Sunday, August 18, 2013

మదిరాక్షరాలు



మూడు ఝాములు దాటినా 
ఏనాడూ కనికరించని నిద్రను 
మరి కొంచం రోజూ కన్నా ....

మరికాస్త ఎక్కువ మత్తునిచ్చే లా 
మాత్రలు వేసుకుంటానా 

మరింత మత్తులో మునగాలని 
మరి కాస్త మధువును సేవిస్తానా 

మనసు కి మరుపు లేకున్నా 
దేహాన్ని కాసింత సేపు 
అచలనం చేద్దామని 
ప్రయత్నిస్తానా ......

అదిగో సరిగ్గా అప్పుడే ఆ క్షణాన ....
వస్తాడు నా కవితా ప్రియుడు 

ఉద్విగ్నతల  నఖ క్షతాలు చేసి 
ఉద్దీపిస్తాడు నాలోని తన అక్షర ప్రియవాసిని 

ఎక్కడో ఓ మూల చీకట్లో 
ఎవరికీ అందక ఉందామని 
దాక్కున్న భావనా లలామను 
రెచ్చ గొట్టి  వస పరుచుకుంటాడు 

ఆగలేని మైమరపుతోనో 
ఆపుకోలేని ధు:ఖం తోనో 
అక్షరాలు కన్నీళ్లై ......
ఆగకుండా జాలువారుతాయి 

రాద్దామనుకుంటానా ....చెయ్యి కదలదు
మననం లో ఉంచు కుందామంటే 
మరుపు ముసుగు పడిపోతుంది 
పొద్దున్న కల్లా ...అని నాకు తెలుసు 

ఈ కాసిన్ని క్షణాలైనా 
ఈ దేహాన్ని విశ్రమించనీయవూ 
అని వేడుకుంటాను నా ప్రియుని 
కలవర పడే ఎదను అదుపులో ఉంచుకోలేను 

చిత్రమేంటంటే...తాను అలగడు
విసుగు చూపడు 
కనీసం నిట్టూర్పు విడువడు 
నా ఎద లోనే తిష్ట వేసుకు కూర్చుంటాడు 

నీరసించిన దేహంతో కసురుకుంటాను
నిశ్శబ్దంగా నవ్వుతాడు 

మోహరించిన మత్తులో జోగుతుంటాను 
మౌనంగా నిరీక్షిస్తాడు 

కృత్రిమంగా దేహాన్ని నిద్ర లోకం లోకి 
పంపి మనసు తో కలలు కంటూ 
హఠాత్తుగా మేలుకుంటాను ....

ఎదురుగా తానే ... చిరునవ్వుతూ ...

నిన్ను పదాలలో పదిలపరచలేను 
వాక్యాలలో బంధించలేను 
నన్ను బాధించకు ....
వేడుకోబోతాను .....

ఒక్క మాటా వాతెర దాటదు 
అనువణువూ అక్షరాల అనురాగం తో 
పరవశించి పలవరించి పోతాను 

నాలో రేగే భావనలతో  
నా కవితా ప్రియునికి  
అక్షర స్వాధీనపతిక నౌతాను 

నాలోని సప్త వర్ణాలనూ 
మరపు రాక ముందే 
అక్షరాల నలుపులోకి 
అనువదిస్తాను 

ఆర్తిగా నా బాధను పరికిస్తూ తాను 
దాహార్తితో లిఖిస్తూ నేను 
ఇరువురమూ ఏకమై 
కవితా లోకమై ....

అలసిన సంతృప్తితో 
అలవోకగా సుషుప్తిలోకి 
జారుకుంటాము ...

ఎన్ని మార్లు చెప్పినా 
అదే రహస్య వేళకు 
వస్తాడు తాను మళ్ళీ 
ఎదలోతుల్లోంచి పెల్లుబికి

నన్ను అక్షరాల ఆరాధనలో 
అనుబంధించేందుకు .....

...............................................................................ప్రేమతో...జగతి 5.12 పి .ఏం 18/08/2013 ఆదివారం