Wednesday, October 5, 2011

ఒలికిన అక్షరాలు..


ఆద్యంతాలు లేక 
అనూచానంగా వింటూనే ఉన్నా
నీ గుండె చప్పుడు
అయినా ప్రతిసారీ 
ఓ కొత్త గుండెతో రావుగా
అదే హృదయం
ప్రతిసారీ మరో దేహం తో
వేరే  మొహాలతో 
మనం కలిసి నప్పుడు 
ఎప్పుడూ నీకన్న ముందుగా
నీ గుండెల అడుగుల జడి 
వినిపిస్తుంది
నాకూ హృది ఉందని
నువ్వనుకుంటే బాగుండుననిపిస్తుంది
అయినా చెప్పను 
అడిగి లేదనిపించుకోలేను
అహంకారమా? 
అంటావా? ఏమో మరి ?
ఈ అభావాన్ని ఏమంటారో 
నాకే తెలియదు 
కలసి కాళ్ళు నడిచాక
చేతులు కలిసాక
దేహాలు ఒక్కటయిన 
దివ్య  క్షణాలు మాత్రం
నావే నంటాను 
మొహం, వాంఛ, వలపు 
ఇష్టం, అభిమానం 
ఆహా ఎన్నెన్ని పేర్లు పెట్టాం మనం
దివ్యమైన ఒక్కటైన
ప్రేమకి ....
సౌందర్యాన్నంతా నాశనం
చేసాం ప్రేమది 
నింగి లోని సూర్యబింబం
సముద్రంనుండి వచ్చినట్టగుపిస్తే 
అది భ్రమ అంటున్నామా
అందమైన చంద్రోదయాన్ని 
కనులారా తాగడం లేదూ
విశ్లే షిస్తున్నామా?
మరి అనంతమైన ప్రేమాంబుధిని
మాత్రం ఎందుకు ఇంకా 
మన మూర్ఖ సర్పాలతో 
నమ్మకపు కొండలను బిగించి
చిలుకుతున్నాము?
నాకు నువ్వు నిజం
నీకు నేను నిజం 
ఈ కాసిన్ని క్షణాలు 
ఈ భూమ్మీద 
మనవి అని ప్రేమగా
చెప్పుకుంటే 
ఒప్పుకుంటే ఏం?
ఎప్పుడూ ఏదో ఒక అడ్డేనా
హద్దేనా మన మధ్య
అయినా కలసిన మనం 
కలయిక నిజమని 
ప్రేమ పూరితమని 
ఎందుకు అనుకోము
అక్కడ ఆ అద్వైత క్షణాల్లోనూ
నేను కాని  నువ్వు 
నువ్వు కాని  నేను గా 
విడిగానే ఉండి పోతున్నామేం?
నిన్ను నాలోకి తీసుకున్న  క్షణం
ఆ క్షణం మాత్రమే నిజం నాకు
సహజం కానిదేదీ 
సహించలేను 
ఎక్కడో ఏదో బాధ మెలితిప్పి
నేలకేసి కొట్టినట్టు 
వెన్నెముక విరిగినట్టు 
పెటిల్లుమన్నప్పుడు 
దుఖంతో గొంతు పూడుకు పోయి
ఆఖరికి నావైన
ఆ క్షణాలను కూడా
నాకు దక్కనియ్యని 
కాలాన్ని నిందించనా 
ప్రాణాలు ఐదూ నీ  సొంతం 
చేస్తూ నన్ను మరిచి నేనున్నపుడు
నువ్వు మాత్రం 
అది ఆదిమ వాంఛ మాత్రమే
అంటావేమి?
అనుబంధం ఎంత 
గొప్పదైనా
నిర్బంధం కానీయనని  
నీకు తెలియదా 
నన్ను ప్రేమించకు 
కానీ ప్రేమను ప్రేమించడం
మానేయకు....
అదొక్కటే మనలో  ఇంకా
మనిషితనానికి గుర్తు ...
నా ఆడతనం సాక్షిగా
ఇది మాత్రమే నిజం ...........ప్రేమతో...జగతి 4.32pm.Wednesday 5/10/2011

(అనంతమైన నీలి సాగర స్త్రీత్వాన్ని , అనాదిగా కదలని డాల్ఫిన్స్  నోస్ పురుషత్వాన్ని  చూస్తూ మనసులోని మాటలని అక్షరాల్లోకి ఒంపుకున్నా )  



















2 comments:

  1. అనుబంధం ఎంత
    గొప్పదైనా
    నిర్బంధం కానీయనని
    నీకు తెలియదా
    నన్ను ప్రేమించకు
    కానీ ప్రేమను ప్రేమించడం
    మానేయకు....
    అదొక్కటే మనలో ఇంకా
    మనిషితనానికి గుర్తు ...
    నా ఆడతనం సాక్షిగా
    ఇది మాత్రమే నిజం......ప్రేమలో ఈ లోతైన భావాన్ని అర్ధం చేస్కునే వాళ్ళు ఎంతమంది? చాలా బాగుందమ్మా....Hats off to you

    ReplyDelete
  2. అనుబంధం ఎంత
    గొప్పదైనా
    నిర్బంధం కానీయనని
    నీకు తెలియదా
    నన్ను ప్రేమించకు
    కానీ ప్రేమను ప్రేమించడం
    మానేయకు....
    అదొక్కటే మనలో ఇంకా
    మనిషితనానికి గుర్తు ...
    నా ఆడతనం సాక్షిగా
    ఇది మాత్రమే నిజం.....ప్రేమలో ఈ లోతైన భావాన్ని అర్ధం చేస్కునే వాళ్ళు ఎంతమంది? చాలా బాగుందమ్మా....

    ReplyDelete