Friday, December 14, 2012

జ్వాలార్ద్ర జ్ఞాపకాలలో



మొహబ్బత్ కా మసీహా!   ఆదాబ్ అర్జ్ హై !!
ఆత్మీయ లిపిలా గుండెనిండా ఆవరించివున్న 
మీ గురించి ఏమి రాయగలను?

దోసెడు పదాలు పుంజీడు వాక్యాలతో 
మీ ఆప్యాయతా మాధుర్యాన్ని ఆవిష్కరించలేను 
కొందరి మాటలు మెదడుకి పని చెపుతాయి 
కొందరి పలుకులు హృదయాన్ని కదిలిస్తాయి 
మీ వాక్కులు రస గుళికలు 
మెదడునూ , మదినీ చలింప చేస్తాయి 

ఇరానీ చాయ్ నుండి ఇండో -చైనా సంబంధాల దాకా 
చక్కెర  పొంగలి నుండి చలం శైలి దాకా 
ఒకటా రెండా ఎన్నని కబుర్లు కమ్మని విందులు 
మీతో కలిసి గడిపిన కొద్ది సమయమైనా 
బహు విషయాంశాల మృష్టాన్న భోజనమే --
నజ్మ్ , గజల్, గీత్ , షేర్ 
సైగల్ , సురయ్యా , జగ్జిత్ , కిషోర్ ,
హిందీ , ఉర్దూ, తెలుగు , సంస్కృతం 
ప్రాచీన , ఆధునిక కావ్య మధురిమ 
మీ వాక్ ఝరీ ప్రవాహం లో 
నవ రాసానుభూతుల ఆస్వాదనమే 

ఆపితే ఆ క్షణాలు ఎక్కడ జారిపోతాయోనన్న 
ఆతృత తో మాట్లాడే మీ ఆర్ద్రత 
బతికే ప్రతి క్షణాన్ని జీవించడం లోని 
మమతను తెలిపిన మీ ఔదార్యం 
జీవనావసరాలెన్నున్నా 
ఎవరినీ అర్ధించని మీ ఆత్మాభిమానం 
నిలువెత్తు నిండు దనానికి నిదర్శనమయిన  
జనాబ్ -ఎ - ఆలం ! అస్సాలామాలేకుం !

కలిసిన ప్రతి సారీ 
ముంచెత్తే మీ వాక్కుల వరద వాగు ముందు 
జలపాతాలు చిన్నబోతాయి 
సముద్రం తడబడి గొంతు సవరించుకుంటుంది 
పిడుగుల లోకమొకటి 
తన అంశను భూమ్మీద చూసి సంతసిస్తుంది 
రెండో పోలిక లేని 
ఒకటో రకపు విస్మయానుభవానంద కరం 
ప్రసంగమై సాగే మీ స్థిర గంభీర స్వరం 
తిరిగిరాని స్వప్నమిక ఎన్నటికీ --

గత ఏడాది ఇరవై ఒకటి మార్చి న 
మీ మాటలింకా గుర్తున్నాయి 
ఎలా బతకాలని కల గన్నాం అన్నప్పుడు 
నిబిడ ఆశావాద కాంతి మీ విప్పారిన కళ్ళల్లో 
ఎలాగో జీవితాన్ని జీవించాం 
అన్నప్పుడో అనివార్య నిర్వికారత 
అగ్ని పర్వతం మీద కాల కరాళ మేఘ ఛాయ 
గుండెల్లో గడ్డ కట్టుకు పోయింది 

పాదాలకు నమస్కరిస్తే 
మీ దంపతులందించిన ఆశీర్వచనాలు 
అవే మాకిక వెలకట్టలేని జ్ఞాపకాలు 
నిరంతర స్ఫూర్తి దాయకాలు 
సిద్ధాంతాలూ, విశ్వాసాలూ, 
జీవన క్రూర వాస్తవాలు 
బతుకు లోని విలోమాలు 
అన్నిటినీ సమ్యక్ దృష్టి తో స్వీకరించిన 
మీ మహోన్నత తాత్వికత 
మాకు చిరంతన ఆదర్శం 

హమేషా కె లియే అల్విదా అంటూ 
మము వీడిపోయిన 
పదును పలుకుల పసిడి అంచుల పాదుషా !
ఖుదా హఫీజ్ 
మానవ ప్రేమానురాగా ప్రవక్తా !!!

...........................................ప్రేమతో ...జగద్ధాత్రి 
(జ్వాలా ముఖి మరణం తర్వాత ఆయనకి ఇచ్చిన నివాళి , నాకు వచ్చీ రాని భాషలో , బాగా వచ్చిన ప్రేమ భాషలో )


Monday, November 19, 2012

మారని ఆమె, సముద్రం, నేను




" ఓహ్ ! షట్ అప్ ధీరూ నిన్నేవడూ బాగుచెయ్యలేడు .." 
అతని గొంతులో ధ్వనించిన కోపానికి బిత్తర పోయింది ఆమె. 
" ఎప్పుడూ ప్రేమ ప్రేమ అని ఎందుకు వెంట బడతావ్ అసలు మనసే లేదు అంటుంటే ప్రేమట ప్రేమ ..." అంత  అసహనం ఎప్పుడూ చూడలేదు అతనిలో.
" పలకవు ఉలకవు ఏయ్ నిన్నే !.." ఒక్కసారి అతని వైపు తలెత్తి చూసి మళ్ళీ ఇసికను చేతులతో సవరిస్తూంది ఆమె. 
" ఎమన్నా అన్నామా  మౌనం అమ్మగారికి ... ఓయ్ ..." ఆమెని కుదిపాడు 
తలెత్తి చుసిన ఆమె కళ్ళల్లో నిండుగా నీళ్ళు ఒలక బోయే మేఘాల్లా . ఒక్క క్షణం చలించినా వెంటనే సర్దుకున్నాడు. 
" వద్దు ...ఈ కన్నీళ్ళతో ఎవరినే కట్టి పడేయ్యాలేవు ..." విసుగ్గా అన్నాడు 
" నేనెప్పుడైనా అలా కట్టి పడేసే ప్రయత్నం చేసానా ?"  నెమ్మదిగా ప్రశ్నించింది.
వెంటనే మాటలు రాలేదతనికి  ... నిజమే ఎప్పుడూ తను బాధ పడుతుంది తప్ప ఏ  విషయం లోనూ ఏదీ అడగదు. 
" ఏమో నా వరకు నేనేమీ నిన్ను ప్రేమిస్తున్నానని  చెప్పలేదు ప్రేమించలేను కూడా ... " నిష్కర్షగా అన్నాడు.
మళ్ళీ తనే " అసలీ ప్రేమ అనే దాన్ని నమ్మని వాళ్ళలో మొదటి వాడిని నేనే " 
" ఇవన్నీ ఇప్పుడెందుకు మాటాడు తున్నావో తెలుసుకోవచ్చా...?" నిమ్మళంగా అడిగింది 
కాసేపు మౌనం .... " ఏమో చెప్పాలనిపించింది అంతే " 
" నేనేమన్నా అడిగానా ?" 
" లేదులే ...కానీ , నాకే ఎందుకో నువ్వు పదేపదే ప్రేమ అనడం నచ్చలేదు "
" సరే ఇంకెప్పుడూ అనను ఓకే నా ..." వెంటనే ఒప్పేసుకుంది. ఇక ఏమనాలో తోచలేదు అతనికి. 
" ఎందుకు తాత్వికా ! ఈ రోజు నా ప్రేమ ని తిడుతున్నావు ..." పకాపక నవ్వింది 
" నేనేమీ ఎవరినీ నిర్బంధించలేదు గా ప్రేమ అంటూ... ఆయినా ప్రేమ బంధం అంటారు కానీ  నా దృష్టిలో ప్రేమ బంధ విముక్తి "
" చాల్లే ఆపు తల్లీ నీ సిద్ధాంతాలు ..." 
" అదే పొరబాటు ఏ  సిద్ధాంతం లేనిదే ప్రేమ " 
" నాకు ఈ దేహం పై తప్ప దేని మీద నమ్మకం లేదు ..."
" దేహం లోని ఒక అంగమే మెదడు , హృదయం కాదా ... మరి అందులోంచి జనిన్చేదే గా ప్రేమ ?"
" ఆపు రాక్షసీ ! ఎక్కడో దేన్నో తీసుకొచ్చి దీనికి ముడి పెడతావు "
" సరే మళ్ళీ ఎప్పుడూ మాటాడను లే ..." నిశ్సబ్దంగా తల వంచుకుంది . ఆమె పయ్యెద పై కన్నీళ్లు పారిజాతాల్లా జలజలా  రాలడం చూసాడతను 
దగ్గరకి తీసుకుందామని చాచిన చేతులు ఎందుకో ఆగి పోయాయి. 
ఎలా చెప్పాలి  ఈమెకి అనిపించింది ఒక్క క్షణం . ఆమె నమ్మకం ఎలా కాదనాలి. ఎవరు ఏ  ద్రోహం చేసినా కూడా ప్రేమతోనే జయించాలి తప్ప ద్వేషం గా మర్చుకోకుడదని వాదించే ఈ ప్రేమ మూర్ఖురాలికి ఎలా చెప్తే  బోధ పడుతుంది ? ఎందుకో ఒక్కసారిగా కోపం జాలి విసుగు కలిగాయతనికి. 
తనం కోసమంటూ ఏమీ మిగుల్చుకోదు , భవిష్యత్తు ఆలోచించదు ... ప్రేమించే మనుషుల కోసం ఏదైనా చేసేస్తుంది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించెంత వెర్రిది.
అందుకే తల్లి , భర్త , అత్త మామలూ అందరూ మోసం చేసారు , విచిత్రం ఏమిటంటే తెలిసినా ఎవరి పట్లా ద్వేషం పెంచుకోదు. కానీ ఎలా బతుకుతుంది అర్ధం కావడం లేదు. 
ఒక్కసారిగా జాలి ( ప్రేమ అనకూడదు లెండి) ఆమె ని దగ్గరగా హత్తుకున్నాడు. 
" సర్లే పద వెళ్దాం , నీకు చెప్పినా అదిగో  ఆ సముద్రానికి చెప్పినా మీ ఘోష మీదే ...పద పిచ్చీ !" అనునయంగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించాడు మౌనంగా నడిచింది అతనితో. 
...........................................ప్రేమతో ..జగతి 12.40pm Friday 16th Nov 2012 



