప్పింది ఆమె . దాదాపు ఐదు  దశాబ్దాలుగా ఎవరినీ చూడకుండా కలవకుండా , బయటికి రాకుండా ఉండగలిగిన ఆమె విశిష్ట వ్యక్తిత్వానికి , ఆమె మనోనిబ్బరానికి చేతులెత్తి నమస్కరించాలి . 

స్వపన్ పక్కనే కూర్చున్న అతని భార్యను చూసి అంటుంది  ఆమె " ఎవరు పెట్టారు మీ వారి మెదడులో నా  గురించి రాయాలని, ఎందుకింత శ్రమ తెసుకున్నావు నా  గురించి ?" అన్న ఆమె ప్రశ్న కు నేనిలా సమాధానమిచ్చాను అంటారు స్వపన్ . 
" మీరు గొప్ప కళాకారులు కనుక " స్వపన్ 
" అయ్యో అదేమీ  కాదు నేనేమీ గొప్పదాన్ని  కాదు " ఆమె ఈ మాటను  అంతగా పట్టించుకోరు స్వపన్ . ఆమె గొప్పతనం తెలియకపోతే కదా . అలా అనడం ఆమె సంస్కారం నిరాడంబరత . 
" చాలా మంది మీ ప్రవర్తన గురించి చాలా విముఖంగా చెప్తున్నారు ఎందుకని ?" స్వపన్ 
" అదే ఎందుకో పండిట్ జీ (రవి శంకర్ ని ఎప్పుడూ ఆమె అలానే అంటుంది ) నా గురించి నా ప్రవర్తన  గురించి , నేనేదో పిచ్చి దానిలా గా ప్రవర్తిస్తానని , ఎవరైనా వస్తే వారిని కొట్టేందుకు వారి వెంట బడతానని ఇలా ఎన్నో నా మీద దుష్ప్రచారాలు చేసారు . ఒక సారి  కిషెన్ మహరాజ్(కథక్ నాట్యాచార్యులు ) , అతని భార్య సిద్దేస్వరి దేవి వచ్చారు . మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఏంటో అదృష్టం అని నమస్కరించాను . అంతే సిద్దేస్వరీ  దేవి భర్త  వారిస్తున్నా వినకుండా వెంటనే అనేసింది , ఈమె కేమీ పిచ్చ్చి లేదే చక్కగా ఉంది , మరి రవి అలా చెప్పెరేమిటి ఈవిడ గురించి అని . కొందరు భోళా  మనుషులుంటారు ఆమె లాగా మనసులో దాచుకోలేరు . దీనిని బట్టీ నాకు అర్ధమైంది ఆమె ఏవేవో విన్నది నా  గురించి అని ." అన్నపూర్ణ 

ఆమె , ఆమె ఇష్ట పూర్వకంగా శిక్షణ ఇచ్చిన శిష్యులు ఇప్పటికీ గురు పౌర్ణమి నాడు ఇల్లంతా నిండి పోతారు తమ కుటుంబాలతో సహా . అందరితోనూ చక్కగా మాటాడుతుంది . కానీ బయటికి రాదు , ఎవరూ బయటి వారిని కలవదు . ఒక సారి  ఆమె గోలాలలో పెంచుతున్న మొక్కలు చాలా పచ్చగా ఉన్నాయని శుక్లా  అంటే . నిజామా బయట మొక్కలు కుడా ఇలాగే ఉంటాయా అని అడిగేంత పసిపిల్ల లాంటి అమాయకత్వం  అమెది . మళ్ళీ  ఏడాది వచ్చేటప్పుడు మీకు కొన్ని తెచ్చి చూపిస్తా లెండి అంది శుక్లా . 
నాకైతే ఆ మాటలేమీ అర్ధం కాలేదు అంటారు స్వపన్ . ఆమె మనసు లో ఏముందో సాగారమంత లోతు  గలిగిన ఆ మనసులో ఎన్ని అగాధాలు దాగి ఉన్నాయో ఆ సాగరానికే తెలియాలి . రూషి , సాగరం , ఈ ఇద్దరూ మాత్రమే ఆమె సంగీతాన్ని వినగలరు . 

ఒక చిన్నారి పసి మనసు సంగీతమంటే ప్రాణం అయినా తండ్రి వద్ద చెప్పడానికి భయం . అంతటి పిరికి పిల్ల తండ్రి   ఇచ్చిన సంగీత స్వర వరం తో వారసత్వం తో ఎవరూ మొగించని (లేని) "సుర్ బహార్ " ను అభ్యసించి మైహర్ ఘరానా సంప్రదాయాన్ని నిలిపిన తపస్విని అన్నపూర్ణ . జీవితపు ఒడిదుడుకులను తట్టుకోలేక , తట్టుకోక తప్పని పరిస్థితుల్లోనూ కూడా సంగీత సాధన విడవని మొక్కవోని సంకల్ప బలం గల మనోధర్మం ఆమెది . 

