Monday, November 19, 2012

మారని ఆమె, సముద్రం, నేను




" ఓహ్ ! షట్ అప్ ధీరూ నిన్నేవడూ బాగుచెయ్యలేడు .." 
అతని గొంతులో ధ్వనించిన కోపానికి బిత్తర పోయింది ఆమె. 
" ఎప్పుడూ ప్రేమ ప్రేమ అని ఎందుకు వెంట బడతావ్ అసలు మనసే లేదు అంటుంటే ప్రేమట ప్రేమ ..." అంత  అసహనం ఎప్పుడూ చూడలేదు అతనిలో.
" పలకవు ఉలకవు ఏయ్ నిన్నే !.." ఒక్కసారి అతని వైపు తలెత్తి చూసి మళ్ళీ ఇసికను చేతులతో సవరిస్తూంది ఆమె. 
" ఎమన్నా అన్నామా  మౌనం అమ్మగారికి ... ఓయ్ ..." ఆమెని కుదిపాడు 
తలెత్తి చుసిన ఆమె కళ్ళల్లో నిండుగా నీళ్ళు ఒలక బోయే మేఘాల్లా . ఒక్క క్షణం చలించినా వెంటనే సర్దుకున్నాడు. 
" వద్దు ...ఈ కన్నీళ్ళతో ఎవరినే కట్టి పడేయ్యాలేవు ..." విసుగ్గా అన్నాడు 
" నేనెప్పుడైనా అలా కట్టి పడేసే ప్రయత్నం చేసానా ?"  నెమ్మదిగా ప్రశ్నించింది.
వెంటనే మాటలు రాలేదతనికి  ... నిజమే ఎప్పుడూ తను బాధ పడుతుంది తప్ప ఏ  విషయం లోనూ ఏదీ అడగదు. 
" ఏమో నా వరకు నేనేమీ నిన్ను ప్రేమిస్తున్నానని  చెప్పలేదు ప్రేమించలేను కూడా ... " నిష్కర్షగా అన్నాడు.
మళ్ళీ తనే " అసలీ ప్రేమ అనే దాన్ని నమ్మని వాళ్ళలో మొదటి వాడిని నేనే " 
" ఇవన్నీ ఇప్పుడెందుకు మాటాడు తున్నావో తెలుసుకోవచ్చా...?" నిమ్మళంగా అడిగింది 
కాసేపు మౌనం .... " ఏమో చెప్పాలనిపించింది అంతే " 
" నేనేమన్నా అడిగానా ?" 
" లేదులే ...కానీ , నాకే ఎందుకో నువ్వు పదేపదే ప్రేమ అనడం నచ్చలేదు "
" సరే ఇంకెప్పుడూ అనను ఓకే నా ..." వెంటనే ఒప్పేసుకుంది. ఇక ఏమనాలో తోచలేదు అతనికి. 
" ఎందుకు తాత్వికా ! ఈ రోజు నా ప్రేమ ని తిడుతున్నావు ..." పకాపక నవ్వింది 
" నేనేమీ ఎవరినీ నిర్బంధించలేదు గా ప్రేమ అంటూ... ఆయినా ప్రేమ బంధం అంటారు కానీ  నా దృష్టిలో ప్రేమ బంధ విముక్తి "
" చాల్లే ఆపు తల్లీ నీ సిద్ధాంతాలు ..." 
" అదే పొరబాటు ఏ  సిద్ధాంతం లేనిదే ప్రేమ " 
" నాకు ఈ దేహం పై తప్ప దేని మీద నమ్మకం లేదు ..."
" దేహం లోని ఒక అంగమే మెదడు , హృదయం కాదా ... మరి అందులోంచి జనిన్చేదే గా ప్రేమ ?"
" ఆపు రాక్షసీ ! ఎక్కడో దేన్నో తీసుకొచ్చి దీనికి ముడి పెడతావు "
" సరే మళ్ళీ ఎప్పుడూ మాటాడను లే ..." నిశ్సబ్దంగా తల వంచుకుంది . ఆమె పయ్యెద పై కన్నీళ్లు పారిజాతాల్లా జలజలా  రాలడం చూసాడతను 
దగ్గరకి తీసుకుందామని చాచిన చేతులు ఎందుకో ఆగి పోయాయి. 
ఎలా చెప్పాలి  ఈమెకి అనిపించింది ఒక్క క్షణం . ఆమె నమ్మకం ఎలా కాదనాలి. ఎవరు ఏ  ద్రోహం చేసినా కూడా ప్రేమతోనే జయించాలి తప్ప ద్వేషం గా మర్చుకోకుడదని వాదించే ఈ ప్రేమ మూర్ఖురాలికి ఎలా చెప్తే  బోధ పడుతుంది ? ఎందుకో ఒక్కసారిగా కోపం జాలి విసుగు కలిగాయతనికి. 
తనం కోసమంటూ ఏమీ మిగుల్చుకోదు , భవిష్యత్తు ఆలోచించదు ... ప్రేమించే మనుషుల కోసం ఏదైనా చేసేస్తుంది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించెంత వెర్రిది.
అందుకే తల్లి , భర్త , అత్త మామలూ అందరూ మోసం చేసారు , విచిత్రం ఏమిటంటే తెలిసినా ఎవరి పట్లా ద్వేషం పెంచుకోదు. కానీ ఎలా బతుకుతుంది అర్ధం కావడం లేదు. 
ఒక్కసారిగా జాలి ( ప్రేమ అనకూడదు లెండి) ఆమె ని దగ్గరగా హత్తుకున్నాడు. 
" సర్లే పద వెళ్దాం , నీకు చెప్పినా అదిగో  ఆ సముద్రానికి చెప్పినా మీ ఘోష మీదే ...పద పిచ్చీ !" అనునయంగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించాడు మౌనంగా నడిచింది అతనితో. 
...........................................ప్రేమతో ..జగతి 12.40pm Friday 16th Nov 2012 



