Tuesday, December 27, 2011

పాడ్యమి వెన్నెల గ్రహణం


పాడ్యమి వెన్నెల గ్రహణం 




చందమామకి కృష్ణ పక్షమూ
శుక్ల పక్షమూ ఉంటాయిగా
అలాగే మా జ్యోత్సకూ 
ఉన్నాయనుకున్నానమ్మా
తల్లీ అంటూ ఇంకెవరు రా 
పిలుస్తారు నన్ను
అన్నం తిన్నావా ?
అన్న నా మొదటి ప్రశ్నకి 
ఎంత బుద్ధిగా జవాబిచ్చేవాడివి
నా చేత ఎన్నెన్ని చివాట్లు 
తిన్నా ఏమీ జరగన్నట్టు 
మళ్ళీ ప్రేమగా పలకరించే 
నీ పలకరింపు 
జీవితాన్ని నిశితంగా 
పరిశీలించి 
అక్షరీకరించ గలిగిన  
వాడిగల వాడివే 
మరి ఎందుకిలా 
కోరి మృత్యువుని ఆహ్వానించావో 
ఒక్క మాటైనా చెప్పలేదు 
ఎన్ని సార్లు చెప్పాను
తిట్టాను బతిమిలాడాను
చివరికి కొట్టాను కూడా 
నిష్కారణంగా బతుకుని 
బలిపెట్టకురా అంటే 
అలాగే రా తల్లీ
అంటూ చేతిలో చెయ్ వేసే వాడివి 
ఎందుకూ నా చెయ్యి వదలగానే 
మాట తప్పే౦దుకేనా?
ఎవరికుండవురా బాధలు 
ఎందుకురా నాన్నా ఇట్లా
అంటే లేదమ్మా బాగుంటానుగా
అని చిన్ని పాపడిలా అలాగే  
అని భరోసా ఇచ్చేవాడివి 
నిజమనుకునేదాన్ని 
నీ కలం లోని స్ఫూర్తి 
నీ అక్షరార్తి ఏవీ నిన్ను
కాపాడలేదా?
ఒంటరి తనం భరించలేను 
పుస్తకాలే నేస్తాలంటూ 
పుస్తకాలెన్నో చదివావు కదా
అంత మంది మస్తిష్కాల 
ప్రభావమైనా నిన్ను 
మార్చలేక పోయిందా 
ఇంకా శుక్ల పక్ష చంద్రుడిలా దినదినాభివృద్ధి
చెందాల్సిన కవన వెన్నెలవి
పాడ్యమి కి ముందే 
కనుమరుగైపోయావా?
సూదంటు రాయంటి నీ చూపులు 
హృద్యమైన నీ పద విన్యాసం 
నీ కవితా ఝరి ని 
ఎందుకు అర్ధంతరంగా
ముగించి ...రాస్తూ రాస్తూ 
ఉన్న కలాన్ని హటాత్తుగా 
మూసేసి వెళ్ళిపోయావు
మనసులోని వేదన 
ఒక్క మాట కూడా 
ఒలకనీయక ...
అంత గరళాన్ని 
ఎందుకు దాచుకున్నావురా
ఎలా దాచుకుని 
దిగమింగలేకా ఎంత 
అవస్థ పడ్డావో నా తండ్రీ
దేహాన్ని ఎంతలా
ఛిద్రం చేసుకున్నావో
మనసు ఎన్ని ముక్కలైందో
ఏమైందో కూడా 
ఏనాడూ ఎవరితోనూ
మనసు జారి ఒక్క మాటైనా 
చెప్పలేదు కదూ
నువ్వు ప్రాణం మీదకి
తెచ్చుకుంటున్నావని 
కోపగించామే  కానీ 
నీ మీద ప్రేమ లేక కాదు కదరా
ఇవన్నీ నీకు తెలుసు 
కవివి కదా
అందుకేనా ఇక మా మాటలు
చివాట్లూ ఏమీ వినబడనంత 
దూరం వెళ్లిపోయావూ 
కనబడకుండా వినబడకుండా 
కవిని నేనని చెప్పేందుకేనా?
పాడ్యమి వెన్నెలకి 
గ్రహణం పట్టిన వైనాన్ని 
ఇలా మాకు చూపించావా? 
అక్షరంగా మిగాలాల్సిన
నీ అస్తిత్వం ఇవాళ
అస్థికలై ధూళిలో 
కలుస్తూంటే ఎలా ఇవ్వను 
కన్నీటి నివాళి ....
.........................జగద్ధాత్రి 
[మిత్రుడు, సీనియర్ పాత్రికేయుడు మంచి కవి బరంపురం వికాసం నుండి విరిసిన "జ్యోత్స్న" అకాల మృత్యువుకి కన్నీటి నివాళి ] 

Monday, December 26, 2011

నా కిట్టయ్యా! (మరో జాబు)

ఆ తియ్యని రాత్రి.....నువ్వు నాలో ....!!!

నా కిట్టయ్యా!
               ఎంతగా ఎదురు చూసానో నే కోసం. ప్రతి పాడ్యమి నుండి పున్నమి  దాక నువ్వొస్తావని . నువ్వొచ్చావు కానీ
ఎంత సేపని కాళ్ళలో చెప్పులు పెట్టుకుని ....ఒక్క పాలి నిన్ను చూడగానే గుండె నీరై కరిగి నీ పాదాలపై వాలి పోయాను.
నీ చేతుల్లో కరిగి పోయి  యమున నై నీ పాదాలు కన్నీటి తో కడిగేను.
ఎన్ని జన్మల తర్వాతో నువ్వోచ్చావ్ ....కానీ నా కళ్ళకు కన్నీటి పొర అడ్డమై అయ్యో కిట్టయ్య నిన్ను కళ్లారా సూడనైన లేక పోయాను.
నిన్ను చూసి ఊరంతా ఒచ్చేసారు. ఇక నువ్వాల్లందరి తోనూ మాటాడుతుంటే ఆమట్టునే దూరంగా నిలబడి నిన్ను చూస్తూ నీ మాటలు ఇంటూ ఉన్నాను. నాకు నువ్వెవరితో ఏం సేపుతుఉన్నవో అర్ధం కాలేదు . నా కాళ్ళ నిండా నా కళ్ళెదురుగా నువ్వున్నావు అంతే ...మాటలలో కదిలే నీ పెదాలు ....ఆ పెదాలేగా నన్ను నా పెదాలని, నా ఒంటిని ముద్దాడాయి నన్ను నిలువునా నీ ప్రేమ లో పడేశాయి అనుకుంటే సిగ్గు ముంచు కొచ్చింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న ...అమ్మో ఆ ఓకే క్షణం నిన్ను సూడ కుండా ఉండ గలనా ....అయ్యో నీ కిద్దామని తెచ్చిన పాలు నా సేతి లోనే ఉండి పోయాయి ...ఈల్లందర్నీ దాటుకుని ఎలా వచ్చేది నీ దగ్గరికి....అనుకున్నంతలో నువ్వు నన్ను
చూసావు ...ఎంత దయ నీకు ...చిరునవుతో ...రాధా ఎన్టీ పాలివ్వవా అవి నాకేగా తీసుకొస్త ? అన్నావు చిలిపిగా
చప్పున సిగ్గుతో తల వాల్చేసాను.  ఎంత తెలివిగా సిలిపిగా అడిగావు ....తలుసుకుంటే ఇప్పుడు బుగ్గల్లో ఆవిర్లోస్తుండాయ్ ....


అమ్మయ్య  దేవుల్లాగా  పూజరయ్య ఎంటనే నీ సుట్టు మూగిన అందరినీ ఇక ఇల్లకెళ్ళ౦న్ద్రా కృష్ణ బాబుగారు మళ్ళీ ఎమ్మటే ఎల్లి పోవల కాసేపు రాధమ్మతో మాటాడు కొనియ్యండీ  అంటూ నవ్వుతూ రామయ్య తాతని , కోటయ్య మావని  అందర్నీ ఎల్ల గొట్టిండు. "ఏయ్ రాధా ఆడనే నిలబడతవేంటే కృష్ణ బాబు ని ఇంటికి  తీసుకెళ్ళు" అంటూ కళ్ళతో  సైగ  సేసి  నవ్విండు . అప్పుడు చుసిన  నీ మొహం  కూడా సిగ్గు తో  ఎర్ర బడింది. పూజరయ్య వైపు చూడలేక చూసావ్ రక్షించారు సామీ అన్నట్టు.