" సంగీతానికి చాల శక్తి ఉంది " అంటుంది అన్నపూర్ణ . ఒకోసారి తానూ రాత్రిళ్ళు సాధన  చేస్తోంటే కమ్మని సువాసనలు వేస్తాయని ఎవరో తన చుట్టూ ఉంది వింటున్నట్టు అనిపిస్తుందని చెప్తుంది ఆమె. ఆ సరస్వతీదేవి కరుణ , తండ్రి కటాక్షమే తనని నిలిపిందని ఆమె నమ్మకం . 
సుభేంద్ర కూతురు కావేరి లో మళ్ళీ తనని తానూ చూసుకుంది అన్నపూర్ణ . 
నాట్యం లో నిష్ణాతురలైన కావేరి లో కళ పట్ల అనంతమైన మమకారం చూసింది అన్నపూర్ణ . 

అన్నపూర్ణ ఒక స్త్రీ మూర్తి కాదు , ఒక కళా సాగరం అందులో ఎన్నో నదులు రవి శంకర్, సుభేంద్ర , కమల, అనుష్క (రవి శంకర్ కుమార్తె ) , సోమ (సుభేంద్ర కొడుకు) , లిండా , అన్నిటికీ మించి బాబా, అన్న ఆలి అక్బర్ ఖాన్ , రూషి ఇలా అందరూ పరిమితి లేని కాలం లో కలిసి పోయే వారే . . 

దూషణ భూషణ తిరస్కారాలన్నీ  దేహానికే తప్ప మనో నైర్మల్యాన్ని చెరచ వాణి  నమ్మే ఆత్మ స్థైర్యం గల అన్నపూర్ణ జీవితాన్ని కొన్నేళ్ళు శ్రమ పడి " ఏన్ అన్హెర్డ్  మెలోడీ , అన్నపూర్ణ " అనే ఈ పుస్తకాన్ని 2005 లో తొలిసారిగా అత్యంత శ్రమ దమాదులకొర్చి మనకు ఆర్ణవం లాంటి అన్నపూర్ణ కు ఆవలి వైపున కూడా చూపించి లోకానికి ఆమె చరిత్రను స్ఫూర్తిదాయకంగా అందించిన స్వపన్ కుమార్ బందోపాధ్యాయ్ కి అందరమూ రుణ పడి  ఉండాలి . ఎప్పుడో ఒకోసారి ఆమె పాడితే ఆ మాధుర్యానికి పుడమి పులకిస్తుంది అంటారు ఆమె గానం విన్న వారిలో ఆమె శిష్యుడు  అమిత్. 

అన్నపూర్ణ దేవి అనంతమైన రాగ మేఘం .
 వసంత గర్జన . 
నిశ్శబ్ద ఘీంకారం .
 మౌన ఓంకారం 
జీవనపు పలు రాగాలను అత్యంత రమణీయంగా కర్ణ పేయంగా  పలికించగల అపర సరస్వతి . 
 . 
ఆమె అనంత రాగాల  మాలిక . 
ఇప్పటికీ మౌన ధ్యానం లో 
సాగరుడు శృతి  వేయగా 
ప్రకృతియే విశ్వ శ్రోతగా 
ఆమె దివ్య గానం ఒక తపస్సులా , ఒక యోగం లా , ఒక యజ్ఞం లా అలా సాగి పోతూనే ఉంది . 
సప్త పదులు దాటినా వయసులో కూడా ఆమె దినచర్యలో మార్పు లేదు . ఆమె చిన్ని ఇల్లు , సుర్ బహార్ , ఆమె కోసం ఆమె వేసే గింజల కోసం రోజూ వచ్చే  వందల సంఖ్యలో పావురాలు ఇదే ఆమె కోరుకున్న ఆమెకు శాంతిని ఇచ్చే జీవనం . 

ఆమె ను గూర్చి కాసిన్ని మాటలు చెప్పు కో గలిగినందుకు సంతోషిస్తున్నాను . ఆ అనురాగ రస ఝరికి ఇవే నా మనోవాకాలు . 
................................ .............................                                                                                                                           ప్రేమతో ..జగద్ధాత్రి 
                                                                                                                                                                                          4.29 సాయంకాలం 1వ తేదీ ఏప్రిల్ 2013 సోమవారం 

(ఏప్రిల్ చినుకు 2013 జన్మదిన సంచిక  లో ప్రచురితం )

3 comments:

  1. very good article, intresting. Thanks for posing.

    ReplyDelete
  2. చాలా బాగుందండి ఆర్టికల్. ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. Very profound article. Thank you very much for writing.
    And thanks to తృష్ణ గారు, for referring this.

    ReplyDelete