Sunday, October 7, 2012

అతను ...ఆమె ...ఆత్మీయం




" హలో!" .....ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసినట్టు ఆ పిలుపు వినగానే ఆమె లో ఏదో గిలిగింత. 
" మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి ..." చిలిపిగా అంది 
" హహహ చాల్లే నేనే నంబర్ చేసానో నాకు తెల్సు కానీ .... ఏంటీ కోపమా ..." అంత లాలనగా అడిగితే కోపమా అబ్బే అదెప్పుడో రింగ్ టోన్ వినగానే పోయింది కదా.
అయినా బింకంగా " కోపం ఏమీ లేదు ... కొద్దిగా బాధ అంతే.." ఎంతగా మామూలుగా చెప్దామనుకున్నా చలింపు స్వరం లో తనకే తెలుస్తోంది. 
కాస్త సర్దుకుని ..." ఎప్పుడు వచ్చేదీ ? " ఆత్రంగా అడిగింది 
" ఇప్పుడప్పుడే అయేలా లేదురా , ఈ నెలాఖరు అవుతుందేమో ...." చెప్పాడు.. అతని స్వరం లో ని భావాన్ని పట్టుకోవడం కష్టం. 
" అయ్యో అవునా ... పదవ తేదీ  తర్వాత వస్తాను అన్నావ్ "...నిరాశ 
" అదే చెప్పేది మరి పదవ తేదీ తరవాత ఎప్పుడవుతుందో మరి డేట్ చెప్పలేదుగా ..." నవ్వేడు 
మౌనం ..... నిశ్శబ్దం ఇద్దరి నడుమా 
" ఏయ్ ఏంటీ ఉన్నావా ? మాటాడు పదిహేను రోజుల తర్వాత  ఇవాలే తీరింది నాకు ... మాట్లాడురా ..." బుజ్జగింపు 
" ఏమి మాటాడను ... ఏమీ లేదు ...." నిర్లిప్తంగా నిరాశ ఆమె స్వరం లో 
" అబ్బా మాటాడరా మరీ ఏంటి చిన్నపిల్లలా వస్తానుగా ....." 
" బాలూ.... నాకు నువ్వు కావాలి ... చూడాలి నిన్ను ... నీ చేతుల్లో చచ్చిపోవాలనుంది " ఆగి ఆగి వెక్కి పడుతోన్న మనసుతో 
" ఏయ్ మెంటల్ ....ఏంటా మాటలు ..."
" నిజం నా గురించి నువ్వేమనుకుంటావు ..." 
" చెప్పాగా మెంటల్ అనీ ....." పకపక నవ్వేడు 
ఆమె మాటలాడలేదు మళ్ళీ తనే అన్నాడు 
" ఏంటీ చచ్చిపోతావా? ఓకే ఐతే రెడీ గా ఉండు ఇద్దరం చచ్చిపోదాము ఓకే నా ..." హాస్యం తో కూడిన లాలన 
" బతాకాలని లేదు నాకు ..... నువ్వెందుకు చావడం " ఉక్రోషంగా అంది 
" నాకూ లేదు రా ... బతకాలని అందుకే వస్తాగా ఇద్దరం చచ్చిపోదాం " 
" మరి నువ్వొస్తే మనిద్దరం దగ్గరైతే అప్పుడు ఇంకేదో  అయితే అప్పుడు ..... బతకాలనిపిస్తే ..." 
" హహహహ్హహా అందుకే అన్నా మెంటల్ అని ....చాల్లే చావు కబుర్లు జీవితం గూర్చి చెప్పు ఎమన్నా " 
" నాకా  ఏమీ లేవు ... " 
" మృత్యువొక్కటే సత్యం రా ... అది వచ్చేటప్పుడు వస్తుంది ... దాని కోసం ఆత్ర పడక్కర్లేదు ..." గంభీరంగా పలికిన్దతని  గొంతు
" నిజమే బాలూ. .. అయినా నేను నీ లా జ్ఞానిని కాదుగా ఏదో అలా బతికేస్తున్నా .... ఒక్క మాట అడగనా?" ఆత్రం 
" అడుగు ....." 
" ఒక్కసారి నువ్వు నావాడివి అనుకోవచ్చా నేను " 
" దానికి పెర్మిషణ్ ఎందుకు అనుకో...." నవ్వేడు 
" అబ్బ అది కాదు ... నువ్వెప్పుడైనా నన్ను నీదానిగా అనుకోవెందుకని?"
" ఎందుకిప్పుడిదంతా అసలీ సొంతం పరాయీ ఇవన్నీ అవసరమా చెప్పు .... మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం అంతే "
" అంతే ప్రేమగా ఒక్కసారి నువ్వు నాదానివని నేను నీ వాడినని అనొచ్చుగా ...." 
" అబ్బ నువ్వు ఇలా మాటాడవే ఎప్పుడూ ... నాకీ మెలోడ్రామ నచ్చదు...ఆడాళ్ళకి అదే ఇష్టం ... నాకు ఇష్టమైతే  ఇష్టం  లేకుంటే చెప్పేస్తా నాకు నువ్వు వద్దమ్మ విసిగించకు అని ....మనకి మొహమాటం తక్కువ కదా ..." 
" ఓయ్ ! నాకీ మెలోడ్రామాలు అసలు నచ్చవు ఏదో మాటడుదామని అన్నా అంతే ... నన్నూ ఆ లిస్టు లో కలిపెయ్యకు సుమా "
" నాకు తెలుసు రా నువ్వు ఆ లిస్టు లో లేవు లే హహహ" 
" సరే ఏమి చేస్తున్నావు , అవును కధలేందుకు రాయవు నువ్వు ?..."
" ఎందుకు రాయను రాస్తానే ...రాసాను చాల అచ్చైనాయి కూడా " 
" అసలీ ఫేస్ బుక్ వచ్చి మనుషుల్ని చెడ గొట్టిన్దనుకో ఎంచక్కా రాసుకునే వారు ఇది వరకు ఇప్పుడు ... మీ అడాల్లేదో ఒక బొమ్మో  వాక్యమో పెట్టడం దానికి  ఆహా ఓహో అని అందరి కామెంట్లూ...." 
" ఓయ్ ఓయ్ జోరు తగ్గించబ్బాయ్ అసలు మనం పరిచయమైంది కూడా ఇందులోనే ....మర్చిపోకు..."
" ఓకే పరిచయమైనా వెంటనే వారం రోజుల్లో మీ ఊరు వచ్చాను కదా అమ్మాయ్?"
" వస్తే ..నాకోసమా నీ పని మీద వచ్చావ్ ..." 
" ఏయ్ గమ్మునుండు ... నేను వచ్చిందీ నీకోసమే ... రెండు సార్లూ వచ్చిందీ నీ కోసమే .... కాదని చెప్పు హహ్హ సరేలే వదిలేయ్" 
" ఏమి చదువుతున్నావ్ ?" 
" ఏదో బుక్ మీద వర్క్  చేస్తున్న ఈ మధ్యనే ... లత మోహన వంశి గూర్చి మాటాడా " 
" ఇటీవల నాకు నచ్చిన మంచి ఫిలోసోఫేర్ ని చెప్తాను చదువు నీకు నచ్చ్చుతాడు , బామన్ తన  పుస్తకం " లిక్విడ్ మాడర్నిటీ" ఆర్టికల్స్ చాల బాగున్నాయ్ చదవరా అసలు ఈ ఆధునిక యుగం లో యువత ఏమి కోరుకుంటున్నారు ఏంటీ  అన్నది సామజిక శాస్త్రవేత్తగా చాల బాగా డిస్కస్ చేసేడు. నాకు బాగా నచ్చాడు.."
" ఓకే తప్పకుండ చదువుతా ... తాత్వికా... మనోవైజ్ఞానిక కోణం లో కొన్ని రచనలు స్టడీ చేస్తున్నా ... రాయాలి ఇంకా " 
" అసలే మెంటల్ వి ఇంకా నీకా స్టడీ లెందుకు హహః" 
" హహః నిజమేలే నేను మెంటలే ..ఒప్పేసుకున్నా " 
" ఏయ్ ఏదన్న ఒప్పేసుకుంటావా  ... నీ గురించి నాకు తెలీదా ఏంటీ... ఉరికే అన్నా రా ... "
" నాకు తెలుసు సార్.... నా కవితల పుస్తకం తెద్దామని అనుకుంటున్నా మిత్రురాలు ఒకామె బాగా ప్రోత్సహిస్తోంది ..."
" మరింకేమైతే తప్పక తీసుకురా ... వేరి గుడ్ " 
" సరేలే ... ఆలోచిద్దాం ... యు.జి. మీద ఎవరో ఈ మధ్య వర్క్  చేసారు అయన  కొటేషన్స్ తెలుగు లో చేసారు, అయన మీద ఇంతకు ముందు నేను వర్క్ చేశాను కదా ... ఆ బుక్ కూడా ఆవిష్కరణ ఉంది " 
" అవునా గుడ్ ... ఒక ఫ్రెండ్ ఉన్నాడు రూం లో ఇక పడుకోనా" 
" ఓహో చెప్పవేమీ ... ఆ అమ్మయినలా కూర్చోబెట్టి మాటాడు తున్నావా  టైం వేస్ట్ కదా ఎంజాయ్ "
" హే ! మెంటల్ నా గురించి ఎందుకల అనుకుంటావ్ ఉన్నది అబ్బాయ్ ... వాడు హైదరాబాద్ నుండి వచ్చాడు నా కోసం ..." 
" సరే సరే .... ఏదన్న ఎవరన్న ... పాపం ఆయనకీ చెప్పు ఓ మెంటల్ అండీ నాకోసం కలవరిస్తుందీ అని .. లేకుంటే మళ్ళీ ఆమె అపార్ధం చేసుకుంటుంది పాపం ...."
" అబ్బా గమ్మునుండు ... అమ్మాయి కాదురా అంటే....వినవు కదా ..నిన్నూ.."
" ఓకే ఓకే ఎవరైనా నేను చెయ్యగలిగేది ఏమీ లేదులే కానీ ...బజ్జో ....ఇంకేమన్నా ...నీ కౌగిలి లో నలిగి పోవాలనుంది...ఆ అదృష్టం ఇవాళ ఆవిడకి ప్చ్ ప్చ్.."
" ఏయ్ పిల్లా నా కౌగిలిలో నలిగి పోయేది దిండు  మాత్రమే ఇంకెవరూ లేరిక్కడ ....బజ్జో నువ్వు కూడా"
" నేను నిద్ర .... వద్దులే ప్రయత్నించడం విఫల మవడం ఎందుకు ...నువు చెప్పావుగా ఎవరినో చదవమని అయన దగరికి వెళ్తా "
" యా సరే మరైతే ఉంటా .... చదువుకో ... ఆరోగ్యం కొంచం ....చుసుకోరా..."
ఒక్క క్షణం నిశ్శబ్దం ..... ఫోన్ కట్ చేసిన శబ్దం 
................................................................ప్రేమతో ...జగతి 5.23pm Sunday 7th Oct 2012 

Friday, October 5, 2012

ఎదురుచూపు



ఎంత చెప్పినా వినవుగా
నిరీక్షించొద్దు
 నాకోసమంటే....
అన్నాడు నెలరాజు ఆత్మీయంగా
చిర్నవ్వింది కలువ
అతని ప్రేమకి.....ప్రేమతో...జగతి

Tuesday, September 25, 2012

అవసరమా?