కిట్టయ్యా!....

జనమ జనమ లకీ మర్చి పోలేని ఆ పున్నమి రాత్రి ....అబ్బో తలుసుకుంటే నిజమేనా అనిపించే ఆ తియ్యటి రాత్రి...
నువ్వు నన్ను తాకిన మరు క్షణం నీ పాదాల పై వాలి  పోయాను. ఒళ్లంతా నిలువునా ఒణుకు ....నీ చేతులు ఎంత మెత్తగా ఉండయ్యో ....రాధా అన్నావు నువ్వు నన్ను కౌగలించుకుని ....నా ప్రాణాలన్నీ నీలో కలిసి పోయాక ఇక నేనేమి మాటాడ గలను  అందుకే నిశ్సబ్దంగా నీ కౌగిలి లో కరిగి పోయాను ....
"ఏయ్ రాధా ! ఇటు చూడు నన్ను చూడవూ , నాతో మాటాడవూ?" అన్నావు నువ్వు 
అయ్యో పిచ్చ్చి కిట్ట్టయ్యా నువ్వెదురుగా ఉంటె ఏం మాటాడేది? నాకు నువ్వే లోకం కిట్టయ్యా ని సేప్పాలని ఎంతగానో అనిపించింది....ఉహు గొంతు పెగిలితే గా అది నీ ఎద సప్పుడు ఇంటూ పరవశించి పోతంది .
ఆ మధుర క్షణాలు నీవు నేను ఒక్కటైన....ఆ కొన్ని ఘడియలూ అబ్బా కిట్టయ్యా ! నిన్నోదిలి ఇక ఉండలేను నన్ను తీసుకు పోవా నీతో అని నీ ఎద పై తల పెట్టి ఏడవాలనిపించింది . కానీ ఒర్చుకున్నా ఎందుకో తెలుసా ?
పూజారయ్య సెప్పిండు కృష్ణ బాబు నిన్ను తీసుకెళతాడు  తొందరలో  కానీ ఇప్పుడు కాదు ...నువ్వు అతన్ని  తొందర  సేయ్యమకు  ...అతనిది  పెద్ద  ఉద్దోగం బోలెడు పనులుంటాయి ...ఇంకా కొన్ని ఇంటి బాధ్యతలున్డాయ్ ఆ బాబుకి . చెల్లెళ్ళ పెళ్లి చెయ్యాలి అయి కాంగానే నీ కిట్టయ్యా బాబు నిన్ను తనతో తీసుకెళతాడు , ఆ బాబు ని మాత్రం నీ ఏడుపుతో ఇసిగించకు అన్నాడు .... అమ్మ అయ్యా కూడా అట్నే సేప్పిన్రు ...అందరికీ నీ మీద ఎంత నమ్మకమో ...నువ్వు నన్నేప్పటికీ ఇడవవని ...ఆల్లందరికీ అంత నమ్మకమైతే నాకేనా లేంది నా కిట్టయ్యా మీదా...
ఆఆ .......గంపెడంత ,..అః కాదు కొండంత ...ఉహు ...ఆకాసమంతా చ అదీ కాదు నా మనసంత నమ్మకముంది నీ ప్రేమంటే ....


నా కిట్టయ్యా! ఎవరెలాగనుకున్ననాకు ఒకటే తెలుసూ నిన్ను ప్రేమించడం నిన్ను తలుసుకుంటూ నీకోసం రోజులూ. నిమిషాలూ. ఘడియలూ లెక్క బెట్టుకుంటూ బతికేయ్యడం....నిన్న ఏటి గట్టున అలా నీ ఆలోచన లో కూసుండి పోయి సీకటైన సంగతే చూడలేదు....చాకలి ఎంకన్న అరుపుకి తుళ్ళి పడ్డా...ఎందమ్మ రాధమ్మా! నీ కిట్టయ్యా కానీ ఏటి కాడికి వత్తనన్న డేటీ? అన్నాడు నవ్వుతూ సీ...చెప్పకేం ఒళ్ళంతా సిగ్గుతో పరిగెత్తుకుని ఇంటికొచ్చేసాను. 


కిట్టయ్యా! నువ్వు నాలో ఉన్న ఆ ఘడియలె నేను బతికుండే ఘడియలు. నువ్వు నను నీ లో కలిపెసుకునే ఆ నిమిషాలే నాకు పంచ ప్రాణాలు....పొద్దున్నే మళ్ళీ ఎల్లి పోవలన్నావు ....దిగులేసింది ..అయినా పంతులయ్య సేప్పినట్ట్టు నిన్ను ఇసిగించాకుండా అట్టాగే అన్న....
కానీ పాడు కన్నీళ్లు ఆగితేనా ....ఊరికే ఎగ జిమ్మీ పైటంత తడిపేస్తున్నాయి ...అప్పుడు జూసిన నీ వైపు ...సిత్రం ..కిట్టయ్యా ..నీ కళ్ళల్లో నూ నీళ్ళు ....నన్నొదిలి పోలేక ఒక్కసారి గట్టిగా నన్నదుముకున్నావు నీ చల్లని ఎదకి ....
ఓహ్ అప్పుడే ఈ చిన్ని ప్రాణం పోతే , ఈ ఊపిరి ఆగిపోతే బాగున్ను అనిపించింది .....నన్నోదల్లేక వోదిలావు ...
దూరంగా మస్తాన్ భాయ్ టాంగా లో నువ్వు కుర్చుని రైల్వే టేసన్ కి ఎల్తా ఉంటె ....నాకేమో కళ్ళు నీళ్ళతో  మసకలై ఏమీ కనబడలేదు...కృష్ణ బాబు నీకు సెయ్యి ఊపుతున్నాడే రాదమ్మ అన్నాడు అయ్యా ...కానీ నాకేమీ కనిపించలేదు ....కల్లోత్తుకుని చూసినా ...దూరంగా నీ గులాబీ రంగు చొక్కా రంగు లీలగా చూపుకి అనింది....ఎటో చూస్తూనే చెయ్యి ఊపాను నీకు కనపడిందో లేదో కూడా తెలవదు ...


కిట్టయ్యా ! ఈసారి నువ్వు నాకో ప్రమాణం సేసావ్ గుర్తుందా ..నాకు వారానికి ఓ ఉత్తరం రాస్తానని అవునా ....నిజంగా రాస్తావ్ కదూ ....ఇప్పుడు నేను చదవ గలను , ఇగో ఇప్పుడు నేనే రాసిన ఈ ఉతరం..కానీ మళ్ళీ తప్పులు తడకలున్డయేమో అని పంతులయ్య సేత దిద్దించీ అప్పుడు పోస్ట్ చేస్తా లేకుంటే నువ్వు నా మాటల కి నవ్వుతావు ఆ.....అదిగో అల్లా పక పకా నవ్వుతూ నువ్వు "అబ్బబ్బబ్బా బంగారూ ఏమి రాసేవులే ఉతరం అంటావు?" 
నా ఉత్తరాన్ని ఎక్కిరించినా పర్వాలేదు నా ప్రేమని వెక్కిరించమాకు కిట్టయ్యా ....అది తట్టుకునే శక్తి లేదు నాకు ....నీకు తెలవదా ఏంటి ? ఏంటో నా పిచ్చి రాతలు ...కదూ...నువ్వు రాసే ఉత్తరం కోసం ఎయ్యి కళ్ళతో ఎదురు సూస్తూ....నీ పిచ్చి రాధ.




Sunday, December 11, 2011

నా కృష్ణా!

నా కృష్ణా!
              ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి గాని.....అన్నట్టు ఊహ తెలిసిన నాటినుండీ ఒళ్ళంతా కళ్ళు గా ఎదురుచూస్తున్న,ఇక తీరదులే  అని ఆశ చంపుకున్న తీయని  కోరిక ఇలా హటాత్తుగా అమృతపు జల్లు కురిసినట్లు నీ అక్షరాలలో అక్షరాలా లేఖ గా అందుకుంటానని కలలో కూడా ఊహించలేదు. ఉత్తరాన్ని కవిత్వంగా రాసేవో కవిత్వాన్ని ఉత్తరంగా మలిచావో కానీ నీ అమృతాక్షరాలలో నాకోసం రాసిన ఓ చిన్ని ప్రేమ లేఖ , నిజం చెప్పాలంటే అసలు నేను జీవితం లో అందుకున్న తొలి ప్రేమ లేఖ.
  