Sunday, October 7, 2012

అతను ...ఆమె ...ఆత్మీయం




" హలో!" .....ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసినట్టు ఆ పిలుపు వినగానే ఆమె లో ఏదో గిలిగింత. 
" మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి ..." చిలిపిగా అంది 
" హహహ చాల్లే నేనే నంబర్ చేసానో నాకు తెల్సు కానీ .... ఏంటీ కోపమా ..." అంత లాలనగా అడిగితే కోపమా అబ్బే అదెప్పుడో రింగ్ టోన్ వినగానే పోయింది కదా.
అయినా బింకంగా " కోపం ఏమీ లేదు ... కొద్దిగా బాధ అంతే.." ఎంతగా మామూలుగా చెప్దామనుకున్నా చలింపు స్వరం లో తనకే తెలుస్తోంది. 
కాస్త సర్దుకుని ..." ఎప్పుడు వచ్చేదీ ? " ఆత్రంగా అడిగింది 
" ఇప్పుడప్పుడే అయేలా లేదురా , ఈ నెలాఖరు అవుతుందేమో ...." చెప్పాడు.. అతని స్వరం లో ని భావాన్ని పట్టుకోవడం కష్టం. 
" అయ్యో అవునా ... పదవ తేదీ  తర్వాత వస్తాను అన్నావ్ "...నిరాశ 
" అదే చెప్పేది మరి పదవ తేదీ తరవాత ఎప్పుడవుతుందో మరి డేట్ చెప్పలేదుగా ..." నవ్వేడు 
మౌనం ..... నిశ్శబ్దం ఇద్దరి నడుమా 
" ఏయ్ ఏంటీ ఉన్నావా ? మాటాడు పదిహేను రోజుల తర్వాత  ఇవాలే తీరింది నాకు ... మాట్లాడురా ..." బుజ్జగింపు 
" ఏమి మాటాడను ... ఏమీ లేదు ...." నిర్లిప్తంగా నిరాశ ఆమె స్వరం లో 
" అబ్బా మాటాడరా మరీ ఏంటి చిన్నపిల్లలా వస్తానుగా ....." 
" బాలూ.... నాకు నువ్వు కావాలి ... చూడాలి నిన్ను ... నీ చేతుల్లో చచ్చిపోవాలనుంది " ఆగి ఆగి వెక్కి పడుతోన్న మనసుతో 
" ఏయ్ మెంటల్ ....ఏంటా మాటలు ..."
" నిజం నా గురించి నువ్వేమనుకుంటావు ..." 
" చెప్పాగా మెంటల్ అనీ ....." పకపక నవ్వేడు 
ఆమె మాటలాడలేదు మళ్ళీ తనే అన్నాడు 
" ఏంటీ చచ్చిపోతావా? ఓకే ఐతే రెడీ గా ఉండు ఇద్దరం చచ్చిపోదాము ఓకే నా ..." హాస్యం తో కూడిన లాలన 
" బతాకాలని లేదు నాకు ..... నువ్వెందుకు చావడం " ఉక్రోషంగా అంది 
" నాకూ లేదు రా ... బతకాలని అందుకే వస్తాగా ఇద్దరం చచ్చిపోదాం " 
" మరి నువ్వొస్తే మనిద్దరం దగ్గరైతే అప్పుడు ఇంకేదో  అయితే అప్పుడు ..... బతకాలనిపిస్తే ..." 
" హహహహ్హహా అందుకే అన్నా మెంటల్ అని ....చాల్లే చావు కబుర్లు జీవితం గూర్చి చెప్పు ఎమన్నా " 
" నాకా  ఏమీ లేవు ... " 
