హర్ ఏక్ కీ అప్నీ తన్హాయీ .........
"తన్హాయీ " ఈ పేరు వినగానే పుస్తకం చూడగానే ముందుగా గుర్తుకొచ్చేది అమితాబ్ సిల్సిలా సినిమాలో చదివిన కవిత "మై ఔర్ మేరీ తన్హాయీ" అంటూ. నాకైతే అదే గుర్తొచ్చింది మరి. పుస్తకం చదవడం మొదలు పెట్టాను. చాల రోజులైందేమో తెలుగు నవల చదివి కొంచం కష్ట పడ్డ మాట వాస్తవమే. అయినా పట్టు వదలక చదివాను. పుస్తకం ముయ్యగానే కలిగిన మొట్ట మొదటి అభి ప్రాయం "ఒక కవయిత్రి నవల రాస్తే ఇలా ఉంటుందన్నమాట" అని.
సరే కల్పన రెంటాల చాల పేరున్న కవయిత్రి , బ్లాగర్ , మంచి విమర్శకురాలు ఇది నేనెవరికీ పరిచయం చేయక్కర్లేదు.
కానీ తన్హాయీ గురించి ఓ నలుగు మాటలు మాటాడుకోవాలి కదా. ఆద్యంతమూ ఆగకుండా చదివించే నవల ఇది అని అబద్ధమైతే ఆడలేను. కొంచం కొంచం గా కూడా చదువుకోవచ్చు. ముందుగా అంత నవల కష్టపడి రాసి ప్రచురించినందుకు ఆమెకి అభినందనలు.
ఇక నవల లో మనం చూడాల్సింది ఇతివృత్తం, రచనా శైలి , అభివ్యక్తి, పాత్రలు. ఈ నవల లోని ఈ విషయాలు చెప్పే ముందు నేను ఇటీవల చదివిన మన భారతీయాంగ్ల రచయిత్రుల నవలల గురించి కొంచం ప్రస్తావించాలి. మంజు కపూర్ "ది ఇమ్మిగ్రెంట్" గురించి ముందుగ చెప్తా ఎందుకంటే ఇక్కడి నుండి అమెరికా వెళ్ళిన భారతీయుల మనో భావాలూ స్త్రీ పురుష ఆకర్షణలూ, సంబంధాలూ అన్నీ చర్చింది ఆవిడ అందులో. దాదాపు గా అటువంటి ఒక బాక్ డ్రాప్ నే తీసుకుని కల్పన ఈ నవల ఇతివృత్తాన్ని ఎన్నుకున్నారనడంలో సందేహం లేదు. ఏ రచయిత అయినా తన చుట్టూ జరుగుతున్నా
విషయావగాహన తోనే ఏదన్న రాయడానికి ప్రయత్నిస్తాడు. అలాగే మరి కొందరు రచయిత్రులు ఈ అమెరికా జీవితాన్ని గూర్చి అక్కడి మన భారతీయుల మానవ సంబంధాల గురించి రాయడానికి పూనుకోవడం ఆంగ్లం లో చాల ఎక్కువ గా ఉంది. మరొక రచయిత్రి అనితా నాయర్ కూడా ఇటువంటి ఇతివృత్తాన్నే అంటే బాక్ డ్రాప్ గా భారత దేశాన్ని తీసుకుని అక్కడినుండి ఇక్కడికి వచ్చిన అమెరికన్ల గురించి రాస్తుంది తన "మిస్ట్రెస్" లో అంటే కల్పన నవల వీటి తో పోలిస్తే ప్రస్తుత ట్రెండ్ కి సరిగానే ఉంది అని చెప్పడం నా ఉద్దేశం.
