Friday, April 20, 2018



కారుణ్య మరణ కాక్ష – సుప్రీం నోట సలీం మాట
యుతనేసియా , కారుణ్య మరణాల పై సంచలనాత్మకమైన సుప్రీం కోర్టు తీర్పు నేడు వెలువడింది. ప్రపంచ దేశాల నైతిక అభిప్రాయమే రెండుగా చీలిపోయిన ఇటువంటి విషయాలపై నవలా రచన రచయితల నిగ్గుతేల్చే విషయం. నెదర్ లాండ్స్, మెక్సికో, స్విట్జర్లాండ్ , బెల్జియం, అమెరికా , జర్మనీ, ఐర్లాండ్, మొదలగు దేశాల చట్టాలు కారుణ్య మరణాలకు “పాసివ్” పద్ధతిలో అంగీకరిస్తున్నాయి,  అనగా భయంకరమైన వ్యాధితో , మృత్యు ముఖం లో ఉంటూ బయట నుంచి అందజేసే ప్రత్యేక వైద్య సదుపాయాల వలన ఇంకా జీవితులై ఉండే వ్యక్తుల అంగీకారంతో, ఈ వైద్య సదుపాయాలను తొలగించడమే ప్రస్తుతానికి మన దేశంలో సుప్రీం కోర్టు ఈ తాజా తీర్పు ద్వారా  అంగీకరిస్తున్న విషయం.
ఈ విధానానికే ఇంగ్లాండ్ , అస్స్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, మొదలగు దేశాలలో చట్ట బద్దత లేదు. మన దేశాన్ని కుదిపేసిన  1977 లైంగిక అత్యాచార బాధితురాలు అరుణా షాన్బాగ్ ఆ ఏడాది నవంబర్ నుంచి మే 2015 దాకా ఈ కారుణ్య మరణాల విషయం పై స్పష్టత , చట్ట బద్ధత లేక పోవడం వలన నలభై రెండేళ్ల పాటు కోమా వంటి వెజెటేటివ్ స్టేట్ లో కేవలం పేరుకి మాత్రం జీవితురాలిగా ఉన్నది. 2009 లో ఆమె విషయమై పత్రికా రచయిత్రి పింకీ విరానీ ఒక రచన చేయడమేకాక, ఆమె కారుణ్య మరణాన్ని  అనుమతించమని,  లైఫ్ సపోర్ట్ పరికరాలను తొలగించే వీలును పరిగణించమని సుప్రేమ్ కోర్టుకి పిటీషన్ సమర్పించింది.
2011 లో సైతం,  పూర్తిగా నిస్సహాయ దశలో ఉన్న వ్యక్తులకు కారుణ్య మరణాల వీలును అనుమతిస్తూనే షాన్ బాగ్ విషయం లో ఈ వెసులుబాటుకు తిరస్కరించింది సుప్రీం కోర్టు. దేశంలో ఏ మేరకు,  ఏ స్థాయిలో ఈ మెర్సీ కిల్లింగ్ అనుమతించవచ్చు అని వైద్య వర్గాలు , న్యాయ కోవిదులు , ధార్మిక సంస్థలూ, సామాజిక మేధావులు చర్చిస్తూ ఉన్న కాలం లోనే  2013 లో నిమోనియా కి గురై 2015 లో మే 18 న గుండె పోటుతో అరుణా షాన్ బాగ్ కన్ను మూసింది. ఈ దేశ వ్యాప్త ఉదంతం,  ఏళ్ల తరబడి అమానవీయమైన ఈ పొడిగింపు,  మన తెలుగు రచయిత సలీంకు ఈ విషయం పై నవల రాసే ప్రేరణ కలిగించి ఉండవచ్చును. సమాజ పరిస్థితులపై ఎందుకు ఒక రచయిత నవల రాయాలో ఇది ఒక మంచి ఉదాహరణ.