" మృత్యువొక్కటే సత్యం రా ... అది వచ్చేటప్పుడు వస్తుంది ... దాని కోసం ఆత్ర పడక్కర్లేదు ..." గంభీరంగా పలికిన్దతని  గొంతు
" నిజమే బాలూ. .. అయినా నేను నీ లా జ్ఞానిని కాదుగా ఏదో అలా బతికేస్తున్నా .... ఒక్క మాట అడగనా?" ఆత్రం 
" అడుగు ....." 
" ఒక్కసారి నువ్వు నావాడివి అనుకోవచ్చా నేను " 
" దానికి పెర్మిషణ్ ఎందుకు అనుకో...." నవ్వేడు 
" అబ్బ అది కాదు ... నువ్వెప్పుడైనా నన్ను నీదానిగా అనుకోవెందుకని?"
" ఎందుకిప్పుడిదంతా అసలీ సొంతం పరాయీ ఇవన్నీ అవసరమా చెప్పు .... మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం అంతే "
" అంతే ప్రేమగా ఒక్కసారి నువ్వు నాదానివని నేను నీ వాడినని అనొచ్చుగా ...." 
" అబ్బ నువ్వు ఇలా మాటాడవే ఎప్పుడూ ... నాకీ మెలోడ్రామ నచ్చదు...ఆడాళ్ళకి అదే ఇష్టం ... నాకు ఇష్టమైతే  ఇష్టం  లేకుంటే చెప్పేస్తా నాకు నువ్వు వద్దమ్మ విసిగించకు అని ....మనకి మొహమాటం తక్కువ కదా ..." 
" ఓయ్ ! నాకీ మెలోడ్రామాలు అసలు నచ్చవు ఏదో మాటడుదామని అన్నా అంతే ... నన్నూ ఆ లిస్టు లో కలిపెయ్యకు సుమా "
" నాకు తెలుసు రా నువ్వు ఆ లిస్టు లో లేవు లే హహహ" 
" సరే ఏమి చేస్తున్నావు , అవును కధలేందుకు రాయవు నువ్వు ?..."
" ఎందుకు రాయను రాస్తానే ...రాసాను చాల అచ్చైనాయి కూడా " 
" అసలీ ఫేస్ బుక్ వచ్చి మనుషుల్ని చెడ గొట్టిన్దనుకో ఎంచక్కా రాసుకునే వారు ఇది వరకు ఇప్పుడు ... మీ అడాల్లేదో ఒక బొమ్మో  వాక్యమో పెట్టడం దానికి  ఆహా ఓహో అని అందరి కామెంట్లూ...." 
" ఓయ్ ఓయ్ జోరు తగ్గించబ్బాయ్ అసలు మనం పరిచయమైంది కూడా ఇందులోనే ....మర్చిపోకు..."
" ఓకే పరిచయమైనా వెంటనే వారం రోజుల్లో మీ ఊరు వచ్చాను కదా అమ్మాయ్?"
" వస్తే ..నాకోసమా నీ పని మీద వచ్చావ్ ..." 
" ఏయ్ గమ్మునుండు ... నేను వచ్చిందీ నీకోసమే ... రెండు సార్లూ వచ్చిందీ నీ కోసమే .... కాదని చెప్పు హహ్హ సరేలే వదిలేయ్" 
" ఏమి చదువుతున్నావ్ ?" 
" ఏదో బుక్ మీద వర్క్  చేస్తున్న ఈ మధ్యనే ... లత మోహన వంశి గూర్చి మాటాడా " 
" ఇటీవల నాకు నచ్చిన మంచి ఫిలోసోఫేర్ ని చెప్తాను చదువు నీకు నచ్చ్చుతాడు , బామన్ తన  పుస్తకం " లిక్విడ్ మాడర్నిటీ" ఆర్టికల్స్ చాల బాగున్నాయ్ చదవరా అసలు ఈ ఆధునిక యుగం లో యువత ఏమి కోరుకుంటున్నారు ఏంటీ  అన్నది సామజిక శాస్త్రవేత్తగా చాల బాగా డిస్కస్ చేసేడు. నాకు బాగా నచ్చాడు.."