నిజానికి కల్పన కవయిత్రి గా చాల సీరియస్ అభివ్యక్తి ఉన్న వారు. కానీ తన్హాయీ లో తానెంచుకున్న ఇతివృత్తం చాల బలహీనమైనది. పెళ్ళైన కొన్నేళ్ళ కాపురం తర్వాత మరొక పురుషుడి పై లేక స్త్రీ పై కలిగే ఆకర్షణ, ప్రేమ , ఇవన్నీ చాలా సహజంగా (ఎవరూ ఒప్పుకోనప్పటికీ ) జరుగుతోన్న విషయాలు. ఇక్కడే మనకి అమెరికా వారికీ ఉన్న వైవాహిక బంధాలూ. పిల్లల గూర్చి ఆలోచనలూ, భయాలూ, వ్యక్తీకరిచుకోలేకపోవడాలూ ఇవన్నీ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. కల్పన ఈ రెండు వయవస్థాల్లోనూ వివహ బంధాల్ని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఏ బంధమైన వైవాహిక బంధం మన్సుతోనే ముడి పడి ఉంది. మనసుకి నీటి , న్యాయం, చట్టం ఇవన్నీ తెలియవు.అది మొండిది. అల్లరిది. దానికనిపించినదేదో చెప్పేస్తుంది మనల్ని అతలాకుతలం చేసేస్తుంది. అందుకే మనసులోకి చూసామా చాల భయంకరంగా ఉంటుంది, ఫ్రాయడ్ చెప్పినట్లు ఇద్, ఈగో, సూపర్ ఈగో, ల మధ్య ఈ సంఘర్షణ అనునిత్యం జరుగుతూనే ఉంటుంది.
మనసు పడ్డ వాటిని ఎలాగైనా పొంది తీరాలనే ఇద్, తీర్చుకోవడానికి ఓ ధర్మం సంఘం అన్నిటినీ చూడాలి సుమా అని మందలిస్తుంది సూపర్ ఈగో, వీటి రెంటినీ సమన్వయించి సర్దుబాటు చేసుకుని కాస్త ఇటూ అటూ కాకుండా సమతౌల్యత తో వ్యవహరిస్తుంది ఈగో. ఇద్ ఎవరూ కాదన్నా నిజం. మనిషి నైజం.
ఇక వివాహ సంబంధాల విషయం లో కొన్నేళ్ళు పోయాక ఒక వ్యక్తీ మనల్ని కలుస్తాడు అయ్యో ఇతని అభిరుచులు మనవీ ఒకటేనే, ఇతనే గనుక లేక, ఈమె గనుక ముందరే కనపడి ఉంటే మేము పెళ్లి చేసుకునేవాళ్ళం కదా అన్నది ఒకోసారి ఎదురయ్యే విషమ , ప్రేమ పరిస్థితి. అప్పుడు వారు ఉన్న వయస్సుకు పరిస్థితికి , వారి భార్య లేదా భర్త నుండి విడిపోవడం లాంటివి వేరే గా బ్రతకడం లాంటివి చాలా కొద్ది మంది జీవితాల్లోనే సాధ్యమవుతాయి. కానీ ఏ బంధమైనా అటువంటి స్థితిలో ఏర్పడినప్పుడు అందులో ఏదో ఒక గమ్యం (పర్పస్),లక్ష్యం, ఒక సరి అయిన కారణం ఉంది తీరాలి. అప్పుడు ఆ బంధం నిలబెట్టుకోవడమా లేక మళ్ళీ మన వైవాహిక బంధంలో నే ఉండి పోవడమా అన్నది చాలా క్లిష్టమైన నిర్ణయం.
ఇలాంటి పరిస్తితిలో కలుసుకున్న కల్హారా, కౌశిక్ మధ్య ప్రేమ కలగడం లో ఆశ్చర్యమేమీ లేదు. కానీ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం లో ఇద్దరి ఆలోచనలూ, పరిస్థితులూ ఎలా ఉన్నయనెదీ చర్చించాల్సిన విషయం.
వాంఛ, మొహం , ఇష్టం, వలపు , అంటూ ఇన్ని పేర్లు పెట్టి మనం అసలు ప్రేమ అనే పదాన్ని నాశనం చేసాం అన్నది నా ప్రగాఢ విశ్వాసం. కల్పన వారి మధ్య కలిగింది ప్రేమే అనడం నాకు నచ్చింది. ఎస్ వారి మధ్య కలిగింది ఆకర్షణ కాదు ప్రేమే. ఐతే అన్ని ప్రేమలూ ఫలించవు. అదీ ఒక స్థితి దాటి వచ్చిన తరువాత అవి సాధ్యం కావు అన్నది ఇద్దరికీ తెలుసు.