జగద్ధాత్రి || అవసరమా?||

దాపరికం అవసరమా నేస్తం? 
అడిగాను సందేహంగా 
అవసరమే ... ఖచ్చితమైన జవాబు 
సూటిగా తాకింది చెవిని 

కొన్ని మాటలు , కొన్నివిషయాలు 
కొన్ని సంఘటనలు కొందరితో చెప్పకూడనివి 
చెప్పకూడదు ...అందుకు అవసరమే దాపరికం 
నిష్కర్ష స్వరం లో పలుకు సోకింది కర్ణ భేరిని 

ఏమో మరి ...పెదవి విరిచాను 
ఏది దాయాలో ఏది దాయ కూడదో  
నిజంగా నాకు తెలీదు సుమా 
అన్నా భుజాలెగరేసి 

మనసు , మమత జంట కట్టిన 
అనుభూతుల రసావిష్కరణ 
మది లో చెలరేగే మధుర తుఫాను 
అక్షరాలుగా ఒలికి పోతాను 

హృదిని వేధించే బాధలను 
మాటలలో పంచుకుంటాను 
చుట్టూ ఉన్న సమస్యలకు 
కవితావేదన గా ఎక్కడన్నా 
పరిష్కారాలు దొరుకుతాయేమో నని 
వెదుకులాడుకుంటాను

ఘనీభవించిన భావ ప్రకంపనలను
ఉద్విగ్నతతో ఉల్లేఖిస్తాను 
అన్యాయపు వక్ర వర్గాలను 
తూర్పార బట్టకుండా ఉండలేను 

మనుషుల మది మేధలలో
అలుముకున్న విష మేఘాలను 
అనురాగ వర్షమై అలికి వేస్తాను 

అనుభవాల , అనుభూతుల సారాన్ని 
మరు తరం వారికి పంచి 
జీవితమేమిటని ఎరుక కల్గిస్తాను 

అందుకే నాకు దాపరికాలు లేవు 
తప్పులో ఒప్పులో మెప్పులో దేప్పులో అయినా 
మనసు చెప్పిన మాట 
మేధ గాంచిన బాట 
పదిమందికీ పంచి పరవశిస్తాను
కొందరి హృదినైనా కవితా దివిటీనై
వెలుగుతూ, వెలిగిస్తూ సాగిపోతాను 

ఇక ఇప్పుడు చెప్పు దాపరికం అవసరమా?
జీవితానుభవాల సారాన్ని 
దాచుకోవడం అవసరమా నేస్తం ??
దాచకుండా చెప్పు !!!


..................................................ప్రేమతో ...జగతి 8.45 pm 25th sept 2012 tuesday 


 





Tuesday, September 18, 2012

అనురాగరంజితం ....




" నీకు ఏ రంగంటే బాగా ఇష్టం?" అడిగిందామె అతని భుజం పై తలాన్చికిటికీలోంచి నీలి సంద్రం లోకి చూస్తూ...
" నాకా, హహ్హ, అన్ని రంగులూ ఇష్టమే ..." అన్నాడతను చూపు ఆమె వైపు తిప్పకుండానే 
" అది కాదు , బాగా ఇష్టమైన ర౦గంటూ  ఒకటుంటుంది కదా చెప్పవా ప్లీస్" 
" నాకలా ఏమీ లేదురా , అయినా అన్ని రంగులూ ఇష్టమే నాకు ఒకో రంగు ఒకో భావ సంకేతం కదా , చిత్రకారుడికి  ఏ రంగు అంటూ ప్రత్యేకంగా ఇష్టాలు ఉండవమ్మాయ్  "
" ఎందుకుండవు కొందరి పెయింటింగ్స్ లో బాగా ప్రస్పుటంగా కొన్ని రంగులు కనిపిస్తాయి కదా .." 
" హహ అదా అది ఆ చిత్రం బట్టీ ఉంటుంది కానీ రంగు ఇష్టమని కాదమ్మాయ్...అయినా నువు మనసు పెట్టి చూడు నా చిత్రాలని అప్పుడు నా మార్క్ నీకు అర్ధమౌతుంది "
" మాకంతా గ్యానం లేదు లే స్వామి ... ఏదో మీరు చెప్తున్నారు కదా తెలుసుకుందామని ...." 
" ఉరికే తెలుసుకోవడానికేనా ఇంకేమీ లేదా ...మొద్దూ " ఆమె నెత్తి మీద చిన్నగా మొట్టి కాయ్ వేసాడు.
" అబ్బా! కొట్టకు నాయనా ..." బుంగ  మూతితో  సవరించుకుంది తల.
" అబ్బ అంత చిన్న దెబ్బకే నా సుకుమారీ " నవ్వేడు పకపక, నవ్వేసింది ఆమె కూడా.
" పోనీ ఇది చెప్పు ..నన్ను ఏ రంగులో చూడటానికి ఇష్ట పడతావు ?"
" చెప్పనా ...." మార్దవం అతని గొంతులో 
" చెప్పమనే కదా అడిగింది ..." 
" ఏ రంగు లోనైనా బాగుంటావు " నవ్వేడు 
" ఆహా ! నిజమా వెక్కిరి౦పా ... చెప్పమంటూంటే" అతని జుట్టులో వెళ్ళు పెట్టి సున్నితంగా కదిలించింది 
" హా చెప్తా ! నాకు నిన్నూ నీ రంగులోనే చూడటం ఇష్టం " కొంటె గా నవ్వేడు 
" అంటే ? ఓహ్! ఛీ పో అల్లరీ ... ఎవరికైనా వాళ్ల ప్రియమైన వారు ఏ రంగు లో బాగుంటారో అని ఉంటుంది కదా అని అడిగానమ్మా...అల్లరీ " 
" నే చెప్పా కదా మరీ " బుద్ధిగా చూస్తూ అన్నాడు 
" అదా చెప్పడమంటే పో ....నీకు నేనంటే ఎగతాళి " ఉడుక్కుంది 
" లేదురా! నిజమే చెప్తున్నా రోజంతా ఈ రంగుల్లో మునిగి తేలే నాకు అతి సహజమైన  స్వచ్చమైన నీ మనసు రంగంటేనే ఇష్టం ... అర్ధం చేసుకోవాలి మరి మా మనసూ కాస్త " 
" ఏయ్ నిజమా ! అసహజంగా ఉండటం నాకు చేతకాని పని కదా మరి " అతను తల తిప్పి ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టేడు 
" అందుకేగా అమ్మాయ్ గారిని ఇంత ప్రేమించేది మరి " 
" అబ్బో ఇదంతా ప్రేమే ... ఇదీ ఓ రంగుల కలేనేమో , చిత్రమేనేమో కదూ " అతని చేతుల్లో ఇమిడి పోతూ అంది 
" కల కాదు కల నిజమైన అందమైన  అపురూప సజీవ చిత్రం, ఇప్పటికైనా అర్ధమైందా ...మోద్దమ్మాయ్ కి " ఆమె లో కలిసిపోతూ కరిగి పోతూ మత్తుగా పలికాయి మాటలు . నిశ్సబ్దంగా చిత్రాలన్నీ వారిద్దరినీ పరికిస్తూ ఉండి పోయాయి , వాటికే మాటలొస్తే ఏమనేవో వారి అనురాగ సంగమాన్ని చూసి !!! 
...................................................................ప్రేమతో ...జగతి 1.59pm Saturday 8th Aug 2012 

విచిత్రం




నా తెల్లని హృదయ కాన్వాసు పై 
నీ భావనల రంగులన్నీ ఒకేసారి చిమ్మావు
నీ కోప తాపాల, ఉద్వేగాల, ఉద్విగ్నతల 
ఆశ నిరాశల, అస నిపాతల, అహంకారాల 
నీ వేదనల, శోధనల , అంతర్యపు వర్ణాలెన్నో 
అన్నిటినీ ఒకేసారి దోసిలి  నిండా తీసుకుని 
ఒక్కసారిగా  విసిరేవు ...
అన్ని ఛాయలు కలగలిసిన నీ హృదయాన్ని 
అదాటుగా ఆవిష్కరించేవు 
నీలోని అన్ని రంగులను  ఒకేసారి చూసిన నా మది 
నిశ్చేష్ట అయి పోయింది 

చిత్రమైన నీ భావాల వైచిత్రికి 
నా హృది మూగబోయింది 
సప్త వర్ణాలు కలగలిసిన విన్నూత్న వర్ణమేదో 
గజిబిజి గా నన్ను కంగారు పెట్టింది 

ధవళ వర్ణం తప్ప ఎరుగని నా ఎద
ఇన్ని రంగుల కల బోతకు బిత్తరపోయింది 
నీవు విసిరిన పలు రంగులను కన్నీటితో కడిగి చూసుకున్నాను 
నీ వలపు వర్ణం ఉందా లేదా అని 

సప్త వర్ణాల కలబోత 
నీ భావాల కుంచెలోంచి 
స్పష్టా స్పష్ట కలనేత నీ చిత్రాల చిత్రం 
నీ హృదిని ఆవిష్కరించింది 

అన్ని వర్ణాలలోనూ 
నా కనులకు , మనసుకు 
స్పష్టంగా అగుపించింది 
నీ అనురాగ రంజిత సువర్ణం 
ఈ లోక పు కుడ్యం పై ఎప్పటికీ 
వన్నె తరగని ప్రేమ తైల వర్ణ చిత్రం 
 ప్రియతమా! బహు చిత్రమైన చిత్రకారుడివి నీవు 
అంతరంగాన్ని అన్ని రంగుల మిశ్రమం లోనూ  
మమతల మధురిమను దర్శింప జేశావు 
మాటల్లో చెప్పవు కానీ నీ చిత్రాలలో 
పటం కట్టుకున్నది మాత్రం ప్రేమానురాగాలేనని
అవగతమైంది నాకు ....ఇప్పుడు నీ చిత్రాలు 
చిత్రం కావు నాకు ... నవీన రీతులలో తీరిన 
నీ ఊహల , ఆశల ,ఆంతర్య అద్వితీయ హర్మ్యాలు !!!

........................................................................ప్రేమతో జగతి 6.09am .18th Sept Tuesday 2012 











Saturday, September 15, 2012

రాగ సంద్రం ...