కృష్ణా! ఈ ఆనందాన్ని మాటలలో వర్ణిస్తే వన్నె తగ్గి పోతుంది. నిజం, నా మనో భావానికే ఓ రంగు రూపు మాట వస్తే "హరివిల్లు' లోని సప్త వర్ణాలని మించిన నీ ప్రేమాక్షరాలు నా హృది నిండా పరుచుకున్న నీ మంత్రాక్షరాలు నన్ను నిలువునా వేల వేల పులకింతల తో శత కోటి  సరాగాలతో నన్ను రాగరంజితం  జేసాయి..
"మోహన  వంశి" లోని లత వర్ణించిన కృష్ణుడు కూడా చెయ్యని పని నా కోసం నా చిన్నారి కృష్ణుడు చేసాడన్న తలపు నన్ను భూమికి ఒకింత ఎత్తులో నడిపిస్తోంది....నా మాటలు అతిశయంగా కనిపిస్తే నేనేమీ చేయలేను..కానీ నేనెప్పుడూ సహజం కానిది  ఏదీ సహించలేను, నీవు  రాసిన ఆ గుప్పెడు అక్షరాల పరిమళంతో నా గుండె నిండి పోయింది ఇది సత్యం.

కృష్ణా! నీకిది ఓ కవిత కావచ్చు , మామూలుగా నువ్వు చేసే ఓ ప్రయోగం కావొచ్చు నేమో కానీ నాకు మాత్రం జీవనవనం లో విరిసిన తొలి పారిజాతం. నవ్వుతున్నావు కదూ నా పిచ్చికి , అయినా నేనేమీ సిగ్గు పడనులే. రాసింది నీకు కాదు అంటావా ? పోనీ కాసేపు నీ "బంగారు కొండ" అని నువ్వు సంబోధించిన నీ ప్రేయసి నేనే అనుకుని సంబర పడతాను.
అందుకు ఏమీ అనవు కదా. 

కృష్ణా! మన్నించు నువ్వు నిజంగా నీ ప్రేయసికే రాసి  ఉంటే అది అందుకునే అర్హత నాకు లేకున్నా చదువుకుని నన్ను "ఆమె" గా ఊహించుకుని రాస్తున్నందుకు. బహుశా అత్యుత్సాహంతో మరీ రాసేస్తున్నానేమో...కదూ ....ఏదో తట్టుకోలేని సంతోషం ......ఎల్లలులేక పంచప్రాణాలు ఎగిరి వచ్చి నీ పాదాల పై వాలాలన్ననా అంతరంగపు అనాది ఆకాంక్ష ని మాత్రం ఆపుకునే శక్తి లేని దాన్ని ...మన్నించవూ....నా అనురాగ అనుతప్త హృది లో నిలిచిన నీకు కాక ఇంకెవరికీ అర్ధం కాని నా పిచ్చి రాతలు ....నా నుదుటి గీతాలు....అందుకే ఇలా కురిసిపోతున్నాపదాలుగా ......నీ లేఖామృతము గ్రోలిన మైమరపులో ......మన్నించు.....

                                     అనుక్క్షణం నీ కోసం పరితపించే ఓ మమతా మనస్విని .......నీ.....జగతి 3.20pm sunday 11/12/2011


Friday, December 9, 2011

పిలుపు

నువ్వెప్పుడూ నా మది లోనే ఉంటావు అన్నాడతను .... 






హలో ! ఎలా ఉన్నావు ? 
అతని పలకరింపులోని మాధుర్యానికి
గు౦డె ఝల్లుమంటుంది
ఎన్నో యుగాలుగా వేచి  ఉన్నట్టు
ఆ పిలుపు కోసం 
హృదయం రిక్కించి వింటాను 
సమాధానమివ్వాలనిపించదు
అతను ఆత్రంగా అలా అలా ప్రశ్నిస్తూ 
ఉంటే తవితీరక ఆమట్టునే వింటూ
ఉండాలనిపిస్తుంది
తన  జ్ఞాపకాలలో నేనున్నానన్న 
స్పృహ నాకు జీవం పోస్తుంది
అనాదిగా ఈ ప్రేమ కోసమే కదా
ఇన్ని సార్లు జన్మెత్తింది 
అసలు జీవించే ఉన్నానన్న 
ఉనికి కలిగేదీ ఈ  పిలుపు  తోనే కదా
దీనిని ప్రేమ అంటే..... 
నవ్వుతాడతను
అతని నవ్వు చూస్తే
నాకూ నవ్వొస్తుంది 
ఇద్దరం మనసు విప్పి 
చెప్పుకోము
మీకు గుర్తున్నందుకు 
ధన్యురాలిని అన్నాను  అల్లరిగా
నువ్వెప్పుడూ నా మదిలో ఉంటావు
కానీ నేను చెప్పను 
నువ్వు చెప్తావు అదే తేడా 
అంటాడతను మళ్ళీ నవ్వుతూ
ఆ నవ్వులోని ఆత్మీయపు  జల్లు 
పలకరింపులోని తీరని తృష్ణ 
నన్ను మరీ మరీ కదిలిస్తాయి
ఎందుకో ఏ ఒక్కసారైనా 
ఆ పిలుపు వినడానికి 
బ్రతికి ఉండాలనిపిస్తుంది
నా అనురాగాన్ని వినిపించానా
వెక్కిరిస్తాడని తెలుసు 
అందుకే మౌనంగా 
ప్రాప్తమున్నంత మేర 
అతని మాటలను 
గుండె పతకంలో
నవ రాత్నాల్లా  పొదుగు కుంటాను 
మళ్ళీ మరో పిలుపు కోసం 
అనునిత్యం ఎదురు చూస్తూ
మరి కొన్నాళ్లీ....
జీవితాన్ని పొడిగిద్దామని
కలిగిన నా దురాశకు
నిర్లిప్తంగా నవ్వుకుంటాను నాలో నేనే.....
............................................................ప్రేమతో ...జగతి 12.26 pm Friday 9/12/2011 (rams office) 







Tuesday, December 6, 2011

ఎందుకో ఇలా .......




నా పెదవులపై విరిగిన పాలలాంటి నవ్వు గా........




మనసు వాయు వేగంతో ఆలోచిస్తోంది
పరుగులు పెడుతోంది
ప్రతి రాత్రీ ఎన్నెన్నో 
యాత్రలు చేస్తుంది 
ఎన్నో ఊసులు చెబుతుంది
మరెన్నో కధలల్లుతుంది 
ఎన్నో కవితలు రాయమంటోంది
లెక్కకు మించి గీతాలు 
స్వరాల వెల్లువ 
పాటల పరిమళాలతో
మది పల్లవిస్తుంది 
ఆలోచనల్లో పొందిన 
మాధుర్యాన్ని కలంతో 
రాద్దామని ప్రయత్నిస్తే 
కదలనని కరం మొండి కేస్తుంది
దేహం సహాయ నిరాకరణ 
చేస్తుంది ......
నిస్సహాయంగా 
కనులు వర్షిస్తాయి
కన్నీళ్ళతో బాటూ 
భావాలన్నీ అలుక్కు పోతాయి 
అసహాయంగా ఏమీ లేకుండా
రిక్త హృదయం తో చూస్తూ 
ఉండి పోతాను...
ఎంత గా సరి పెట్టుకుందామని 
విశ్వ ప్రయత్నం చేసినా
కాలం కలసి రాని 
నా కలం ....
నన్ను జాలిగా చూస్తుంది 
విరిగిన నా స్వప్న శకలాలు 
నిస్తేజంగా నిర్లిప్తంగా...
పొగిలి .....పెగలని నా పెదవులపై
విరిగిన పాలలాంటి నవ్వుగా 
పరావర్తనం చెందుతాయి.........!!!

........................................ప్రేమతో....జగతి 3.08 pm 6/12/2011 tuesday (rams office)





Saturday, December 3, 2011

పున్నాగ పూలు .......

పున్నాగ పూలు .......