మనో దేహత్మల్నీ కలపగలిగే శక్తి ప్రేమకే ఉంది. అటువంటి శక్తిని మనుషులు కలిగి ఉండడం మంచి లక్షణం.
కానీ మన చుట్టూ సంఘం, మర్యాదలూ, అన్నిటికీ మించి పిల్లలూ, ఇన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. వీటిని దాటి ప్రేమను పండించుకోగాలమా? అన్నది ఇక్కడ ట్రిల్లియన్ డాలర్ ప్రశ్న. అమెరికా వెళ్ళినా మన మనస్థితి మారదు అన్నది మాత్రం నిజం. అలాగని అమెరికా వారిలో వైవాహిక సంబంధాలు కూడా మంచిగానే ఉంటాయని మోనికా పాత్ర ద్వార చెప్పిస్తుంది రచయిత్రి. ఎందుకంటే ఎవరికీ అతలకుతలమయ్యే జీవితం అక్కర్లేదు. ఉన్నంతలో శాంతంగా హాయిగా ఉండాలనుకుంటాం దానికి కుల మత ప్రాంత దేశ ఖండ బేధాలు లేవు. కనుక మరో స్త్రీ ప్రేమలో పడిన భర్త తిరిగి వస్తాడనే ఎదురుచూస్తుంది మోనికా. అతనికి అవకాశమిచ్చి చూస్తుంది.
ఇక కల్హార , కౌశిక్ జీవన సహచరులు చైతన్య, మృదుల వీరి మనో వీక్షణం చేద్దాం. వీరు అతి సాధారణ భార్య భర్తలుగా చూపిస్తుంది రచయిత్రి . ఒక్క నిమిషం వారిద్దరూ కూడా చదువుకున్న వారే కొద్దో గొప్పో సున్నితమైన ప్రేమ గల మనస్తత్వం కలిగిన వారే మరి వారిలోనూ ఇలాంటి ప్రకంపనలే కలిగితే ? ఏమయ్యేది ? ఇలాంటి ఆకర్షణ కేవలం భార్యకో భర్తకో మాత్రమే కాక ఇద్దరిలోనూ కలగొచ్చు కదా. అప్పుడు ఈ కధ ఏమయ్యేది అని ఆలోచిస్తే , పెద్దలు చెప్పినట్టు గాలీ వానా వస్తే కధే లేదు అనేయోచ్చు. ఇదొక్కటే తప్పించుకునే మార్గం. ఆంగ్ల సాహిత్యంతో గనుక పరిచయముంటే ఇటువంటి ఆకర్షణలు ఒక గొప్ప వ్యక్తీ తనని పట్టించుకోని బహ్ర్త పట్ల భార్యకి కలగడం, కానీ మళ్ళీ అవతలి వ్యక్తికంటే తన భర్తే మంచివాడని ఆ భార్య అతని దగ్గరికే వచ్చేయడం లాంటి సంఘటనలు మనం ఆర్థర్ హైలీ "ఎయిర్ పోర్ట్" లాంటి నవలల్లో చూస్తాం.తన భార్య చేసినది తప్పుగా భావించక ఆమె మనోవ్యధని అర్ధం చేసుకుంటాడు భర్త నవ్వుతూ. ఇది చాల కష్టం ఊహించడానికి మన భారతీయ మనస్తత్వం ఒప్పుకోదు. పూర్వం నలభయి ఏభయి ఏళ్ళు కాపురం చేసినా ఏమాత్రమూ ఒకర్నొకరు విడవకుండా ఉండగలిగే ప్రేమ బంధాన్ని "మిథునం" కధలో శ్రీ రమణ చూపిస్తే పెళ్ళైన పుష్కరం దాటిన సమయం లో మరో వ్యక్తీ వైపు ఆకర్షణ కలగడం అన్నది కల్పన నవలలో చూపిస్తుంది . రెండూ నిజమే , జీవన వాస్తవాలే, అయితే పరిష్కారాలు ఏంటి ?ముగింపులేంటి? అవీ ఆలోచించవలసిన విషయాలు.