" ఓకే తప్పకుండ చదువుతా ... తాత్వికా... మనోవైజ్ఞానిక కోణం లో కొన్ని రచనలు స్టడీ చేస్తున్నా ... రాయాలి ఇంకా " 
" అసలే మెంటల్ వి ఇంకా నీకా స్టడీ లెందుకు హహః" 
" హహః నిజమేలే నేను మెంటలే ..ఒప్పేసుకున్నా " 
" ఏయ్ ఏదన్న ఒప్పేసుకుంటావా  ... నీ గురించి నాకు తెలీదా ఏంటీ... ఉరికే అన్నా రా ... "
" నాకు తెలుసు సార్.... నా కవితల పుస్తకం తెద్దామని అనుకుంటున్నా మిత్రురాలు ఒకామె బాగా ప్రోత్సహిస్తోంది ..."
" మరింకేమైతే తప్పక తీసుకురా ... వేరి గుడ్ " 
" సరేలే ... ఆలోచిద్దాం ... యు.జి. మీద ఎవరో ఈ మధ్య వర్క్  చేసారు అయన  కొటేషన్స్ తెలుగు లో చేసారు, అయన మీద ఇంతకు ముందు నేను వర్క్ చేశాను కదా ... ఆ బుక్ కూడా ఆవిష్కరణ ఉంది " 
" అవునా గుడ్ ... ఒక ఫ్రెండ్ ఉన్నాడు రూం లో ఇక పడుకోనా" 
" ఓహో చెప్పవేమీ ... ఆ అమ్మయినలా కూర్చోబెట్టి మాటాడు తున్నావా  టైం వేస్ట్ కదా ఎంజాయ్ "
" హే ! మెంటల్ నా గురించి ఎందుకల అనుకుంటావ్ ఉన్నది అబ్బాయ్ ... వాడు హైదరాబాద్ నుండి వచ్చాడు నా కోసం ..." 
" సరే సరే .... ఏదన్న ఎవరన్న ... పాపం ఆయనకీ చెప్పు ఓ మెంటల్ అండీ నాకోసం కలవరిస్తుందీ అని .. లేకుంటే మళ్ళీ ఆమె అపార్ధం చేసుకుంటుంది పాపం ...."
" అబ్బా గమ్మునుండు ... అమ్మాయి కాదురా అంటే....వినవు కదా ..నిన్నూ.."
" ఓకే ఓకే ఎవరైనా నేను చెయ్యగలిగేది ఏమీ లేదులే కానీ ...బజ్జో ....ఇంకేమన్నా ...నీ కౌగిలి లో నలిగి పోవాలనుంది...ఆ అదృష్టం ఇవాళ ఆవిడకి ప్చ్ ప్చ్.."
" ఏయ్ పిల్లా నా కౌగిలిలో నలిగి పోయేది దిండు  మాత్రమే ఇంకెవరూ లేరిక్కడ ....బజ్జో నువ్వు కూడా"
" నేను నిద్ర .... వద్దులే ప్రయత్నించడం విఫల మవడం ఎందుకు ...నువు చెప్పావుగా ఎవరినో చదవమని అయన దగరికి వెళ్తా "
" యా సరే మరైతే ఉంటా .... చదువుకో ... ఆరోగ్యం కొంచం ....చుసుకోరా..."
ఒక్క క్షణం నిశ్శబ్దం ..... ఫోన్ కట్ చేసిన శబ్దం 
................................................................ప్రేమతో ...జగతి 5.23pm Sunday 7th Oct 2012 

Friday, October 5, 2012

ఎదురుచూపు



ఎంత చెప్పినా వినవుగా
నిరీక్షించొద్దు
 నాకోసమంటే....
అన్నాడు నెలరాజు ఆత్మీయంగా
చిర్నవ్వింది కలువ
అతని ప్రేమకి.....ప్రేమతో...జగతి