శీతల కార్తీకంలో 
మంచుల  మార్గశిరంలో నూ
మనసు నిండి పోయే 
పున్నాగ పూల పరిమళం
ఎక్కడెక్కడి నుండో 
నన్నల్లుకుంటుంది..
నడుస్తూ నడుస్తూ ఆగి
రాలిన పున్నాగలను
ఏరు కుందామని 
నా మనో పూల సజ్జనిండా 
నింపు కుందామని ఎంతో ఆశ
ఎన్నని ఏరను
ఊహ తెలిసిన నాటినుండీ
విజయనగరం పార్కుల పక్కన 
నాన్నతో నడిచినప్పటి 
జ్ఞాపకాల పున్నాగలు
డచ్  బంగ్లా మీదుగా
విశ్వ విద్యాలయానికి 
వెళ్తూ ఉన్నప్పటి మత్తు గొలిపే
తీయని స్నేహ  పరిమళాలు 
ఎంతో ఎత్తునుండి కవ్విస్తూ ఉన్నా.....
ఎంత జాలిగా  నా ముందర 
వాలుతాయో........
నాలు గు పదుల ముళ్ళ  వసంతాలలో
ఎక్కడో కొన్ని  దాచుకోవడానికి 
మిగిలిన అందమైన 
శిశిరాలు...ఈ పున్నాగపూలు
శిశిరం రుతువుల ముగింపా
కాదు కాదు మరో వసంతానికి ఆహ్వానం
అని మృదువుగా తమ స్పర్శతో
విలక్షణ పరిమళంతో 
విరిసి మురిపించే పున్నాగలు
బతుకు రుతువులో రాలి పోయిన 
మిత్రుని నవ్వులా
నాన్న ప్రేమలా
ప్రియుని అనురాగంలా 
ప్రియంగా పలకరించే 
పున్నాగ పూలు
ఇంకెన్ని శిశిరాలు  చూడగలనో
అని ఆత్రంగా 
ప్రతి శీతా కాలం లోనూ
పరుగెత్తుకెళ్ళి
హృది దోసిలినిండా నింపుకుని
తనివితీరా ఆఘ్రాణిస్తాను అందుకే
ప్రతి వత్సరం శిశిరం కోసం 
ఎదురుచూస్తూ
గత మధుర స్మృతి ఝరి లో 
తడిసి ముద్దవుతూ .....
శిశిరం కోసం నిరీక్షిస్తూ....
.............................................ప్రేమతో..జగతి 2.20pm 3/12/2011 Saturday 















Friday, December 2, 2011

నా బంగారు పాపా ...!!!



నా బంగారు పాప...

చిరునగవు కాదది నీ మోమున
చిందు లాడే జీవన లాస్యం
నిను చూసిన మరు క్షణం 
ఎన్నో యుగాలుగా 
కలసి మెలిగిన వాళ్లమేగా
కొత్తగా పలకరిస్తుందేంటీ?
అన్నభావన ....
దీనికి పేరు ఊరు
కులము గోత్రము 
ప్రాంతము భాష 
ఏవీ లేవు సుమా...
ఏమంటారో దీన్ని 
నిన్ను చూడగానే పొంగే నా హృదిని 
కలవరంలో ఉన్నప్పుడు 
నీ పలకరింపుని
జారిపోతున్న నా ఆశల 
హార్మ్యాలను నీతో చెప్పుకున్నప్పుడు 
పొందే శాంతిని 
మాటలు కలుపుకున్న 
మన అల్లరి చేష్టలని
అన్నిటినీ అడిగా
ఎక్కడిదీ జీవన స్రవంతి 
ఎక్కడిదీ నవ జీవన నాదమని ?
నా సర్వేంద్రియాలూ
పరవశించి...హాయిగా 
తళుక్కుమనే ఆనందపు 
మెరుపు వైపు చూపాయి 
అది "నువ్వే" 
పువ్వులు నవ్వుతాయంటారేమో కవులు
నవ్వులే పువ్వులుగా 
పంచే నిన్ను చుస్తే ఏమంటాను 
నిన్ను చూసిన ప్రతి సారీ 
పలికే ప్రతి మాటా 
నా శృతి తప్పిన జీవన వీణియ 
తంత్రులను సరి చేస్తుంది
మళ్ళీ లోక కల్యాణిని
ఆలపించమని ప్రేరేపిస్తుంది
నన్ను జీవింప జేస్తుంది 
అయినా నువ్వేమీ కొత్త కాదు నాకు
ప్రతి సారీ నేనోడిపోతానేమో
అని పడి పోయే సమయాన 
అదాటుగా వచ్చి నన్ను 
ఆదుకుంటావు .....
నాకు తెలుసు ...
నువ్వే నా స్ఫూర్తి ప్రదాతవి
నా ప్రాణమైన 
నా ముద్దుల బంగారు పాపవి 
నిన్ను నేను ఎప్పుడూ 
పాపా అనే పిలుచుకుంటాను
మనసులో పలినుంచి ....
నా బంగారు పాపా....
నా ఆశల కలల రూపానివి నువ్వు
నా ఆశయాల సాధనవి నువ్వు 
అందుకే నేనెప్పుడూ
నీలో నన్ను చూసుకుని పొంగిపోతాను
ఇంక మాటాడను మరి 
నా పాప కు నా దృష్టే  తగిలేను సుమా ...!!!
................................నా సాయి పద్మకు (నా బంగారు పాపకి) ప్రేమతో ....అమ్మ 9.40pm 2/12/2011 friday 













Saturday, November 19, 2011

ఫోన్ కాల్

మెత్తగా రాలిన
పొగడపూల పరిమళం లా
సున్నితత్వానికి ప్రతీకల
నిశ్సబ్దంగా రాలే  పారిజాతాల్లా
తెలవారు ఝామున
కార్తీక మాసం లో ని పున్నాగ పూలలా
కొన్ని మంచి తియ్యని
మాటలు .....
ఒక అందమైన వాక్యం
ఓ అర్ద్రమైన కవిత 
ఎంత లాలిస్తుందీ హృదిని
మాటలు తేనెల మూటలంటే
ఇదేనేమో....
మాటాడిన వాటికంటే
మాటాడని మాటలే
ఎంతో విలువైనవి కదూ
ప్రియతమా  ......
కలిసి న ప్రతిసారీ
ఒకరిలోకొకరు
ఒలికి పోవాలని
ఊసు లెన్నో చెప్పేసుకోవాలని
ఎన్ని సార్లో....
ఎంతగా అనుకుంటామో
కంప్యూటర్ యంత్రం పై
మౌనంగా వేళ్ళు
అక్షరాలను మీటి నపుడు
ఎంతగా తెలిసి పోతామో
ఒకరికొకరం
కానీ ఒక్కసారి నీ గొంతు వినగానే
నేను....
నా గొంతు వినగానే నీవు
స్తబ్దులమై..
నిశ్శబ్దాలమై
కాలం నిముషాలు గా కదిలి పోతున్నా
ఎందుకో ఏ మాటా
మాటాడుకోలేక
మౌనించిన హృదయాలతో
మాటలు కరువై
నిట్టూర్పుల  నిస్తేజమై
మిగిలి పోతాము
ఎన్నో చెప్పాలనుకుని
పేలవంగా రెండు
మాటలు మాటాడుకుని
ఏమీ కానీ వారిలా
అటు నువ్వు ఇటు నేను
ఉంటాను అంటూ
పెట్టేస్తాము ఫోన్
ఒకరి వేదన మరొకరు
దీపం కింద చీకటి లా
మనల్ని మనం దాచేసుకుని
నేనేం  చెప్తే తను ఏం  బాధ పడుతుందో నని నువ్వు
నేనేం చెప్పేసి  తనని కష్ట పెట్టేస్తానో అని నేను
ఇద్దరం అరకొర నవ్వుల 
అర్ధం లేని మాటలతో
కాల్ గా  మనకి అందిన  కాలాన్ని
కావాలనే కట్ చేసేస్తాము
ఇదంతా ఏంటో ఎందుకో
మనిద్దరికీ తెలుసు
ఒకరికొకరం ఆనందంగా
అగుపడాలనే తాపత్రయం
తప్ప ఎన్నని మాటలతో
చెప్పగలం చెప్పు
ఏ నెట్వర్క్  అయినా
మన మనసుల్ని అందుకోగలదా
మన మనసుల్లోని మాటలెలా
చెప్తామో నని ఎదురు చూసి చూసి
సెల్ ఫోన్ విసిగి వేసారి పోతుంది
దానికేమి తెలుసు
గతి తప్పిన  మన మనసు గతి....
....................................................ప్రేమతో ...జగతి 12.38am 19-11-2011 saturday (friday night)