సహజంగా కవయిత్రి కావడం మూలానా రచనా శైలి మాత్రం పాఠకుడిని ఆకట్టుకోక మానదు. అందు లో ఆశ్చర్యమేమీ లేదు. కధను నడిపించిన తీరు అందామంటే అసలు కధేదీ? ఇది కేవలం సంఘటనలు, సంభాషణలతో కూడిన ఒక రచన. ఎప్పుడైతే తమ ప్రేమ ను ఒక బంధంగా మర్చుకోలేమని తెలుసుకుంటారో వారు తెలివిగా జీవితాన్ని జగరత్త పడి చక్కదిద్దుకుంటారు. హటాత్తుగా కలిగిన ప్రేమ, తుది నిర్ణయం మధ్య సాగే సంఘర్షనే తన్హాయీ. కొంతమంది తన్హాయీ అని ఎందుకు పేరు పెట్టారు అని ప్రశ్నించారు అది రచయిత్రి ఇష్టం. కానీ తన్హాయీ అంటే ఒంటరితనం. ఈ ఒంటరితనమనేది మనిషి లో మానసికమైనది, దైహికమైనది, సమాజ పరమైనది ఇన్ని రకాలుగా ఉంటుంది. ఎందరి లో ఉన్నా మన వొంటరితనం బాధిస్తుంది , అలాగే ఎంత కావాల్సిన మనిషులైనా , ఉదాహరణకు ప్రేమించే భర్తా, పిల్లలూ. చక్కని సంసారం అన్నీ ఉన్నా కూడా ఈ ఒంటరితనం బాధిస్తుంది. ఇది చెప్పడానికి ప్రయత్నించారు రచయిత్రి అని నా ఉద్దేశం. ఒంటరితననికీ ఏకాంతానికీ చాలా తేడా ఉంది. జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు లోన్లీ నెస్, అలోన్ నెస్ అని ఈ రెంటికే తేడా ఉంది. మనిషి ఎందరిలో ఉన్న ఎంత మందితో ఉన్నా చివరికి తను ప్రాణంగా ప్రేమించే వారితో ఉన్నా ఎప్పుడూ ఒంటరిగానే ఫీల్ అవుతాడు అని చెప్పడానికి ఈ శీర్షిక తీసుకుని ఉండవచ్చు. ఆకర్షనీయమైన శీర్షిక కూడా పుస్తకాన్ని కొనిపిస్తుంది కనుక తన్హాయీ అనగానే అందరం చదువుతామనే ఉద్దేశం కావచ్చు ఈ అభిప్రాయాన్ని కొందరు వ్యక్త పరిచారు కూడా..
ఈ కధను ముగించారు రచయిత్రి అని చెప్పలేము ఎందుకంటే ముగింపు అక్కడ కల్హార కౌశిక్ నిర్ణయాలతో ఆగి పోలేదు అది ఒక కామా మాత్రమే ఇంకా వారి జీవితాల్లో, వారి జీవిత భరిణలో ఇంకేమి మిగిలిఉన్నాయో అంటూ పండోరాస్
బాక్స్ లాంటి ఓపెన్ ఎండెడ్ గా వదిలేయడం కల్పన చూపించిన పొయెటిక్ జస్టిస్(కావ్య న్యాయం) . తాను తీసుకున్నవి సజీవ పాత్రలు కావడం మూలాన వారికీ తను కర్త కాకపోవదామన్న ఇంగితం కలిగిన ఓ రచయిత్రి ఒక రచన కిచ్చే ముగింపు. ఇందులో సఫలీక్రుతురాలైంది రచయిత్రి. ఆ పాత్రలు రెండూ ఇంకెప్పుడూ మేము కలో కానీ ఇలలో కానీ మనసులో కానీ ఒకరినొకరు కలుసుకోము అని శుష్క వాగ్దానాలు చేసుకోలేరు. వారే కాదు మానవ సహజత్వాన్ని చక్కగా మిగిల్చారు ఆ ముగింపు వాక్యాలలో. అంతే కానీ మళ్ళీ ఎక్కడైనా జేవితం లో తటస్త పడితే నువ్వెవరో నాకు తెలీదు అన్నట్టు వెళ్లి పోతామనేంత హాస్యాస్పదంగా గాక వాస్తవికంగా ఉంది ముగింపు. ఏమో మళ్ళీ కలుసుకుంటే ఇంత కన్నా ఎక్కువ ప్రేమ బల పడి వారిరువురు కలసి జీవిస్తారేమో అనే భావన పాఠకుడికి తప్పక వస్తుంది ఇది చదివేవారి తెలివికే మనసుకే వదిలి పెట్టారు. ఇదీ ఈ రచన లోని సొబగు.