" పుట్టిన రోజు శుభాకాంక్షలు తమకు " తియ్యగా పలికిందామే స్వరం 
" హహహ " నవ్వే అతని సమాధానం 
" అదేంటబ్బాయ్ పుట్టిన రోజు నాడు విష్ చేస్తే కనీసం థాంక్స్ అయినా లేదా మాకు?" 
" పుట్టినరోజు హహ ...అదెప్పుడో మానేసాను రా.అయినా అదేమన్న గొప్పా ఏంటి ." 
" అదేంటి అలా అంటావ్ ,,,నీకు గొప్ప కాదేమో గానీ నాకు నా బాలు పుట్టినరోజు గొప్పే సుమా" ఎక్కడో వాక్యం పాదం చివ్వర చిన్న గ వణికింది గొంతు
" ఓకే ఓకే సరే లే ...అయినా ఇంత దూరం నుండి శుభాకాంక్షలు చెప్తే ఏం చేసుకుంటాం అమ్మాయ్ వస్తానన్నావ్ .." మాట మార్చాడు 
" అన్నా ను కానీ ఎగ్జామ్స్  టైం కదా కాలేజ్ లో సెలవు దొరకలేదు " 
" నువ్వు వచ్చి ఉంటే నిజంగా  పుట్టినరోజు చేసుకునే వాడినే ..." ఎక్కడో చిన్న వెలితి కనీకనబడకుండా
" చాల్లే మరీ చెప్తావ్ ఇందాక ఎప్పుడో మానేసానన్నావ్  ?" 
" అదే గా చెప్పేది మానేసాను చిన్నప్పుడే కానీ ...నిజం చెప్పనా ...ఇప్పుడు నీతో కలిసి మళ్ళీ పుట్టినరోజు చేసుకోవాలనుంది ..." నిజాయితీ అతని స్వరం లో 
" అయ్యో నే రాలేక పోయాను బాలు ..అయినా మీ వాళ్ళందరూ ఉన్నారుగా ..." 
" ఎవరున్నారు నాకు ? నాకు నేనే ... నీకు  తెలీదా ..."
" ఒంటరితనం బాధిస్తుంది ధీరూ ... ఎందరిలో ఉన్న ఒక్కడినే అనే ఈ భావం , ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీల్ ..." ఆపేసాడు , అంతే అతను ఎప్పుడు మనసు జారుతుందని తెలిసినా వెంటనే మాటలు ఆపేస్తాడు ....ఆమెకి తెలుసు 
"  నేను వస్తే ఏంటి మరి స్పెషల్ ?" అడిగింది సాధ్యమైనంత మామూలుగా 
"  నీకు తెలీదూ , నీతో ఉన్నంత....సరేలే వదిలేయ్ నాగురించి ఎందుకు " తెగిన దారం లా ఆపేసాడు 
" అయ్యో నేను రావాల్సింది  కదూ బాలు , నువ్వైనా వచ్చేయ్యల్సింది ఇక్కడికి ..." 
ఒంటరితనం నిజం ఎన్ని రకాలో , మానసికం, దైహికం , మేధో పరం ...ఇన్ని ఒంటరితనాలను భరిస్తూ ఇద్దరం ... నిజమే ఒకరిలో ఒకరుగా కాక ఒక్కటిగా కలిసిపోగలగడం కేవలం తామిద్దరూ మాత్రమే ....ఆమె మదిలోనూ అలజడి ...
" హే సరేలే అంత బాధ పడతావెందుకు ? మాటాడు ఎందుకా మౌనం , మనం కలిసినప్పుడే  పుట్టినరోజు చేసుకుంటాలే , ఎన్ని సార్లు నీతో ఎన్ని సార్లు పుడతానో నేను " మౌనం "ఎన్ని సార్లు నీలో లయించి పోతానో...." అనుకున్నాడు మనసులో ...అతని అంతరంగం ఆమెకి అర్ధమైంది ...అయినా ఏమీ అడగదు 
" బాలూ! .." ప్రేమ నిండిన మది తో పలకలేక మాట రాక అవస్థ చిత్రమైనది 
"...అయినా ... అమ్మాయ్ నీతో ప్రతి రోజూ ..." హస్కీగా పలికిన్దతని స్వరం మాట మారుస్తూ 
" నాతో ప్రతి రోజూ...." రెట్టించింది 
" ఒక పండుగే నాకు .." అ స్వరానిది ఏ రాగమో యిట్టె చెప్పేయచ్చు అది ముప్పైయ్యారు జన్యు రాగాలను మించిన అనురాగ జన్యు రాగం.
కాసేపు రెండు వైపులా నిశ్శబ్దం . ఆమె చెప్పాలని అనుకుంటున్నది  అతనికి తెలుసు , తను చెప్పాలని ఆమె ఆశిస్తున్నది ఏమిటో కూడా అతనికి తెలుసు..అయినా మౌనం 
ఎందుకీ సన్నని పోరా కంటికీ చూపుకీ  నడుమ కనురెప్పలా .....
" ఎప్పుడొస్తున్నావ్ ఇక్కడికి ఈ నెలాఖరులో వస్తానన్నావ్ గా ?" ఆశ గా 
" వస్తున్నా కానీ నీతో ఉండలేక పోవచ్చునేమో రా" 
" అదేంటీ ఎందుకని ..." తీవ్ర నిరాశ ఆమె లో 
" అదీ నేను వస్తున్నా కానీ మా బాస్ తో వస్తున్నా సో , అయన ప్రోగ్రాం ప్రకారమే మళ్ళీ వెళ్ళాలి .." ఏ భావము పలక కుండ అన్నాడు 
" అవునా ....." నిశ్శబ్దం ఒక రెండు నిముషాలు 
" ధీరూ...ఏయ్ ...పలకవేంటి ... "
" ఏమి లేదు ఎన్నాళ్లైందో నిన్ను చూసి , రెండు రోజులైనా ఉంటావని ఆశ పడ్డాను "
" నిజమేరా కానీ ఇప్పుడు ఈ ట్రిప్ లో కుదరదు , మళ్ళీ నెల పది దాటాక వస్తా అప్పుడు నీకోసమే వస్తా నీతో ఉంటా .." నమ్మకంగా అతను 
" ఏమో మళ్ళీ అప్పుడేమి చెప్తావో , ఛ ఏమి ఉద్యోగాలో ... " నిరాశతో కూడిన విసుగు ఆమె లో
" ఏయ్ వస్తానని చెప్పానుగా ... నేనంటే వస్తానని నీకు తెలుసు గా ...అబ్బా చీర్ఫుల్ గా ఉండరా " 
" మ్మ్...అలాగే ..." 
" అదిగో అప్పుడే స్వరం లో నీరసం ...హాహా ఏయ్ ధైర్యవంతురాలా! ఏంటిదీ నువు నవ్వకుండా ఉంటే బాగోదురా..." 
" అవును ఎప్పుడు ఇకిలించుకుంటూ ఉండాలి మీరు ఏమి చేసినా " ఉక్రోషం గా అంది 
" హహహః అది కాదు రా నాకు మాత్రం లేదా నీతో ఉండాలని , కానీ ఇప్పుడు ఈ హడావిడి లో కుదరదు రా కనిపిస్తా గా కాకుంటే ఉండటం అవ్వదు మరి " 
" ఓహో మీ బాస్ తో వస్తున్నావ్ గా కనీసం మాటాడుతావా అదీ లేదా ..." 
" అరె కూల్ రా! మాటాడకుండా ఎలా ఉంటాను రా ..." 
" ఏమో నిన్ను చూడటానికే వస్తున్నా నేను ఆ మీటింగ్ కి లేకుంటే నాకేమీ ఇంట్రెస్ట్ లేదు ..." ముక్తసరిగా 
" నాకు తెలుసు ....కలుస్తాగా ...ఉండనా మరి " మెత్తటి అభ్యర్దన 
" సరే అలాగే .... మంచి మాట చెప్పేవు పుట్టినరోజు నాడు , నేనింకా రోజులు లెక్క బెట్టుకుంటున్నా  నువ్వొస్తున్నావని .."
" బాలూ!....." 
" చెప్పరా ...ఏంటి ?" లాలన 
" నీకు నేనేమి అర్ధం అయ్యానో తెలియదు కానీ నువ్వంటే మాత్రం నాకు ప్రాణం ..."చలించింది స్వరం 
" నాకు తెలుసు ....నువ్వు " అర్ధోక్తిలో ఆపేసాడు ఓదార్పుగా 
" ఏయ్ సాగర ముగ్ధా ! ఓయ్! " అల్లరిగా పలకరించాడు 
" అదేంటీ సాగర కన్యో మత్స్య  కన్యో  అంటారు కానీ సాగర ముగ్ధ ఏంటి ?" నవ్వింది కొంచెం 
" మరి నువ్వు ... ముగ్ధ వి కదా కన్య వి కాదుగా హహహ..." పకపక నవ్వాడు 
" ఛి పో ..చాల్లే అల్లరి ..." నవ్వుతూ పెట్టేసింది.
ఒంటరితనపు ఇనుప కౌగిలిలో  చిక్కిన రెండు మనసులు , దేహాలు ....ఆత్మలు ఆశలు ...మాటల వంతెనలు కట్టుకుంటూ సుదూరాలనుండి ....
                      .................................................ప్రేమతో ...జగతి 1,14pm,15th Sept 2012 Saturday 

Sunday, September 9, 2012

jnaapakaalu 9th sept love j

http://www.andhrajyothy.com/pdffiles/2012/sep/9/vzg/visaka%20city02.pdf

జ్ఞాపకాలు





చిన్నప్పుడు నాన్న కొనిచ్చిన అమర చిత్ర కథలతో మొదలైన అక్షర పయనం నాది. జీతం వచ్చిన వెంటనే రైల్వే స్టేషన్ లో నాకు మీరాబాయ్  , కృష్ణ  లాంటి వి , తమ్ముడికి శివాజీ , పృధ్విరాజ్ లాంటి కామిక్స్ కొని చదివించేవారు. రైల్వే రక్షక శాఖలో నాన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. అతి తక్కువ జీతమైనా మాకు పుస్తకాలు కొనడం మానేవారు కాదు. అలా మొదలై నేను తొమ్మిదో ఏట మొట్ట  మోదట చదివింది కకుభ గారి "జీవితం ఏమిటి ?" ఆంధ్ర ప్రభ లో సీరియల్ అప్పుడు మా మేనత్తలు నలుగురు నేను , నాన్న ఆ సీరియల్  చదివే వాళ్లము. మా చిన్నత్త (చాల చిన్న వయసులోనే చనిపోయింది) తను తన పాపకి నీలిమ అని పేరు పెట్టుకున్నది ఆ సీరియల్ చదివాకే. అంతలా సాహిత్యాన్ని చదవడం చర్చించుకోవడం వాళ్ళందరూ పెద్దలతో బాటు నేనూ చర్చిన్చేదాన్ని. అందులోని ఒక ముఖ్య సన్నివేశం మాత్రం నన్ను ఇప్పటికీ కలచి వేస్తుంది నీలిమ భర్త గోపి సినిమా నటుడు అయ్యాక వేరే అమ్మాయి తో ప్రేమ లో పడి ఈమెను వదిలేస్తాడు, చివరికి మారి  పోయానని వచ్చిన  అతన్ని ఆమె మనసు క్షమించలేక పోతుంది , ఆ రాత్రి ఆమెను పొందిన అతను తర్వాత గ్రహిస్తాడు తను రమించింది  ఆమె మృతదేహం తో నని తెలిసి పిచ్చి వాడై పోతాడు. బాగా ప్రభావితం చేసిన నవల ఇది. అప్పుడే చివుకుల పురుషోత్తం గారి " ఏది పాపం" వాసిరెడ్డి సీతాదేవి నవలలు అన్నీ మా మేనత్త విమల  నాకిచ్చి  చదివించింది. 

అలా మొదలైన అక్షర యానం ఖుర్దా రోడ్ లో (ఒరిస్సా) లో ఉన్నప్పుడు కవితలుగా మొలకెత్తి , కాస్తగా పూలు పూచి అక్కడ ఉన్న " కవిత" సంఘం వారి " పురోగామి" లిఖిత పత్రిక లో మొదటి కవిత వచ్చిందీ . అటు పైన ఒరిస్సా నుండి మళ్ళీ ఆంధ్రా వచ్చేసినా రాసిన కవితలేవరికీ చూపించేదాన్ని కాదు. నా  ప్రతి కవితకి ఒకే ఒక శ్రోత మా తమ్ముడు జగన్నాథ్ మేము ఉదయ్ అంటాము ( ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు). అన్నిటికంటే నా జీవితం లో మరిచి పోలేని తియ్యని జ్ఞాపకం మా తమ్ముడు నేను ఎక్కడో  రాసి పడేసిన కవితలన్న్నీ ఏరి ఎప్పుడు చేయించాడో ఆరోజుల్లో డి.టి.పి  అవీ లేవు గా ఎలెక్ట్రానిక్ టైప్ చేయించి నా  పెళ్లి రోజు నాడు నాకు బహుమతి ఇచ్చాడు. ఎప్పటికీ నీలోని ఆ కవితా  జగతి ని చచ్చిపోనివ్వకు  అక్కా అంటూ. ఇంతకంటే మధుర స్మృతి నాకు జీవితం లో లేదు. నాన్న కూడా నా కవితలకి సంతోష పడేవారు. కానీ నేనెప్పుడూ ఏ పత్రికకీపంపెదాన్ని కాదు. నా కవితలు ప్రోత్సహించడం లో మా మామయ్య దుర్గ ప్రసాద రావు ఒకరు (మా పేద్ద మామయ్యా ) అతను చాలా  ప్రోత్సహించేవారు శ్రీశ్రీ ని చదవమని చెప్పింది తనే . నాకు శ్రీశ్రీ మహాప్రస్థానం కొనిచ్చ్సింది ఆ రోజే "మల్లెపూవు" సినిమా చూపించింది మా దీన చిన్నాన్న. ఇవి మామూలుగానే కనిపించినా మరువలేని జ్ఞాపకాలు ఎందుకవుతాయంటే ఆ రోజు అలా వారు చెప్పకున్న ఇవ్వకున్నా వేరే విధంగా ఉండేది. 