(ఈ రోజు మనసు కదిలించిన ఆర్ద్రతతో నింపిన కవి యాకుబ్ సార్ గారి కవిత "మాటలాడని మాటలు " చదివాక)













Friday, November 11, 2011

నీ కోసం పాణం నిలుపుకుంటూ.....
నా   కిట్టయ్యా  !!
                     ఏమి ఎరగని ఎర్రి మనసిది ముప్పుతిప్పలు పెట్టుతాది .....సెంతగా నీలోన నిలవాలని ఇంత ఇంతగా మసులుతాది....ఏందీ పల్లెటూరి పిల్లనని ఇట్టా రాస్తున్నానని  ఏటకారమ్మ అయ్యోరికి....ఏమి సేస్తాములే మాకింతకన్నఎమోస్తది రాయిననికి ....అయినా ఏయ్ కిట్టయ్యా....ఎక్కడోనివి నువ్వు మరి నేనేక్కిడా.....అయినా నన్నే ఎతుక్కుంటా నాకోసమోచ్చినావ్ గదా....అయ్యో ! ఎంత బాధ పడినవ్ ..నాకోసమెంత కలవరించినవో కదా ....ఎన్ని జనమలై పాయె ఇక నువ్వు రావని , అసలు   లేవనీ  అసుమంటి వెర్రాసలు  వద్దనీ ఎంతమంది సేప్పినారానీ....అయినా నల్లయ్యా నువ్వు ఏనాటికైనా వస్తావని ఈ పిచ్చి దాన్ని ఏలుకుంటా వని  ఊహ ఎరిగిన కాడ్నించీ నా లోంచి ఏదో సేపుతూనే ఉంది....అందుకే కిట్టాట్టమి అదేలే నువ్వారోజే పుట్టినవంటగా ,  నాడు గుడికి  పోయి  మన  పూజారయ్యను అందరు ఎల్లిపోయినంకా నెమ్మది గా  అడిగినా....
ఎట్టా నవ్విం డో  సామి పండు ఎన్నెల్లా.....ఎందుకే నీ కట్టా అనిపించింది అని అడిగినాడు నా తల మీద సెయ్యేసి నిమురుతూ....పండు సెందు రంటి మన పూజారయ్య  నే  పుట్టినప్పటి  నుండీ  ఎరుగుదు ....(అసలీ ఉత్తరంముక్క రాస్తున్నాడు ఆ అయ్యే) అది నీకు  తెల్వదా ఏమి  ...


మా అమ్మ అయ్యా నే పుట్టగానే అడిగితే నాకు రాద అని పేరేట్టినా డాంటా  ఈ అయ్యే...
నాలుగు అచ్చరాలు   నేర్చుకోయే  అనీవోడు ...అట్టనే  నేరుస్తానన్నా ..పొంగి పోయి పలక తెప్పించిండు....
ఏదో ఓ నమ రాస్తుండు ...నేనాపినా ...ఒయయ్యోయ్ నాకు నాలుగు అచ్చరాలు   సాలు అన్నా....
కళ్ళింత సేసి సూసిండు ...అదేంటే అన్నాడు ...అవునయ్యా నాకు నా కిట్టయ్యా పేరు రాయడమొస్తే సాలన్నా...


పకపకా నవ్విండు ....డబ్బాపండల్లె పచ్చగా ఉంటాడేమో  ఎర్రగై పాయిండు కుంకుమల్లె .....ఎందుకయ్యా నవ్వుతుండావ్ ?
అడిగింది మా యమ్మ అరదం కాక ....నవ్వి నవ్వి అలసి పాయి అప్పుడన్నడు "సూడు సుక్కమ్మ నీ కూతురు కిట్టయ్యా పేరు తప్ప నేర్వదట" అన్నాడు
"ఎవరు సామీ కిట్టయ్యా అంటే ?" అడిగింది అమ్మ
"నా కిట్టయ్యా నాకు అయ్యోరికి తెలుసులే..నీకెందుకు " అన్నా ఉక్రోషంగా అయ్యోరి  నవ్వుకి రోశామోచ్చిన్దిలే . ..మరీ    
"అట్టాగే లే అంటూ నీకు నచ్చిందే సేపుతాదులే అయ్యోరు " అంటూ పొలం లోకేల్లిపోనాది అమ్మ. మా అయ్యకు నా ద్యాసే పట్టదు...నేను నీ కాడ ఉంటె అంతా నువ్వే సూసుకుంటావని.....
ఎవరే అమ్మీ నీ కిట్టయ్యా అని అడిగాడో మారు
ఏమి సెప్పను వస్తాడయ్య సూస్తావుగా అన్నా.....అట్నే వచ్చినావు కదా .....మా అయ్యోరు నన్ను నీకే అప్పజేప్పిండు
ఇక దీని భారమంతా నీదేనయ్యో కిట్టయ్యా అని .....ఎంత  దయ నీకు నా మీద "అట్టాగే నయ్యా నా కంటి పాపల్లె కాసుకుంటా " నన్నావ్ ....నిజం సేప్పకేమీ ఇప్పటికీ ఆ మాట తలిస్తే కండ్లు సెరువులవుతాయి .....

నీది పెద్ద ఉద్దోగేమని అయ్యోరు సెప్పిండు....అయినా నాకేంటి నువ్వు నా కిట్టయ్యవు అంతే .....
నువ్వెళ్ళి నెల అయింది వచ్చేస్తావ్ అని ఏరోజుకారోజు ఎదురు సూస్తూ ఈ గుడి కాడే ఉన్నా రెప్ప కాస్తూ....
"నిదరపాయే అమ్మీ వస్తాడు లే కిట్టు బాబు" అంటడు అయ్య ...

కిట్టయ్యా నా కిట్టయ్యా ! వచ్చేస్తావ్ గదూ....రేపు అమాస పోను ఎల్లుండి పాడ్యమి నాటి కైనా నీ  జాడ అగుపడితే సాలు ...
వచ్చేస్తావ్ లే అదిగో తొలి కోడి కూసింది ఈ య్యాల అమాస దాటి పాడ్యమి.....
సాయంకాలానికి నీ జాడ అగుపడుద్దని సెప్పిండు పూజరయ్య....
మరొక్క పది రోజులోపిక పడితే నువ్వో చ్చేస్తావని  సెప్పిండు...నేనెవ్వరి మాట నమ్మను నా పూజరయ్య మాట .....నా కిట్టయ్యా ప్రేమ ...అదే నమ్ముతా.....

అయ్యో పూజ అయ్యి అలసి పాయిండు పూజరయ్య ఇక ఆపేస్తలే...ఎన్నెన్ని రాసియ్యగలడు..పాపం...నీ పేరు మాత్రం నేనే   రాస్తాలే ఒక సారా వందసార్లా....ఏమో నువ్వోచ్చేదాకా ఎన్నెన్ని ఏల కోట్ల సార్లో....రాసుకుంటా ..ఉండనా మరి .....
నువ్వోచ్చే పాటికి  నీకోసమే పాణం నిలుపుకుంటూ ....నీ ఎర్రమ్మి నీ రాద ...

..........................................................................1.01am 11/11/2011..Friday

హటాత్తుగా నువ్వే నా ప్రాణం   అంటూ  ఆత్మ  చొచ్చుకు  వచ్చిన  నా కృష్ణుడికి ...ప్రేమతో ....జగతి


Thursday, November 10, 2011

నా "నీకు"

నా "నీ" కు !
          