పాత్రలు సజీవమైఅనవి అని చెప్పకనే తెలుస్తున్నాయి. మనమెంత పొందినా పొందాల్సిందేదో మరో వ్యక్తీ దగ్గర మిగిలిపోయిందే అనే ఈ "తన్హాయీ" ప్రతి మనిషిలోను కలిగే ఓ భావ ప్రకంపన. దీన్ని పట్టించుకోకుండా కేవలం దైహిక సంబంధాలతో సరి పెట్టేసుకునే వారూ ఉన్నారు, వ్యక్తీకరిచలేని వారూ ఉన్నారు. బలమైన బంధమైతే నిలబెట్టుకున్నవారూ ఉన్నారు. ఇవి రచయిత్రి సూచ్య ప్రాయంగా వదిలేసిన విషయాలు. ఇక అమెరికా లో ఉండి రాస్తున్నారు కనుక అమెరికా లోనే ప్రదేశాలూ సంఘటనలూ ఉండడం కద్దు. ఆవిడ కాఫీలని వర్ణించి౦దా , ప్రకృతిని వర్ణించి౦దా లాంటి విషయాల జోలికి నేను పోను. ఆవిడ సహజ మానవ స్వభావాన్ని ఆవిష్కరించింది . దాన్ని ఎవరూ ఎలా తీసుకున్న సరే చివరికి రచయిత్రి రీడర్గా తను రాసినది తానే చదువుకున్న సరే ఒకే ఒక భావం మెదులుతుంది మనసు ఎంత చిత్రమయింది సుమా !!! అన్నది ఈమాట కాదనలేము.
పాత్రల్లోని సహజత్వం బాగా ఆవిష్కరించారు కాకుంటే కల్హార పాత్ర కొంచం అతి తెలివి ప్రదర్శించడానికి లేదా అంత తన చేతిలోనే ఉందనుకునే భ్రమ పడడం లో కూడా సహజత్వమే ఉంది. అందరికంటే మృదుల, చైతన్య, మోనికా పాత్రలు కలహార కౌశిక్ పాత్రలను డామినేట్ చేసాయి. ఇదే ప్రేమ చైతన్యలో కలిగి ఉంటే ఏమి చేసేవాడు , మృదులలో కలిగి ఉంటే , మోనికాలో అయితే అని ఆలోచింప జేయడానికి రచయిత్రి చెప్పిందానికంటే చెప్పకుండా మన ఊహకి వదిలి పెట్టింది రచయిత్రి. సంభాషణలు ముఖ్యంగా కల్హరవి కొంచం అతి అనిపించాయి. కౌశిక్ పాత్రే కల్హార కన్న సహజంగా తోచింది.
శైలి బాగుంది అని వదిలేస్తే ఎలా ఎందుకు బాగుందో చెప్పాలిగా. సున్నితమైన పద జాలం తో సహజంగా ఉన్నవి సంబహషణలు అక్కడక్కడ కల్హార చెప్పినవి కాకుంటే.
మొత్తానికి చాలా ఏళ్లుగా ఒక కవయిత్రిగా మనకు పరిచయమున్న కల్పన రెంటాల మొదటి ప్రయత్నంగా ఈ నవల రావడం ముదావహమే. అయినా ఇంతటి కవయిత్రి తన చుట్టూ ఇంత జీవితాన్ని చూస్తూ ఇంకా వైవిద్యభరితమున్న సీరియస్ ఇతివృత్తాన్ని ఎంచుకుని రాసి ఉంటే ఇంకా సాహితీ లోకం సంతోషించేది. ఈ అసంతృప్తిని తను మరో నవల రాసి మరింతగా తన రచనా శైలితో నే కాక ఇతివృత్తబలం తో కూడా ఆకట్టుకుంటారని ఆశిస్తూ కల్పనగారికి అభినందనలు.