అర్ధ రాత్రి అపరాత్రి అని లేకుండా ఎన్ని పుస్తకాలు చదివినా ఏమీ అనని  డాడీ , విపరీతంగా తిట్టి అలసి పోయే అమ్మ, ఇలా పన్నెండేళ్ళ వయసుకే  మెట్రిక్  పాసయి , ఇరవైలోకి అడుగు పెట్టే అప్పటికే   ఆంధ్రా యూనివెర్సిటీ  లో ఏం.ఏ .ఆంగ్ల సాహిత్యం లో యూనివెర్సిటీ  ఫస్ట్ వచ్చాను. ఆనాడు కుముద్ బెన్ జోషి నుండి అవార్డ్ అందుకోవడం మా నాన్న కిష్టమైన  ఆంగ్ల సాహిత్యాన్ని చదివి ఆయనకీ తృప్తి ఆనందాన్ని కలిగించానన్న తృప్తి నాలో మిగిలింది. 
విశ్వవిద్యాలయం లో తనకు గ తనే నా దగ్గరికి " కానుక" పుస్తక రూపం లో వచ్చిన నా చలం. ఇక అక్కడినుండి చలం సాహిత్యం నా  జీవితం లో ఓ భాగమై పోయింది. చలం " స్త్రీ" మొదటి సరిగా నను పరిచయం చేసిన వ్యక్తీ మంచి మిత్రుడు వేణు అలాగే " హిమజ్వాల" కూడా తనే ఇచ్చి చదివించాడు . ఇక అక్కడినుండి ఎవరూ నాకేమీ ఇది చదువు అని చెప్పలేదు, నాకు గా నేనే అటు తెలుగు , ఇటు ఇంగ్లీష్, అలాగే హిందీ సాహిత్యాన్ని బాగా చదువుకున్నా. చలం అభిమానినని అని ధైర్యంగా   ఆ పుస్తకాలు పట్టుకుని చదువుకున్నందుకు    నన్నుకేవలం   చూడటానికి   ఒక అబ్బాయి ప్రత్యేకంగా వచ్చి చూసి వేల్లేదు   . అంత హీరోఇసం   ఉండేది చలం పుస్తకాలు చదవడమంటే. ఇదేప్పుడో మాట కాదు ఏనాభైల్లోది. అత్యంత మేదావులయిన  ఎల్.ఎస్.ఆర్ కృష్ణ శాస్త్రి, ఇలా రావు , జానకి రెడ్డి  , నరసింహ స్వామి, కృష్ణారావు గారు  లాంటి వారి దగ్గర విశ్వ విద్యాలయం లో చదువుకోవడం ఒక అదృష్టం.

నా మొదటి కధ " వృక్ష స్థలే .."  కి ఆర్ ఎస్ కృష్ణమూర్తి కథల  పోటీలో రెండవ బహుమతి రావడం తోనూ , "చలం- ఆధ్యాత్మికత"  ప్రసంగం తోనూ విశాఖ పట్నం లో నా ఉనికి అందరికి తెలిసింది. మొజాయిక్ సాహిత్య సంస్థ నేను . ఎల్ .ఆర్. స్వామి గారు, రామతీర్థ మరి కొంత మంది మిత్రులం కలిసి స్థాపించిన తర్వాత ఇక వెనుకకి తిరిగి చూడకుండా సాహిత్య ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. మొజాయిక్ సంస్థ ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలని మేము చేసే కార్యక్రమాలను మేము ఎక్కువగా శ్రెద్ద తీసుకుంటాము . అంతే కాక ఎక్కువ కంపేరిటివ్ లిటరేచర్ మీద, జాతీయ అంతర్జాతీయ సాహిత్యాల పైన కార్యక్రమాలు చేస్తాము. ఇప్పటికి ఎందరో కవులను, కధకులను అనువాదం చేశాను . ముఖ్యంగా నేను రామతీర్థ కలిసి చేసిన జే.పి.దాస్ గారి కవితలు ప్రపంచ తెలుగు సాహిత్య సభలో ఆవిష్కరించడం   ఇప్పటికీ మరిచి పోలేము. మండలి బుద్ధ ప్రసాద్ గారి ప్రోత్సాహం తో " వజ్ర భారతి" లో తెలుగు తత్వవేత్తలు జిడ్డు కృష్ణ మూర్తి , యు. జి. మీద వచ్చిన వ్యాసం కూడా చాలా పేరు తెచ్చింది. 

చూసిన జీవితపు ఎగుడు దిగుళ్ళతో బాటు నా కవిత్వం నా సాహిత్యం సాగుతూనే ఉన్నాయి. ప్రపంచం లో దేనినైనా మార్చగలిగే శక్తి , ప్రేరణ కలిగించ గల ప్రాణ స్పందన కేవలం "ప్రేమ" అని నమ్మే నేను ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమని, సాహిత్యాన్ని మైనస్  చేస్తే ఈ జగతి లేదు అని చెప్తాను. వివిధ భాషల్లో ని కవులను తెలుగు లోకి అనువదించి ఎనిమిది వారాల పాటు " కావ్య జగతి " పేరిట ఆంద్ర భూమి లో నా ఫీచర్  ప్రచురించిన శ్రీ ఏం.వి.ఆర్. శాస్త్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలి, అది మంచి పేరు తెచ్చింది నాకు. నవ్యలో అచ్చిన నా కధ " రూప వస్తువు" కి తెల్లవారేసరికి నిఖిలేశ్వర్ గారు కాల్ చేసి చాలా సేపు అభినందించడం ఒక ఎత్తైతే, ఇటీవల అచ్చైన కవిత" వాసన" చూసి ఎందరెందరో , సలీం, ఎన్,గోపి , ఇంకా ఎందరో ఇప్పటికీ అభినందించడం  నాకు నిజంగా జీవిత సార్ధక మనిపిస్తుంది . ఇటీవల కలిసినప్పుడు ఆశారాజు గారు ఆ కవిత మొత్తం చదివి తను జ్ఞాపకమ్హ్తో చదివి మెచ్చుకోవడం మరో మధుర స్మృతి. జగన్నాధ శర్మ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో పరిచయాలు ఎందరో కవులు ఇప్పుడు నాకు ఆత్మీయ మిత్రులు ఒకప్పుడు వీరి నసలు చూడగలనా అనుకున్నా వారు నాకి ప్పుడు ఎంతో స్నేహితులు అని చెప్పడానికి గర్విస్తున్నాను. జ్వాల ముఖి  , శివ రెడ్డితో  , నగ్న ముని తో . ఇలా ఎందరెందరో పెద్దలను చూడటమే కాదు ఆత్మీయంగా మాట్లాడటం నాకు చాల ఆనందం కలిగించే  విషయం. నా గురించి శివారెడ్డి గారు బరంపురం తెలుగు మహాసభల్లో మొజాయిక్ సంస్థ గురించిన నా కృషిని చెప్పడం అంత పెద్ద సభలో , నేను ప్రెసెంట్ చేసిన " కన్యా శుల్కం -కొత్త ఆలోచనలు" పేపర్ కి వెను వెంటనే పాటిబండ్ల రజని వచ్చి కౌగలించుకుని  అభినందించడం తియ్యని జ్ఞాపకం. 

నా సాహిత్యం బ్లాగ్ ఒకటి నడుపుతూ, ఇంకా ఇతర సాహిత్య గ్రూపులు నడుపుతూ ఫేస్  బుక్  లో కూడా చాలా మంచి సత్  సంబంధాలు కలిగిన దానన్ని  చెప్పగలను. సాంకేతికత మనుషుల్ని ఎంత దగ్గర  చేసిందో అది  సరిగా  ఉపయోగించకుంటే ఎంత చెడ్డది గా పరిణమిస్తుందో అది గుర్తు పెట్టుకోవాలి మనం. ఈ రోజుల్లో మనల్ని కలిపే ఈ సోషల్ నెట్ వర్క్ల్ లను సరిగ్గా ఉపయోగించుకున్న నాకు ఎందరో ఇతర దేశాల భాషల ఎన్దరో  సాహితీ  మిత్రులను సంపాదించు కున్నాను. సాహిత్యం లోని అన్ని పార్శ్వాలను ,అంటే ఆధ్యాత్మిక సాహిత్యాన్ని కూడా ఎక్కువగా అధ్యయనం చేశాను. శంకర  అద్వైతం  కోసం, లాజిక్  కోసం , ఏం ,ఏ. ఫిలాసఫీ, ఏం.ఎస్ .సి. సైకాలజీ, ఏం.ఏ. సోషయాలజీ, ఏం .ఎడ్ ఇలా కొన్ని డిగ్రీలు కేవలం చదువు కోసమే చదువుకున్నాను. ఎం.ఫిల్ శ్రీ ఆరోబిందో చిన్న కవితలపైన చేశాను. 

బి.ఎడ్ కాలేజీ లో లెక్చరర్ గా పనిచేస్తూ ఎందరితోనో గురువులకు గురువుగా సత్సంబంధాలు కలిగి ఉన్న, కొందరి నైనా మంచి ఉపాధ్యాయులను  తయారు చేసిన ఆనందం తృప్తి జీవితంలో. ఇప్పుడు నా పిల్లలు ( శిష్యులు) చాలా చోట్ల నాకంటే పెద్ద హోదాలో లెక్చరర్లు గా పని చేస్తున్నారు. అది పుత్రోత్సాహం కలిగిస్తుంది. నాకంటే చిన్నవారి లోనూ, నా సాటి వారిలోనూ ఎవరూ ఏ గొప్ప విజయాన్ని సాధించినా ఎంతో  ఆనందిస్తాను, ఇప్పటి తరం పిల్లలికి మంచి సాహిత్యాన్ని చదవమని ప్రోత్సహించడం తో బాటు వారి లో నా విజయాల్ని చూసుకుని మురిసిపోతాను. ఎన్నో పరిచయాలు నన్ను నన్నుగా ప్రేమించే ఎందరో నాకు ప్రాణం. సాహిత్యమే కాదు సామజిక విషయాల పట్ల కూడా అధ్యయనం చేస్తాను. నేను కోల్పోయిన  కాలాన్ని అవకాశాలను  నా భావి తరం వారి లో చూసుకుని సంతృప్తి చెందుతాను. తెలుగు నుండి చాలా మంది కవుల కవితలను ఆంగ్లం లోకి చేసాను. అందులో చాలామంది నేటి తరం కవులున్నారు.

చాలా వ్యాసాలు చినుకు మాస పత్రికలోనూ, ఆంధ్రప్రభ సాహితీ గవాక్షం లోనూ, ప్రచురించి నన్ను ప్రోత్సాహన్నిన్చ్చిన సదా శివ  శర్మ గారు  , చినుకు రాజ గోపాల్ గారు , తెల్కపల్లి రవి ఇలా ఎందరెందరో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఇలా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం చలం గారి ఉత్తరాల మీద అధ్యయనం చేస్తున్నాను. ఇటీవల కెనడియన్ రచయిత్రి మార్గెరెట్ అట్వుడ్ కవితలని అనువాదం చేశాను. కవిత్వం, వ్యాసాలు ఇష్టమైన ప్రక్రియలు. జీవితం లో ఎదురైనా స్పందన కలిగించే అనుభూతిని అభివ్యక్తిస్తాను. కాల్పనికట కంటే సత్యమే ఎక్కువగా రాస్తాను, రాసిన సాహిత్యమంతా నా అనుభావాలలోనుంది వచ్చినదే. ఏ ఇజాలు నాకు లేవు, అయినా అందరి పట్ల గౌరవం ఉంది.ఆంగ్లం లోనూ, హిందీ లో కూడా రాస్తాను. విశాఖ మాత్రమే కాక, పూణె, భువనేశ్వర్ , హైదరాబాద్ ,విజయవాడ లాంటి ఎన్నో చోట్ల సాహిత్య ప్రసంగాలు చేశాను . 