ఈ రోజు కార్తీక పౌర్ణమి గుర్తుందా  నీకు? అయితే  ఏంటటా? అని క్వెస్చన్ మార్క్  మొహం పెట్టకండి . కోపమొస్తుంది. ఇది గో నీకు కూడా కోపమోస్తుందా అంటారేమో రాదా మరి...మనం చాలా సార్లు పున్నములు సముద్రం ఒడ్డున ఎలా  గడిపామో మరిచి పోయారా? ఈ రోజు మీరు ఉంటె  ఖచ్చితంగా బీచ్ కి వెళ్ళే వాళ్ళం. చల్లని వెన్నెల్లో మీరు నా ఒడి లో పడుకుని కవిత్వం చదువుతుంటే అబ్బ ! ఎంత హాయి ....అసలీ జగతి కి ప్రపంచం పై న స్పృహ ఎక్కడిదీ....నీ రసావిష్కరణంలో మునిగి నిండుగా ఆ మట్టునే ఆ ఆనందపు టంచు ల లోనే  నా ఊపిరి ఆగి అలాగే ఆనందంలో నేను నేనుగా లేకుండా పోయే ఆ దివ్య  క్షణాలు...మళ్ళీ ఎప్పుడో  ఎన్నాళ్ళకు కుదురుతుందో మళ్ళీ. ఎన్ని పౌర్నములైనా నా కెందుకో కార్తీక పౌర్ణమి మార్గశిర పౌర్ణమి చాల ఇష్టం.నీకు తెలీదని కాదు...చలిలో పిచ్చి వాళ్ళలా మనం చంద్రోదయం చూస్తూ కనీసం ఉన్ని దుస్తులేవీ వేసుకోకుండా ఉన్న మనల్ని చూసి కొందరు నవ్వుకుంటే ...ఒకసారి గుర్తుందా ...నువ్వు  నా వొళ్ళో పడుకుని ఉంటే పోలీసు వాడొక ఆఫీసర్ వచ్చి ఏంటండీ ఎవరు మీరు? అంటూ గద్దించాడు . నువ్వు నీ ఐడెంటిటి చూపించాక పాపం కొద్దిగా భయంతో కాస్త లేచి కూర్చోండి సర్...అసలే ఈ చోట మొన్న ఒక హత్య జరిగింది అందువల్ల ఏ జంట కనిపించినా జాగ్రత్తగా గమనించమని మాకు ఆర్డర్స్ అన్నాడు. 

నిజమే కదూ అనిపించింది నాకు . నువ్వేమో ఊరుకోకుండా అల్లరి గా నేనూ అదే పని మీద ఈవిడని తేచ్చానండీ అంటూ ఆటపట్టించడం...అసలు నిన్నూ....ఏమి చేసినా  పాపం లేదు అని నేను తిడుతుంటే
నవ్వుకుంటూ వెళ్లి పోయాడా ఆఫీసర్. అయినా ఆ అల్లరేంటి ? మరీ చంటి పిల్లాడిలా తన్నాలనిపిస్తుంది 
అంత గంభీరంగా  ఉండే  నీలో ఇంత ఆల్లరి పిల్లాడు  దాగున్నాడని ఎవరికీ తెలుసు. అందరికీ చెప్తానంటే 
ఎంత కొంటెగా  అంటావ్ "ఇద మరీ బాగుంది ఎప్పుడూ ధుమ ధుమ లాడుతూ  ఉండాలా ఏంటి  సీరియస్ కవి అంటే? వాడికీ ఓ ప్రేయసి ఓ ఆనందం ఉండవా ఏంటీ , ఓయ్ అమ్మాయీ ?"అంటూ కొంగు పట్టుకు లాగటం చూసి...ఆ స్టూడెంట్ కుర్రాళ్ళు ఎలా వెక్కిరించారు "అంకుల్ మహా జోరు మీదున్నాడ్రోయ్"..అంటూ 

వాళ్ళకేమి తెలుసు ! ఎన్నేళ్ళ తర్వాత ఈ అరుదైన క్షణాలు లభించాయో మనకి ....చిన్న పిల్లలు అనుకుని నవ్వేసుకుననము ఇద్దరం. అసలు విషయం అడుగుదామనే మరిచి పోయాను ...తమరు మళ్ళీ పౌర్ణమి అనగా మార్గశిర పున్నమి కైనా వచ్చ్చేస్తారా ? నిన్న పత్రిక ఆఫీసుకి పోయి మనం  ఇవ్వాల్సిన  రచనలు ఇచ్చేసి వస్తుంటే తెన్నేటి పార్క్ లో  మనం   కూర్చునే   బెంచీ  దిగులుగా  చూసింది   నా వైపు .....
ఇంతకు ముందు పాతగా ఉన్న పార్క్ ఇప్పుడు చాలా బాగు చేసారు కానీ ఎందుకో  అప్పుడు మనం వెళ్ళిన ఆపాత మాధుర్యమేదో  లేనట్టనిపించింది....విచిత్రమేంటంటే మన పిచ్చి బెంచీ మాత్రం మనకోసం ఉంచేసారు అలాగే కొంచం  రంగు  వేసారులే ..ఎన్టీ అయ్యగారేమన్న లంచమిచ్చి ఆ బెంచీ ని పదిలంగా ఉంచారా ఏంటీ....ఏమో చేసినా చేస్తావ్ ...మీ ఆఫీసులో మనం తొలిసారిగా ..!!!..ఆ సోఫాని కొనేసి తేచ్చేయ్యలేదు ఆఫీసు ఆక్షన్లో ..ఛీ పో
అని విసుక్కుంటాను కానీ నాకూ ఇష్టమే ...
అయినా నీ వన్నీ ఇలాంటి పనులే .....ఏంటో నా రాత...మీరు తో  మొదలెడతా నువ్వు అంటూ రాస్తా.....అయినా మరీ ప్రేమేక్కువైతే ఎవరైనా నువ్వు అంటారు కానీ నేనేంటో మరి ముద్దేక్కువైతే  మీరు అంటా....


వెళ్ళిన పని అయ్యిపోయిందీ వచ్చేస్తానన్నావ్  అని ఎదురు చూసా ... ఇంతలో నీ కాల్ ..బయల్దేరి పోయానని  చెప్తా వనుకున్నా  ఇంకా అప్పుడే  కాదూ  అంటే ఏడు పోచ్చేసింది. ఏమో బాబూ నువ్వు నేను లేకుండా ఎప్పుడూ వెళ్లడం అలవాటు లేదేమో ఏంటో గా  ఉంది ....దిగులుగా ఉంది.   


కానీ నీ బాధ్యతలు తప్పవుగా అందుకే వెళ్ళాల్సి వచ్చిందని ...అక్కడి కి నేను రాలేను కనుకే  నువ్వు నన్నొదిలి వెళ్ళావని తెలుసు .......అయినా కాల్ మాటాడి నంత  సేపూ అన్నం తిన్నావా ? మందులేసుకున్నావా? ఈ ప్రశ్నావళి  ఏంట్రా ...ఏదన్న చెప్పొచ్చుగా .....నువ్వు లేకుండా అన్నం సమంగా తినని  నీకు తెలుసు , మందులు వేసుకోనని  నీకు తెలుసు అయినా ఎందుకంత ఆత్రం ? 


నిన్న సూరి గాడోచ్చాడు...మా  అన్నగాడు  కదా  పాపం  కొంచం అన్నం వండి   పెట్టాడు ...ఇలాగైతే  చస్తావే అని రెండు , ఆహా   కాదు  ఐదు  తిట్లు  తిట్టాడు  .....దగ్గర  కూర్చుని  నేను రెండు ముద్దలు  మింగాక అప్పుడు వెళ్ళాడు ....వాడు తినలేదు ....విశాల వచ్చేయ్యమందిట .....పాప అల్లుడు వచ్చేయ్యమన్నారట ....తప్పదు రా అన్నాడు ....సరే  అన్నా.....ఇదంతా రాస్తున్నా గానీ నీకు చూపిస్తానా అమ్మో ...తిట్టవూ....అందుకే బుద్ధిగా 
ఉన్నాను అని చెప్పేస్తా అయినా నా బుద్ది నీకు తెలియదా....
 పాప రేపు సాయంకాలం ఫ్లయిట్ కెగా వెళ్ళేది ...నువ్వు ఎల్లుండి బయల్దేరడం అవుతుందా బహుశా మరో నలుగు రోజులన్న లేకుంటే బాగోదేమో....
నిజమేలే  బాబు , తను ఒంటరి గా ఫీల్ అవుతారు కదా .....
నాకేమీ   ఫర్వాలేదులే  లే .....ఒంటరి తనం అలవాటేగా ....కాస్త మౌనం వీడి ఏదో పుస్తకం పట్టుకుని కూర్చోకుండా మాటలాడండి.....
నీ కోసం అన గౌరీ బెంగెట్టుకుంది...మా అయ్యగారు ఎప్పుడోస్తారంటూ ...మరి  నీ ఫ్రెండ్ కదా .....హహహహః
నా నవ్వులోని దిగులు నీ హృదికి తెలుసు అని నాకూ తెలుసు ...నువ్వూ నన్ను వదిలి ఉండలేవు అయినా జీవితం....లో ..కొన్ని ముఖ్యమైన పనులున్టాయిగా.......నా గురించి దిగులు పడకు అనను దిగులు పడు బాగా .........................