.............................. .............................. .............................. ..జగద్ధాత్రి
Reply | Reply to all | Forward |
"మనమెంత పొందినా పొందాల్సిందేదో మరో వ్యక్తీ దగ్గర మిగిలిపోయిందే" చాలా ఓపిగ్గా రాసిన ఈ సమీక్షా వ్యాసంలో నాకు నచ్చిన వాక్యాల్లొ ఇదొకటి....చాలా విశ్లేషాత్మాకంగా వివరణాత్మకంగా రాసుకున్న ఈ వ్యాసం "తన్హాయీ" కి చివరిమాట లాంటిది.అభినందనలు
ReplyDeleteజగతి జగద్ధాత్రి గారు,
ReplyDeleteమీ వ్యాసం బాగుంది. పాఠకురాలిగా మీ అనుభవాన్ని నిజాయతీగా చెప్పడం బాగుంది. అనవసర సందేహాలకు లోనైన ఒకటి రెండు వాక్యాలు తప్ప మీ ప్రోజ్ చాల బాగుంది. నేను ‘తన్హాయీ’ చదవలేదు గాని, మీరు చదివి, చదవడంలోని అనుభవాన్ని చాల చక్కగా, ఇతర్లకు ఉపయోగకరంగా చెప్పారు. అభినందనలు.
ఈ ‘మనసు’, ‘ప్రేమ’ అనే వాటిని వాటి వాస్తవికతకు మించి సాగదీస్తున్నాం. అన్నీ అవసరాలకు అంటిపెట్టుకుని ఉండే భావోద్వేగాలే. వాటిలో అంతకు మించి ఏదో ఉందనే భ్రమను కల్పించడం కోసం మిస్టిక్ పదజాలాన్ని వాడుకుంటున్నారు. మార్మిక పదజాలాన్ని వాడుకున్న ప్రతిదానిలో చోటు చేసుకున్న చేటును ఇందులోనూ చూడొచ్చు.
ఒక్కోసారి కొన్ని దుర్మార్గాలు కూడా ఈ కాల్పనిక (రొమాంటిక్) భావనలను ఆసరా చేసుకుని ఉదాత్తాలైనట్టు ఆభాసిస్తున్నాయి.
కృష్ణ శాస్త్రి తో దివికేగిన కవితను శ్రీశ్రీ భువికి తెచ్చినట్టుగానే, చెలంతో నేల విడిచిన సాముగా మారిన ‘ప్రేమ’ను కొడవంటి కుటుంబ రావు మళ్లీ నేల మీదికి తెచ్చి ఇచ్చారు. ఆపైన మరొక ముందడుగు వేయాల్సింది పోయి, వెనుకడుగు వేస్తున్నాం. ప్రేమ ఉంది. ప్రేమ మీద ఆధారపడిన సమాజం చాల గొప్పగా ఉంటుంది. కాని, అది ఇటీవల అతి ప్రచారంలో ఉన్న అ-వాస్తవిక ప్రేమ మాత్రం కాదు.
‘కాల్పనికత’కు లోనైన ప్రేమ వంచనకు, హిపోక్రిసీకి తిరిగి ద్వారాలు తెరిచింది. ఇప్పటికే పలు అమాయక జీవితాలు దీనికి బలయ్యాయి. ‘మాయకులు’ పబ్బం గడుపుకోడానికి ఇది దోహదం చేసింది. ఇవాళ మన చుట్టూరా పలు ఘోరాలకు ఇదే మూలం. ఇంత బలమైన భావోద్వేగం గురించి ఆలోచన జీవులు అస్సలు ఆలోచించకపోవడం ఈనాటి మేధావుల నిష్పూచీతనానికి పరకాష్ఠ.
చాల చాలా... చాలా బాగుంది మీ రివ్యూ జగతి గారు
ReplyDelete