 తెలుగు సాహిత్యం లో తొలిగా ఈ విషయాంశాన్ని చర్చించిన నవల కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత సలీం మరణకాంక్ష . ఈ నవల 2011 లోనే రాయబడింది , ప్రముఖ వారపత్రిక లో సీరియల్ గా వచ్చిన ఈ నవల తర్వాత పుస్తకంగా వెలువడింది. తన కొడుకు మస్క్యులర్ డిస్ట్రోఫీ తో పడుతున్న మరణ యాతన చూడలేక సరోజ అనే తల్లి తన కొడుక్కి  కారుణ్య మరణం ప్రసాదించమని కోర్టుకి అపీల్ చేసుకుంటుంది. కానీ అక్షర అనే లాయర్,  కారుణ్యమరణాలకు వ్యతిరేకంగా వాదించి కేసు గెలుస్తుంది. అయితే ప్రసాద్ మరణయాతన కళ్లారా చూసిన ఆమె తాను పొరపాటు చేశానని గ్రహిస్తుంది. రచయిత, ప్రసాద్ మరణాన్ని వర్ణించిన తీరు , ప్రత్యక్షంగా  చూసిన అక్షరలో ఎంత మార్పును తీసుకొస్తాయో  అలాగే చదివిన పాఠకుల్లోనూ కారుణ్య మరణాల పట్ల ఒక సహానుభూతిని, వాస్తవిక స్పృహను  కలిగిస్తాయి. రచయిత తన రచన ద్వారా సాధించిన ఈ  మానవ స్వభావ చిత్రణ నేడు సుప్రీం కోర్టు నోట ఆమోదయోగ్యమైన  తీర్పుగా వెలువడటం ముదావహం. మన తెలుగు రచయితలు ఇంత మెలకువతో,  క్రాంత దర్శిత్వoతో రచనలు వాస్తవ దృక్పథం తో  చేస్తున్నారని చెప్పడానికి ఇదొక సత్య నిదర్శనం.
ఇదే విషయం పై “గుజారిష్”(2010) లో సంజయ్ లీలా బన్సాలి సినిమాగా వచ్చినా అది ఒక గొప్ప వ్యక్తి జీవితం గురించి , పైగా అది “whose life is it anyway” (1981)అనే రంగస్థల నాటకాన్ని సినిమా గా తీసిన దాన్ని  హిందీలో బన్సాలి తనదైన గొప్ప చిత్రీకరణలో తీశారు. బ్రైన్ క్లార్క్ 1978 లో రాసి ప్రదర్శించిన ఈ నాటకం జాన్ బొధామ్ దర్శకత్వం లో రిచర్డ్ డ్రెయ్ఫుస్స్ (అకాడెమీ అవార్డ్ గ్రహీత ) ముఖ్య పాత్రగా చిత్రించబడింది.
 దిగువ మధ్య తరగతి జీవితాల్లో జరిగిన విషాదాన్ని చర్చించిన వాస్తవానికి అతి చేరువలోనున్న సలీం నవల మరణకాంక్ష ‘A DESIRE FOR DEATH’  పేరిట ఆంగ్లం లోకి అనువాదం కూడా అయింది. ఇది అంతర్జాలం లో గూగుల్ బుక్స్ లో కూడా లభ్యమౌతుంది. మన తెలుగు నవల భారతీయ,  అంతర్జాతీయాంశాలను  సకాలంలో చర్చించడం, ఆ విషయమే ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు గా వెలువరించడం కవులు క్రాంత దర్శులు అని మరో మారు రుజువు చేస్తుంది. సలీం కేవలం మన తెలుగు రచయితే కాదు అంతర్జాతీయ స్థాయి రచయిత అని చెప్పేందుకు అతను రచించిన తొలి ముస్లిం నవల “వెండిమేఘం’(2003), నేడు ఈ మరణకాంక్ష (2011) సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు.
జగద్ధాత్రి (87122 93994)