ఎప్పుడెప్పుడోస్తావా  అని ఎదురు చూస్తూ............... ప్రేమతో ....నీ ....."నేను"   3.55pm thursday 10/11/2011




                                                                                        






  

Friday, October 28, 2011

మృత్యు భాష

నా భాష మీ పట్ల మృత్యు భాష కావడం నా శాపం ........
                                                   
యుగాలుగా నన్ను అనుభూతిస్తూనే ఉన్నారు
పంచేంద్రి యాలతోనూ 
జ్ఞానేంద్రియం తో నూ
నన్ను మీ ప్రతి భావనలోనూ 
రంగరిస్తూనే ఉన్నారు
మీ కోపాలు , తాపాలు 
మీ ప్రియతముల విరహాలు 
మీ దుఖాలు ,సంసారాలూ
అన్నిటికీ నన్నో ఉపమానంగా
ఉత్ప్రేక్షగా, అలంకారంగా
అభివ్యక్తీ కరిస్తూనే ఉన్నారు 
మీరు అక్షర జ్ఞానులు 
రాయగలరు 
నన్ను పదాలలో , పద్య పాదాలలో 
ఇమడ్చ గలరు 
ప్రతీకగా ప్రయోగాత్మకంగా 
ప్రయోజనాత్మకంగా 
ఉపయోగించ గలరు
నాలోని రేగే బడబాగ్నులు
నాలో రేగే ఆనందాలను 
ఏవీ చెప్పలేని నేను 
నా అలల ఘోష లో 
మీ పాదాలు స్పృశిస్తే 
నా భావోద్విగ్నత మీకు పట్టదు
మీ ప్రేయసి చిరు నవ్వితే 
నేను ఆనందంగా కనిపిస్తాను 
అపురూపంగా వర్ణిస్తారు 
మీకు దిగులేస్తే 
నాలోనూ మీకు మీ దిగులే  అగుపిస్తుంది
మీ కన్నీళ్ళను 
మీ ఆశలను
ఆనందాలను 
అనాదిగా అర్ధంచేసుకుంటూనే ఉన్నా
నిరక్ష్య  రాసురాలిని మరి
ఎన్నెన్ని సార్లో 
నా భావాలని 
నా ఆకాంక్షలని 
నా ఆవేదనని 
మీతో ఒక్కసారైనా 
పంచుకోవాలనే 
తపనతో ఏమి చెయ్యాలో
ఎలా వ్యక్తీకరించాలో 
ఎరుగక ఒక్కసారి గా
ఎగిసెగిసి పడి
ఉవ్వెత్తున ఎగిరి ...
మీ దరి చేరాలని 
ఉత్సాహంతో ...
ఉరకలు పరుగులు గా
వస్తానా............
కానీ మీరందరూ  నన్ను
తిడతారు , వంచకి నంటారు 
నా గర్భంలో ని నిధి నిక్షేపాలను 
కొల్లగోట్ట్టినా అడగని నేను
మీ మాలిన్యాలను 
మోస్తున్న నేను 
ఏ ఒక్కసారీ మిమ్మల్ని 
ప్రశ్నించని  నేను
నా ఒక్కగానొక్క భావాన్నో
ఉద్వేగాన్నో , ఉల్లాసాన్నో  
చాటాలని ప్రయత్నిస్తే 
అందరు అప్రమత్తమై 
నేనేదో ప్రమాద కారిణి లా 
భయ పడి దూరం మరింత దూరంగా 
పారిపోతారు ....
నిజమే నాకు తెలుసు 
నా ఆనందమూ 
నా ఆవేదనా
రెండూ మీకు మృత్యువే 
అయినా వ్యక్తీకరించక ఆగలేని తనం 
మీకేనా  .........
నాకు మాత్రం భావ స్వాతంత్ర్యం  ఉండొద్దూ ...
అని పిస్తుంది ఎన్నో సార్లు
మీ ప్రేయసీ విరహాలుగా  
మీ ఆనంద ఆహ్లాదాలుగా   
మీ ప్రియుని ఎడబాటుగా
కష్టాలకు ఉపమానంగా 
మృత్యువుకు ప్రతీకగా 
చివరికి నా వడిలోనే
తనువు చాలించే 
మీలో ...మీతో 
నేను మృత్యువును కానని 
నాలోనూ అమ్మతనం ఉందని 
ప్రేమార్నవ నా వర్ణాలను 
బహు నీలాల రంగుల్లో 
మీకు చూపిద్దామనుకుంటా...
నన్ను నేను మీతో ....
ఏ  అరమరికలూ లేక ....
నన్ను నేను ఆవిష్కరించుకుందామని 
నన్నపార్ధం చేసుకోవద్దనీ 
చెప్పాలనుకుంటా....
నాకు వచ్చిన భాష ఒక్కటే
మరి ఏ భావానికైనా 
ఉవ్వెత్తున పొంగడం
నా  భాష మీ పట్ల మృత్యు భాష 
కావడం నా దురదృష్టం.....
విమోచన లేని  శాపం  ..!!!

..................................................ప్రేమతో ....జగతి 3.07 pm friday 28th oct 2011




























Thursday, October 27, 2011

వాసన

ప్రతీ దేహానికీ ఓ పరిమళ ముంటుంది.....






ప్రతిదేహనికీ ఓ పరిమళముంటుంది
అది ప్రత్యేకంగా ఎవరికీ వారికే
పరిమితంగా ఉంటుంది
నవ్వోస్తోందేమో నా మాటలకు
కానీ అనుభవమిది
కొన్ని దేహాలు మృగాల వాసన వేస్తాయి
కొన్ని ఆకలి వాసన వేస్తాయి
కొన్ని పురుష దేహాలు వాంఛ సుగంధం చల్లుతాయి
మరి కొన్నిఉన్మత్తతను పెంచుతాయి
కొన్ని స్త్రీ దేహాలు ఆర్తి పరిమళం వెద జల్లుతాయి
మరి కొందరు నిరాశ నిస్పృహల వాసన వేస్తారు
కన్నీటి ఉప్పదనపు వాసనేస్తారు కొందరు
మరి కొందరు చెమట ఉప్పదనంగా
మరి కొందరు నెత్తుటి ఉప్పదనంగా
అన్నీ ఉప్పనే అయినా వాటి మధ్య తేడాలుంటాయి
ద్రోహపు వాసనేసేవారు కొందరైతే
వలపు వాసనా వేస్తారు కొందరు
అమాయకపు అసహాయపు వ్యధా భరిత౦గా
అహంకారపు ఆభి జాత్యాల పూరితంగా
కొందరు చంటి బిడ్డలా౦టి పురిటివాసన వేస్తారు
మరి కొందరు మోసపు గబ్బు కొడతారు
కొందరు శ్రమ పరిమళమౌతారు
అబ్బో చెప్పకేం... కొందరు డబ్బు కంపు కొడతారు
పిచ్చి వాళ్ళు నయం దుర్వాసన వేయరు
వాళ్ళకే తెలియని పిచ్చి పువ్వుల్లాంటి
ఒక పిచ్చి వాసన వేస్తారు
కొందరు నిజాయితీ సువసనేస్తారు
చెప్పాగా ప్రతి దేహానికీ
తనది మాత్రమే అయిన
ఓ ప్రత్యెక పరిమళ మో , గబ్బో , సుగంధమో , సువాసనో
ఉండి తీరుతుంది
ఎటొచ్చీ అందరినీ అన్నిటి నీ
గుర్తుపట్టలేము
పసిగట్టలేము
పసిగట్టే నా లాంటి వాళ్ళకు
నిజానికి సుఖ ముండదు
నేను అనుమానపు పసిగట్టే వాసన వేస్తానేమో
మరి నన్నెరిగిన వారు ప్రేమ సువాసన వేస్తానంటారు
ఏది ఏమైనప్పటికీ...
నాకు తెలిసి వచ్చిన నిజం మాత్రం ఇదీ..
పరిమళాల దేహాల్ని ప్రేమించగలం
వాంచా పూరిత దేహాల్ని
అర్ధం చేసుకోగలం
వంచన నిండిన దేహాలను
భరించలేము...
అన్నిటికంటే దుఖం ...
వాటిని పసిగట్టీ తెలిసీ
వాటితోనే బ్రతకాల్సి రావడం...
అప్పుడు నేను దుఖపు వాసనేస్తాను కాబోలు.....