నిరంతర సాహిత్య అధ్యయనం తోనూ ప్రేమ తోనూ ఇక ఇలా మిగిలిన జీవితాన్ని సాగించాలని , బతుకు చివరి శ్వాస వరకు సాహిత్యం తో , ప్రేమతో , గడపాలని జీవితాశయం. మనిషిని యధాతధంగా ప్రేమించడం ప్రేమంటే అని నమ్ముతాను, ఆచరిస్తాను.   . మీ అందరికి  సాహిత్యాభినందనలు , ఆంధ్ర జ్యోతి వారికీ కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. 
....................................................................................................................జగద్ధాత్రిhttp://dhaathri.blogspot.com/

Thursday, September 6, 2012

అతని సంద్రం ఆమె ...



"ఓయ్!! మానవుడా !!" దీర్ఘంగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న అతని చెవి పక్కన గాజులు గలగలా మని శబ్దం చేసింది ఆమె. 
ఉలికి పడి  ఈ లోకం లోకి వచ్చినట్టు ఆమె చెయ్యి అలాగే గట్టిగ పట్టుక్నున్నాడు. " ఏయ్ పిల్లా! ఏంటీ అల్లరి? " అంటూ. 
" అబ్బా చెయ్యి వదులు గాజులు చిట్లి పోతాయి ..." గోముగా విడి పించుకో బోయింది అతను వదలలేదు . " ఏం ఎప్పుడూ చిట్లలేదా గాజులు ?" కొంటెగా  అడిగాడు అమెను లాగి తన  పక్కన కూర్చో బెడుతూ. 
" చాల్లే.. పెద్ద గొప్ప ..." అంటూ నవ్వేసింది కూర్చుంటూ. అతని భుజం మీద తల ఆన్చింది. గాలికి ఎగురుతున్న ఆమె ముంగురులు  సవరించాడతను. 
" ఇన్నాళ్లకా దయ కలిగింది నాపై న ?" 
" ఏమి చెయ్యనురా ఏదో ఒక పని రావాలని నాకు మాత్రం లేదా ...ఈ నీలి సంద్రం కోసం. నీకోసం ..." 
" అబ్బ చా నాకోసమేనని నేనేమీ భ్రమ పడనులే.. నేను కాకున్నా ఈ నీలి సంద్రం నిన్ను ఇక్కడికి లాక్కోస్తుందని తెలుసు , ఒకటే బాధ అప్పుడు నేను ఉంటానో లేదో అని హహహ .." 
" ఏం అంత వేగం ఎమన్నా ప్లాన్ చేసుకున్నవా ఏంటీ ? వెళ్లి పోదామనే ... " ఆమె వైపు తిరిగి నవ్వేడు 
" ఏం చెయ్యను మరి నీకోసం చూసి చూసి విసిగి ... సరేలే ఎప్పుడు మన గొడవ ఉండేదే కానీ , ఎన్నాళ్ళు ఉంటావ్  ?
" ఇదెక్కడి గోల రాక పోతే రాలేదంటావ్ వచ్చీ రాంగానే ఎప్పుడు వెళ్లి పోతావ్  అని అడుగుతున్నావ్ మీ ఊరి మర్యాదా ఇది ? " 
" అది కాదులే అబ్బాయ్ మెంటల్ గా ప్రిపేర్ అవుదామని , లేకుంటే సడన్ గ బిచాణ ఎత్తేసి బై అంటావ్ గా మరి అందుకు ..."
" ఉంటాలే నీ తనివి తీరే దాక ..." 
" ఆ గొప్పే నీకేమీ లేనట్టు ..."
" నాకేముంది అమ్మాయ్   నిను చూడాలని పిస్తుంది నీతో గడపలానిపిస్తుంది అంతే ... అలా చాలా మంది తో అనిపిస్తుంది మరి అదేంటో .."
" పోనీలే ఆ చాలా మందిలో నేను ఒకతెనైనందుకు ధన్యవాదాలు "
" ఏంటీ అసూయా , కోపమా ? "
" అవేప్పుడన్నా నాలో చూసావా ..అదేమీ లేదు ...లే ..ఎన్నాళ్లైందో  నిన్ను చూసి ... " మరింత బలంగా అతని చేతిని పట్టుకుంది. 
ఎక్కడో ఏదో ప్రకంపన అతనిలో .. స్త్రీ స్పర్శ కొత్తేమీ కాదు , అందునా ధీరూ కొత్తది కాదు అయినా ఎక్కడో అంతరాంతరాల్లో ఓ ప్రత్యేకమైన పులకింత.. 
" ఏంటీ నవ్వుతున్నావ్ , అవునూ తిన్నగా ఇంటికి రాక ఇక్కడ సముద్రం దగ్గర కూర్చుని కాల్ చేస్తావేంటి అబ్బాయ్  ?" 
" ఏమో రా ట్రైన్ దిగంగానే సముద్రమే గుర్తొచ్చింది ఇక్కడికి రాగానే ఈ నీలిమను చూడగానే నీ కన్నులు  గుర్తొచ్చి కాల్ చేశా " 
" అబ్బో నిజమే నమ్మాల్సిందే తమరేమి చెప్పినా ..." 
" మనం కలిసి ఏడాది అయింది తెలుసా ?' 
" అబ్బా అట్టాంటివి అన్నీ  గుర్తు పెట్టు కోకూడదు రా .. ఇప్పుడు ఈ క్షణం లో కలిసి ఉన్నామా లేదా అదే ముఖ్యం ..." 
" ఓహ్ అలాగే తాత్వికా మీరేమి సెలవిచ్చినా  ఒప్పేసు కుంటాము  " 
" అబ్బ ఎంత మంచిదానివీ.." 
" చాల్లే నీ పొగడ్తలు కానీ , చెప్పు విశేషాలేంటి   ? " 
" నాకేమి ఉంటాయ్ బాబూ , ఉంటే గింటే  మీకే ఉండాలి ..."
" నాకేమున్టాయ్ ఒంటరి గాడిని దేశ దిమ్మరిని ... అన్నట్టు నిజంగా ఒక విశేష౦ ఉంది రా .."
ఆసక్తిగా తాని కళ్ళలోకి చూసింది 
" పాండిచెర్రి వెళ్లేము ఆ మధ్య , చిత్రమైన  అనుభూతి  .....నువ్వు వెళ్ళావా  ఎప్పుడన్నా .. అక్కడా సముద్రమెంత బాగానే ఉంది  ...కానీ ఇక్కడ ఈ  విశాఖ సంద్రం మాత్రం ఏవో కధలు చెప్తుంది రా అందుకే ఇక్కడి కే పదే పదే రావలనిపిస్తుంది "
" నేనూ వెళ్ళా  రెండు సార్లు , ఆరోబిందో కవితల గూర్చి ఒక ఏదో రీసెర్చ్ వెలగ బెట్టాన్లే అప్పుడు ... "
" ఏమైంది పూర్తయిందా ...మరి సబ్మిట్ చేసేసావా ?"
" ఆ రీసెర్చ్ అయింది కానీ థీసిస్ రాయలేదు "
" అదేంటి రాసి పడేస్తే పోద్ది గా ..." 
" ఏమో రాయలనిపించలేదు అంతే .."
" కొన్ని అర్ధం చేసుకుని మనసులోనే  నిక్షిప్తంగా  ఉంచాలనిపిస్తుంది రాసి వాటిని పాడు చెయ్యాలని అనిపించదు  బాలూ" 
" ఇది నేనూ ఒప్పుకుంటాను నిజమే ..కానీ మరి మనసులో ఉన్నదానికి డాక్టరేట్ ఇవ్వరేమో ..." 
" పొతే పాయిందిలే వెధవ డిగ్రీ ఇప్పుడది కావాలని కోరుకున్న వారే వెళ్లి పోయారు .. ఇక ఎందుకు ఆ  కాగితం ముక్క "
" మ్మ్ .... మీ డాడీ గురించేగా ... ఓకే ..అప్పరం .."
" అంటే ?" 
" ఇంకా ఏంటి సంగతులు అని ?"
" బాగుంది ఇంటర్వ్యూలు చేసి చేసి అలవాటై నట్టుంది ఆయగారికి అందరినీ అలాగే అడుగుతారా ...ఏయ్ బాలూ చూడు కెరటాలెంత ఉవ్వెత్తున లేస్తున్నాయో .... అమావాస్య కదా ...అందుకు " 
 " మరే నీ  మనసులానే హహ " 
" అబ్బో రోమాన్స్ తాత్వికులకి కూడా "
" భోగి కాని వాడు యోగి ఎట్టా అవుతాడమ్మాయ్,  అయినా నేను నిత్య భోగయోగిని హహహ " 
..............
నిశ్సబ్దం ఇద్దరి మధ్యా ...పెనవేసుకున్న ఇద్దరి చేతులు ... మౌనంగా మాటాడుకుంటున్న  మనసులు .. అలా ఎంత సేపు గడిచిందో తెలీదు 
" ధీరూ..." గుసగుసలా అతని పిలుపు 
" మ్మ్..." ఏమన్నట్టు  చూసింది అతన్నివైపు . 
" అరొబిందో లో ఒక వింతైన విషయం ఉంది కదా ... ఒక్కసారిగా అంత విప్లవ వీరుడు యోగి గా ఎలా మరి పోయాడు ? ఏమో నాకు నమ్మకం కుదరలేదు ?"
" అవును , ఒక సారి  ఒక విమర్శకుడు మన తెలుగు సాహిత్యం లో చాలా పేరున్న వారే ఆయన నన్నూ అడిగారీ ప్రశ్న ... నీకు ఏమనిపించిందీ అని ?
నిజానికి ఎక్కడో ఏదో లింక్ మిస్  అయినట్టు అనిపిస్తుంది బాలూ ... అతని జీవితం , కవిత్వం, ముఖ్యంగా అతని సావిత్రి కి ముందు  రాసిన ఈ చిన్ని కవితలు ఎన్నో అతని వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి" 
" కానీ ఎవరిలోనైనా ఇంత వేగం మార్పు వస్తుందా ? అదీ ఏదో దైవ సాక్షాత్కారం జరిగింది అక్కడ జైలు లో అంటాడు ..." 
" వస్తుంది .. దానికి కరణం దైవ సాక్షాత్కరమని ఎందుకు అనుకోవాలి  ఒక్కసారిగా జ్ఞానోదయం అయిందని కూడా అనుకోవచ్చు  కదా.. అది దైవమని అతను అనుకోవచ్చు .. కానీ మరి బుద్ధుడికి అంతే గా, జ్ఞానం దైవం కన్న మిన్న కదా.... నాకలాగే అర్ధమైంది మరి  " 
" అప్పరం ... అదే ఆ తర్వాత .." 
" ఏముందీ ఇలా ఎందరిలోనో ఒక్కసారిగా తాము  చేస్తున్న  పని సరి అయినది కాదనో , నమ్ముకున్న సిద్ధాంతం సారీ  కాదనో  జ్ఞానం హటాత్తుగా కలుగుతుంది మారుతారు అందులో ఆశ్చర్యం ఏముంది సర్ "
మౌనంగా తల పంకించాడు ...
....................................

