నాకు గుర్తే తడబడే అడుగులతో
సహకరించని పాదాలతో నువ్వు శ్రమపడి
ఒక్కో మెట్టూ నా పైనుండి ఎక్కడం
నువ్వు కాస్త కాస్తగా ఎదుగుతూ
పైకి వెళుతుంటే సంతోషించింది మొదటిగా నేనే
ఆ విషయమూ నీకు తెలుసు
పాకే పిల్లాడు నడుస్తోంటే తల్లి పడిన ఆనందమది
ఎక్కడ ఏ మెట్టు జారి కిందకి పడి పోతావో నని
నన్ను నేను దిట్టంగా నిలబెట్టుకున్నాను
నువ్వు పూర్తిగా ఎక్కేవరకు
ఇప్పుడు చివరికి చేరేను అని నువ్వనుకుని
నన్ను నెట్టేద్దామనుకున్నావు
నెట్టేశావు కూడా …..
అందుకు నాకు బాధ లేదు
నా సహాయం లేకుండా నూవ్వుండాలనే నా ఆకాంక్ష
కానీ నువ్వు చేరిన చోటు నీ రెండు పాదాలు
స్థిరంగా ఆనుకున్నాయో లేదో
నీకక్కడ నువ్వు ఆశించే యశస్సు
సౌకర్యం , సాఫల్యం లభించిన క్షణాన
నువ్వు నన్ను కిందికి నెట్టేయ్ ఫర్వాలేదు
కానీ కాళ్ళు పూర్తిగా ఆనీ ఆనకుండానే
నెట్టేశావా మళ్ళీ నిన్ను అందుకోవడానికి నాకై
నేనుగా లేవలేని దాన్ని అందుకు
ఇన్ని జాగ్రత్తలు చెప్పేది
గుర్తుంచుకుంటావు కదూ ???
............................................................ప్రేమతో ...జగతి 12.33 పి.ఏం 25/06/2013 మంగళవారం