......................................................ప్రేమతో ....జగతి 1.11am 24th oct 2011





Saturday, October 22, 2011

త్రిమూర్తిని

 ఆ త్రిమూర్తినిలను నీలోనే స్పర్శించిన అనుభవమిది .......
              
              జల్లులు - విరిజల్లులు 
           జగమంతా -నా మనసంతా కురిసే క్షణమిది 
    సుమధారాలు మది ద్వారాలు దాటి 
  జీవన త్రి కాలాలకు విస్తరించిన  నిమిషమిది

         నిజమో- స్వప్నమో ,మోహమో -తన్మయమో 
        నగవులు -దేహపు బిగువులు తెచ్చ్సిన పరవశమో 
     సుధామధుర సంగమ సంభ్రమంలోంచి ఆశ్చర్యమో 
    నీ త్రిగుణ విశ్వరూప సందర్శనలో  నా  నిరీక్షణ ఫలియించిన తరుణమిది 


            గజగామిని గా ప్రతక్షమయి
         మగత పుష్పంగా పరిమళించి 
        గాధామృత  లహరిగా నువ్వు పలకరించాకా
      ఆ త్రిమూర్తినిలను నీలోనే స్పర్శించిన అనుభవమిది 


               ఈ జన్మలోనే వరూధినిని నీలో చూసా 
            నేటి గత జ్ఞాపకాల మధుర వాణిని నీలో దర్శించా
         రేపటి ధాత్రి పై లాలసని నీలోనే స్మరించాను 
 నిన్నటి రాత్రి  నా దేహ -మనో- ఆత్మలను ఒక్కటి చేసి నిన్నే వరించాను

..............................................................................నీ చిన్ను 21-10-2011

"ఎన్నో ఏళ్ల  నిరీక్షణకు ఫలితం ఒక నువ్వు" అనే  టాగోర్ మాటలు తనని కదిలించాయనే ఈ కవి స్వచ్చమైన మనసుకి ప్రతీక ఈ కవిత ......
                                  
     (ఎన్నో ఏళ్లకు తన మది కదిలించి పలికించిన తన ప్రేయసి కోసం ఓ ప్రేమికుని హృదయావిష్కరణమిది )                                                                                

         

Saturday, October 15, 2011

కలయిక ....




దేహాన్ని అర్పించడమంటే
మనసిచ్చినంత సులువుకాదు
మనసు ముడి విప్పినంత తేలికగా
రవికె ముడిని విప్పలేము
దిశ మొలతో నగ్నంగా
అణువణువునా అవతలి వారి
చూపు పాకుతూ స్పృశిస్తోంటే
నిస్సిగ్గుగా తల వాల్చ కుండా
నిలబడడానికి
ధైర్యం కావాలి
తరువూ లతల్లాగా
ఇరు తనువులు
అల్లుకు పోవాలంటే
భయాలూ, బంధాలూ
లేక లయించి పోవాలంటే
ఇరువురిలో సాంద్రత
నిండుగా పొంగిపొరలే
వాగులా ....
తాధాత్మ్యంతో....
మొగ్గలై .....పూచి
మొలకలై ......నిటారుగా
నిలిచిన .....తన్మయత్వంలో
ఒకింత నిజాయితీ ఉండాలి
మనో దేహత్మల
సాక్షిగా
కలయిక జరగాలంటే
అనుభూతించే ఆత్మ స్థైర్యం కావాలి
ఇసుమంత నమ్మకం కలగాలి
మరీ ముఖ్యంగా
క్రతువు కన్న
అనుభూతిని మిగుల్చు కోవాలి....
అప్పుడు ఆ క్షణాన
జరిగే మైధునంలో
పొందే మేధో భావ ప్రాప్తి
అనిర్వచనీయమైనది ....
ఆ నిర్వికల్ప సమాధి లో
రస సిద్ధి పొందిన .. .దేహాలు
దేవళాలు  కాక ......ఏమౌతాయి ???

.......................................................ప్రేమతో...జగతి 3.32pm Thursday vijaya dasami 6/10/2011



Wednesday, October 5, 2011

ఒలికిన అక్షరాలు..


ఆద్యంతాలు లేక 
అనూచానంగా వింటూనే ఉన్నా
నీ గుండె చప్పుడు
అయినా ప్రతిసారీ 
ఓ కొత్త గుండెతో రావుగా
అదే హృదయం
ప్రతిసారీ మరో దేహం తో
వేరే  మొహాలతో 
మనం కలిసి నప్పుడు 
ఎప్పుడూ నీకన్న ముందుగా
నీ గుండెల అడుగుల జడి 
వినిపిస్తుంది
నాకూ హృది ఉందని
నువ్వనుకుంటే బాగుండుననిపిస్తుంది
అయినా చెప్పను 
అడిగి లేదనిపించుకోలేను
అహంకారమా? 
అంటావా? ఏమో మరి ?
ఈ అభావాన్ని ఏమంటారో 
నాకే తెలియదు 
కలసి కాళ్ళు నడిచాక
చేతులు కలిసాక
దేహాలు ఒక్కటయిన 
దివ్య  క్షణాలు మాత్రం
నావే నంటాను 
మొహం, వాంఛ, వలపు 
ఇష్టం, అభిమానం 
ఆహా ఎన్నెన్ని పేర్లు పెట్టాం మనం
దివ్యమైన ఒక్కటైన
ప్రేమకి ....
సౌందర్యాన్నంతా నాశనం
చేసాం ప్రేమది 
నింగి లోని సూర్యబింబం
సముద్రంనుండి వచ్చినట్టగుపిస్తే 
అది భ్రమ అంటున్నామా
అందమైన చంద్రోదయాన్ని 
కనులారా తాగడం లేదూ
విశ్లే షిస్తున్నామా?
మరి అనంతమైన ప్రేమాంబుధిని
మాత్రం ఎందుకు ఇంకా 
మన మూర్ఖ సర్పాలతో 
నమ్మకపు కొండలను బిగించి
చిలుకుతున్నాము?
నాకు నువ్వు నిజం
నీకు నేను నిజం 
ఈ కాసిన్ని క్షణాలు 
ఈ భూమ్మీద 
మనవి అని ప్రేమగా
చెప్పుకుంటే 
ఒప్పుకుంటే ఏం?
ఎప్పుడూ ఏదో ఒక అడ్డేనా
హద్దేనా మన మధ్య
అయినా కలసిన మనం 
కలయిక నిజమని 
ప్రేమ పూరితమని 
ఎందుకు అనుకోము
అక్కడ ఆ అద్వైత క్షణాల్లోనూ
నేను కాని  నువ్వు 
నువ్వు కాని  నేను గా 
విడిగానే ఉండి పోతున్నామేం?
నిన్ను నాలోకి తీసుకున్న  క్షణం
ఆ క్షణం మాత్రమే నిజం నాకు
సహజం కానిదేదీ 
సహించలేను 
ఎక్కడో ఏదో బాధ మెలితిప్పి
నేలకేసి కొట్టినట్టు 
వెన్నెముక విరిగినట్టు 
పెటిల్లుమన్నప్పుడు 
దుఖంతో గొంతు పూడుకు పోయి
ఆఖరికి నావైన
ఆ క్షణాలను కూడా
నాకు దక్కనియ్యని 
కాలాన్ని నిందించనా 
ప్రాణాలు ఐదూ నీ  సొంతం 
చేస్తూ నన్ను మరిచి నేనున్నపుడు
నువ్వు మాత్రం 
అది ఆదిమ వాంఛ మాత్రమే
అంటావేమి?
అనుబంధం ఎంత 
గొప్పదైనా
నిర్బంధం కానీయనని  
నీకు తెలియదా 
నన్ను ప్రేమించకు 
కానీ ప్రేమను ప్రేమించడం
మానేయకు....
అదొక్కటే మనలో  ఇంకా
మనిషితనానికి గుర్తు ...
నా ఆడతనం సాక్షిగా
ఇది మాత్రమే నిజం ...........ప్రేమతో...జగతి 4.32pm.Wednesday 5/10/2011

(అనంతమైన నీలి సాగర స్త్రీత్వాన్ని , అనాదిగా కదలని డాల్ఫిన్స్  నోస్ పురుషత్వాన్ని  చూస్తూ మనసులోని మాటలని అక్షరాల్లోకి ఒంపుకున్నా )