" ఈ విశాఖ సంద్రం చూసి మురిసి పోయాడు గానీ ఇక్కడ పాపం ఉండలేక పోయాడు కదూ చలం " 
" అవును .. నీకు లానే విశాఖ భీమిలి సముద్రం పిచ్చి చలానికి కూడా హహహ" 
" అమ్మాయిల పిచ్చి కూడా ... నాలానే ..హహహా " 
పకపకా నవ్వింది ...
" షౌ మాత్రం ఎంచక్కా ఇక్కడే హాయిగా బతికి ... చివరికి ఇక్కడే మట్టిలో కలిసి పోయింది సుమా ... "
" అందరికీ  అన్ని అదృష్టాలు ఉండవు కదా మరి ... నాకూ ఉంది అలా వెళ్లి సంద్రం లోకి నడచి వెళ్లి పోవాలని ... " 
" నే వెళ్ళనివ్వనుగా ...." 
" ఎందుకనబ్బా ..." 
" నామీదకి హత్యా నేరం వస్తుంది అని మరేమీ కాదులే .." నవ్వింది 
" నీకు చెప్పే వెళ్ళాలా ఏమిటి . నాకు నచ్చినప్పుడు వెళ్లి పోతే ..." 
నిశ్శబ్దం ..... అలల హోరు మాత్రమే వినిపిస్తోంది ...అతని వొడి లో ఒదిగి పోయింది మౌనంగా 
ఎగురుతున్న  ఆమె ముంగురులు నిమురుతూ అతనూ మౌన ధ్యానం లో ... 
..........................
" మళ్ళీ ఎన్నాళ్ళకు ?" దిగులు స్వరం లో ఆమె 
" వస్తాగా ... " అనునయం అతని గొంతులో 
" జీవితం  లో అన్ని ప్లేన్స్ లోనూ రిలేట్  కాగలిగే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు బాలూ.." 
" మ్మ్ ... నిజమే ...కానీ ప్రేమ అని మాత్రం అనకు దయ  చేసి దీన్ని ...నే వచ్చిందీ నీకోసం నా సంద్రానివి నువ్వు ...తెలిసిందా "  
" హహహ అన్నా నువ్వు ఒప్పుకోవుగా నేనెందుకు  అంటాను  ... అరబిందునికి  దైవ దర్శనమా   జ్ఞానోదయమా అన్నట్టు , మన అనుబంధం ప్రేమా. కాదా అన్నది ఒక ట్రిల్లియన్ డాలర్  ప్రశ్న .. అలాగే చలం ఈశ్వరుడు కూడా ... ఇవన్నీ మూగవాడు తేనె రుచి చూసినట్టే బాలూ... ఇతరులకి చెప్పలేము అనుభూతించాల్సిందే ..."
" నాకలాంటి సందేహాలూ భ్రమలూ లేనే లేవు అమ్మాయ్, ప్రేమ అనేది లేదసలు ... అన్నదే నా నమ్మకం ..."
" అసలున్నదే ప్రేమ అన్నది నా నమ్మకం . నా  ప్రేమ  నీ   ప్రేమ రాహిత్యం  రెండూ  నిజమే  మరి .. ..చలో ఒకరి నమ్మకాన్ని  మరొకరు గౌరవించేసుకుని... ఇక మాటలాపి ఈ కాస్త సమయాన్నీ..."
" ఊ ఈ కాస్త సమయాన్నీ ..." నవ్వుతూ రెట్టించాడు 
" ఆ ఈ కాస్త సమయాన్నీ వృధా చేసుకోవద్దూ అని మొద్దబ్బాయ్ ...నాకేమి భయమా చెప్పడానికి " 
ప్రేమ , కవిత్వం ,మోక్షం , జీవితం వీటిని నిర్వచించి ఇక ఇదే చివరిది అన్నా వాడు లేదు కదా ..ఎవరి అనుభవం వారికి నిజం .. అంత వరకూ ఇలా అనూచానంగా ఈఅనంత ప్రణయ యాత్ర ...అలసిన నిదురలో నవ్విందామే ... ఆమెనే చూస్తూ నిదుర రాని అతని కళ్ళు ... మృదువుగా వంగి ఆమె కనుల పై ముద్దాడాడు ... అతను నిద్రించిన తర్వాత ఆమె లో మంచు పర్వతాలు  ద్రవీకరించడం అతనికి తెలుసు ... ఇద్దరూ చేర రాని నిద్రలో ...దగ్గరగా ... ఒకరిలో ఒకరై ...
.................................................................................................................ప్రేమతో ...జగతి 8.24pm Saturday 1st Sept 20

అధ్యయనం




ఉమ్మ నీటి నుండి జారి పడీ  పడగానే 
మొదలౌతుంది ....అమ్మ తో బొడ్డు తాడు కోసిన వెంటనే 
ఆకలి కేకలేస్తావు ఆగ్రహ ప్రకటన చేస్తావు 
వెచ్చని గర్భ గుడినుండి 
తిని బజ్జోడమూ, అప్పుడప్పుడూ తిరగడం తప్ప 
ఆ చిన్ని గర్భ గుడి నుండి ఈ గుహలోకి వచ్చినందుకు 
ఏడుస్తావు మరీ మరీ....
ఆకలనుకుని ...నీకు అమ్మ రొమ్ము నందిస్తుంది 
నిరాహార దీక్ష విరమించి పాలు తాగుతావు 
ఆకలి, నిద్దుర, ఆకతాయి అల్లర్ల అధ్యాయాన్ని ఆరంభిస్తావు  

అక్షరాభ్యాసం  తో బతుకు పుస్తకానికి శ్రీకారం చుడతావు
జీవితపు ప్రతి రోజూ ఒక తెల్ల  కాగితమై వస్తే 
ఇరవై నాలుగ్గంటల్లో గా వీలున్నన్ని రంగులు పులుముతావు 
రోజులు వత్సరాలై...  దశాబ్దాలుగా మారుతుండగానే
ప్రతి పేజీ నిండి పోతుంటుంది  ...

ఏడాదికొక  వసంతం గడిచి పుస్తకం మధ్యలో కొస్తావు 
రాగారంజితమైన వలపు తేనియలు 
ఉద్విగ్న పూరిత ఆశోదయాలు 
నీరసపు నిశి రాత్రులు ఎన్నో ఎన్నెన్నో 
ఆర్ధిక  జగత్తులో నీ మేధను అమ్ము కుంటావు 
ఆశల హార్మ్యాలను అవలీలగా కడతావు 

అనుభూతుల అలంకారాలూ
ఉత్ప్రేక్షల ఉద్విగ్నతలు 
అవమానాల ఉపమానాలు ఎన్నో  చవి చూసి 
అతలాకుతలమై నీ ఉనికిని సైతం మరిచి శ్రమిస్తావు

కాలం అనరోగ్యమై హెచ్చరిక  గంట కొడుతుంది 
పడుతూ లేస్తూ అలసి పోయి మందులతో నెట్టుకోస్తావు 
డస్సిన ప్రాణం , వడలిన దేహం తో ఒంటరి గా మిగిలి 
నిన్ను నీవు పరికించుకునేసరికి 
నీ తరగతి కాలం  ముగుస్తుంది 
బతుకు పుస్తకపు చివరి పేజీ అంతపు చుక్కకై 
కాచుకునుంటుంది ...
తప్పించుకునే ప్రయత్నం లో కొన్ని  సార్లు విజయుడవైనా
చివరి పదం రాసి ముగించక తప్పదు 

భౌతికమైన  ప్రాణుల్ని 
ప్రాణం లేని కాసింత ఆస్తిని మిగిల్చి పోతావే గానీ 
అక్షరమై నిలిచే ప్రయత్నం చేయవు 
జీవిత పరమార్ధం ఇది కాదని తెలుసుకునే లోగా 
బతుకు బడికి తాళం పడుతుంది 

అందుకే నేస్తం! అయిన వాళ్ళను ప్రేమించు 
మనసైన అక్షరాలనూ ఆరాధించు 
నీవు పోయినా  మిగిలే ఈ అక్షరాలే 
నీ భావావేశ  ప్రకటనలౌతాయి  
నిను చిరస్థాయిగా అక్షర జగతికి 
అంకితం చేస్తాయి ... ఆచంద్ర తారార్కం  మిగిలే అక్షరాలే
నీ అస్తిత్వాన్ని భావి తరానికి ఆశా జ్యోతులౌతాయి 

నువు రాసే ప్రతిదీ గొప్ప కవిత్వం కానక్కర్లేదు 
నిజాయితీ నిండిన అనుభవ సారమైతే చాలు 
ఆత్మ ద్రోహం చేసుకోకుండా రాసే ప్రతి అక్షరము 
నిన్ను ఖచ్చితంగా క్షరం కానీయదని గుర్తుంచుకో చాలు
కాలపు హృదయ గ్రంధాలయం లో  
నిన్ను నిక్షిప్తం చేస్తుందని  ధ్యాస కలిగి ఉండు 
ధ్యానంతో అధ్యయనం , అభివ్యక్తితో నీ ప్రతి అనుభవము 
శాశ్వతమై అందరి హృదయాలలో నిలిచేనని తెలుసుకో !!!

........................................................ప్రేమతో ...జగతి 5.10 pm Thursday 6th Sept 2012 

Sunday, August 5, 2012

ఏమంటావ్ ?




దోసెడు క్షణాలు ఏరుకుని 
తప్పించుకు పారిపోదామా 
అందరికీ దూరంగా మనిద్దరమే 
జేబునిండా   మరమరాలు దొంగిలించి 
పరిగెత్తే పసి గువ్వల్లాగా 
చెలిమి గాలిపటాలు ఎగరేసుకుందికి
కాలం కందెన అద్దు కుని 
చల్లగా జారుకుందామా కొద్ది సేపు 
ఏ కంటికీ కన పడకుండా 
జ్ఞాపకాల తీయని తేట నీటి 
జలకాలాడి వద్దామా కాసేపే 
మళ్ళీ వచ్చేద్దాం ఈ నిత్య రొంపి లోకి 
తప్పదుగా ...ఎప్పటికైనా 
ఒక్కసారి ఆ పాత మధురాలను 
తవి తీరా పాడుకుని
హాయిగా గలగలా సెలయేరులా 
గుండె నిండుగా నవ్వేసుకుని 
మళ్ళీ వచ్చేద్దాం తిరిగి ....తప్పదుకదా 
ఏడాదికొక్క మారైనా ఊపిరితిత్తులకి
స్నేహ ప్రాణ వాయువువు నివ్వక పోతే 
ఊపిరాడక చచ్చి పోతాము 
గుప్పెడంత గుండెలకు 
చప్పనైన నాలుకకి 
ఆత్మీయ అటుకులు బెల్లం రుచి చూపిద్దాం 
అందుకే ఎవడో పెట్టాడని 
అన్నాడని కాదు గానీ 
ఈ పేరున ఒక్క రోజైనా 
మనం మన కోసం గడుపుకుంటే 
వచ్చే ఆనందం మళ్ళీ ఏడాది వరకు 
మనల్ని బతికిస్తుంది కదా 
కాదంటావా నేస్తం !!! 
                      ...........ప్రేమతో ...జగతి 11.20am 5th Aug sunday 




Monday, July 30, 2012


  1. తొమ్మిది  పదుల రావిశాస్త్రి తొమ్మిది ఋక్కులు

రాచకొండ విశ్వనాధ శాస్త్రి కధన శైలికి , ఇతి వృత్తాలకి , కధన రీతికి ముగ్ధు డవని తెలుగు పాఠకులు ఉండరు. ప్రపంచం లో రెండే రకాల మనుషులుంటారు ఒకరు డబ్బున్నోళ్ళు మరొకరు డబ్బు లేనోళ్ళు అంటాడు కమ్మ్యునిసం చదువుకున్న రావి శాస్త్రి. చిన్నప్పుడే ఈ మాట భావన తన మనసులో బలంగా ముద్ర పడిన వాడు ,సాహిత్యాన్ని ప్రవృత్తిగా స్వీకరించిన నాటికే తను ఎటు  వైపు నిలబడాలో నిర్ణయించుకున్న వాడు తన మనసులోనే ఒక మానిఫెస్టో తాయారు చేసుకున్న వాడు రావి  శాస్త్రి అనడం లో ఎక్కడ సందేహం లేదు. శ్రీ శ్రీ కంటే పదమూడేళ్ళు చిన్న వాడు వయసులో రావి  శాస్త్రి. అతను అభిమానించే కవుల్లో శ్రీ శ్రీ కి ప్రధమ స్థానం ఉంది. రచయితను రచయితగానో , వ్యక్తిగానో అంచనా వెయ్యడానికి కొలమానపు  రాళ్ళు  వెదికే మనం , రచయితను  పాఠకుడిగా అంచనా వెయ్యడానికి ప్రయత్నిస్తే అతని శైలి లో, సాహిత్యం లో తను చదువుకున్న వారి శైలి లేదా ఇతివృత్తాలు, సమాజానికి ఉపయోగపడే ఇతరత్రా విషయాలు మనకి అవగత మౌతాయి. అప్పుడు ఆ రచయితని మనం ఒక సమగ్ర పరిశీలన చేసిన వారమౌతాము . రావి శాస్త్రి లో మనకు శ్రీ శ్రీ ప్రతిబింబం కనబడుతుంది. అలాగే తను చదువుకున్న మనోవైజ్ఞానిక విషయ పరిజ్ఞానము , తనని ప్రభావితం చేసిన రచనలు, రచయితలు కనబడుతూనే ఉంటారు కానీ రావిశాస్త్రి గారు తన జ్ఞానాన్ని ఆవిష్కరించిన  తీరు ప్రశంసనీయం. ఎక్కడా ఎవ్వరూ అనుకరించలేని శైలి లో ఏ అధో జగత్ సహోదరులను గూర్చి శ్రీశ్రీ రాసాడో వారి బతుకుల్లో కష్టాలని నష్టాలని ఎంతో ఒడుపుగా కధ లలో ఇమిడ్చి చెప్పిన వాడు రావి శాస్త్రి.

మహా ప్రస్థానం నాటికీ శ్రీశ్రీ మర్క్సిసం చదువుకోలేదు, ఉద్రేక పూరితమైన యువకుడిగా హంగ్రీ తర్టీస్ లో ప్రపంచం తీరు గమనించిన వాడై తన మహా ప్రస్థాన గీతాలు రచించాడు. రావి శాస్త్రి వరకు వచ్చేటప్పటికి దిశా నిర్దేసనం జరిగి పోయింది. తను సమాజం లో ఏ వర్గం వైపు వెన్నుదన్నుగా నిలబడాలో సుస్పష్టంగా ఎరిగినవాడై కధన రంగాన దూకిన వాడు రావి  శాస్త్రి. మనో విజ్ఞాన శాస్త్ర ప్రకరం చూసినా ప్రపంచం లో రెండే  రకాలైన మనుషులుంటారు. ఒకరు ముందుకు దారులు వేసే  మరొకరు వారిని అనుసరించేవారు. ఇది శాస్త్రి గారి కధల్లో మనకి బాగా విదితమౌతుంది. ఈ అధికారం , దైహిక బలం , ధన బలం ఉన్న వారు లేని వారిని ఎలా దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీకి గురైన వ్యధార్థుల కధనాలెన్నో  రావి శాస్త్రి మనకి అందించారు. ఇందుకు అతని న్యాయవాద వ్రుత్తి తోడ్పడింది. సమాజాన్ని అతి దగ్గరగా పరిశీలించే ఒక మంచి అవకాశం , గమనించిన విషయాలను అక్షరబద్ధం చేయడంలోనూ రావిశాస్త్రి ప్రతిభ తెలుస్తుంది. 

రావి శాస్త్రికి  శ్రీశ్రీ అంటే ఉన్న వీరాభిమానం చేత తన కధల్లో "ఋక్కులు" అనే తొమ్మిది కధలు శ్రీశ్రీ కవిత ని అనుసరించి రచించి ఆయనకే అంకితమిచ్చాడు.
"కుక్క పిల్ల , సబ్బు బిళ్ళ, ..." కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ చెప్తే దాన్ని తన కధలకు శీర్షికలుగా  పెట్టి ఆయా ఇతివ్రుత్తలకు  న్యాయం చేసిన వాడు రావి శాస్త్రి. పేదల కు పెన్నిధిగా అందరు అభిమానంగా "శాత్రి బాబు "అని పిలుచుకునే రావి శాస్త్రి కధలు ఋక్కులు గురించి నేటి తరానికి ఒక చిన్న పరిచయం కలిగించడమే ఈ వ్యాసం ఉద్దేశం.ఋక్కులు లో తొమ్మిది కధలు ఉంటాయి. వాటి పేర్లు కుక్కపిల్ల, అగ్గిపుల్ల,సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, , అరటితొక్క, తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, బల్లచెక్క, గుర్రపు కళ్ళెం . కాదేదీ కవితకనర్హమని శ్రీశ్రీ కవితలో చెప్పినదాన్ని ఒక సిద్ధాంత ప్రతిపాదనతో పేదలపట్ల ధన మదాంధుల ఘోరాలు , నిరుపేదల బ్రతుకుల కష్ట నష్టాలూ, విలువలు వదిలేసి మానవత్వాన్ని మరిచి  సంచరించే నికృష్టుల కధలుగా వీటిని మలచడం రావి శాస్త్రి కే చెల్లింది. 

ఈ కధలు తొమ్మిది టి గురించిన వివరంగా మాటాడు కోవాలంటే ఒకో కధకి ఒకో వ్యాసం రాయాల్సిందే. ఇక సంక్షిప్తంగా ఈ కధల గురించి చెప్పాలంటే ఒకో కధ ఒకో తీరున కధ కధనం కలిగి ఉంటుంది. రాసే కధలన్ని టి లో నూ  ఒకే అంతః సూత్రం కనబడినా ఏ కధకి ఆ కధే ఒక వినూత్న సృష్టిగా అనిపిస్తాయి.
ఉదాహరణకి "కుక్క పిల్ల "కధలో అసలు కధలోకి  ఎలా దిగడమో తెలీక  ఈ విధంగా దిగుతున్నందుకు  పాట్హకులు క్షమించాలి  అంటూ మొదలౌతుంది. ఇంతకీ ఈ కధ గోప్పతనమేంటంటే నేరేషన్ , శైలి , కాసి  గాడి నుండి ప్రకాష్ బాబు గా మారి పోయిన ఓ సిసలైన మోసగాడి కధ ఇది. ఇంగ్లండు , ఫ్రాన్సూ, అమెరికా, జర్మనీ , వగైరా దేశాలన్నీ తిరిగోచ్చీసి మెంటల్ గా ముదిరిపోయి భారద్దేసం  లో దిగిన ఫక్తు సిసలైన గిర్రగాడు గిరీశం , అని చెప్పడం తోనే మనకి గురజాడ కన్యాశుల్కం  లోని గిరీశం లక్షణాలన్ని కలిగి ఉండే వాడు ప్రకాశం అని తెలిసిపోతుంది. "అయితే - ఆ పాత వెధవలూ, ఈ కొత్త వెధవా కూడా ఒక్కలాటి వెధవలేనని టెస్ట్ చేసి చుపెట్టీసింది మధురవాణి", అని చెప్తూనే గిరీశం గాడి  కి అప్పటినుండే గడ్డు రోజులు మొదలైనా ఇంకా మధురవాణి రోజులు రాలేదు అంటూ రావిశాస్త్రి కన్యశుల్కం  లోని ముఖ్య పాత్రలు రెంటినీ రెండు వర్గాలకు ప్రతినిధులుగా తీసుకుని కధ నడిపిస్తాడు. ఇంకా మంచివాళ్ళకు  రోజులు కావన్న విషయం విదితమౌతుంది. 
కధలోకి ఎలా దూక డమో తెలీదని బుకాయిస్తూ, చదువరులను క్షమించ మంటూనే అదాటుగా కధలోకి మనల్ని లాక్కెళ్ళి దూకేయిస్తాడు రావి శాస్త్రి. ఇప్పటి భాష లో చెప్పాలంటే ఇదీ శాస్త్రి గారి కధల్లోని హాల్ మార్క్ . శాస్త్రి గారి స్టైలే వేరు. అందుకే ఈనాటికీ ఎవరూ ఇతని శైలి ని అనుకరించలేకపోయారు. మహా రచయితలు  మానవ సంపద అని మనసు ఫౌండేషన్ వారు రావి శాస్త్రి రచనా సాగరం ముందు మాటలో అన్నట్టు మహా రచయితల రచనలని మనం దక్కిన్చుకొవాలి. అసలు శ్రీశ్రీ ని చదవకుండా కవిత్వము, రావి శాస్త్రిని చదవకుండా మాండలికం లో కధ రాయడము ఏమంత సులువైన పని కాదు. విశాఖపట్టణం మాండలికాన్ని ఎలా  ఔపోసన పట్టేసాడో ఆ రచనా శైలి ఒక ఝరీ ప్రవాహం లా ఎవరి కొరకు రచించాడో వాళ్ళ భాషలోనే వారి గురించి వాళ్ళ  బాధలను జీవిత కధలను బయటపెట్టి వారిలో స్పృహను కలిగించేవి రావి శాస్త్రి కధలు. కుక్కపిల్ల కధ ఆఖరులో చెప్తున్నా  పెద్దమనిషి వింటున్న పెద్దమనిషి దగ్గర ఒకటి అడిగి రెండు సిగరెట్లు తీసుకోవడము , ఇంకా అగ్గిపుల్ల కధ చెప్తాను వినండి అనడం  వినరా  అయితే సరే రాసి చూపిస్తా  అని సో లాంగ్ అని ముగించడము అద్భుతంగా పండుతాయి . నడమంత్రపు సిరి వచ్చిన ప్రకాశం గురించి చెప్తూ అసలు లక్కున్డాలి అంటాడు. నిజమే ఈ రోజు మనం చూస్తున్న ఎందరో ఇలాంటి వాళ్ళు సమజంలో ఉన్నారు . దానికి జావా జీవాల్ని ఇచ్చి ఆ పాత్రల్ని సజీవం చేసిన వాడు శాస్త్రి గారు. చెడుకు చేయూత మంచికి హాని కలగని రచనలను మనకు అందించిన వాడు.
సబ్బు బిళ్ళ కధ గురించి చెప్పాలంటే వంటికి ఇంటికి మురికి అంటకుండా సబ్బు బిళ్లె సివిలైసేషణ్ అని నమ్మే లక్షి౦పతి కుహనా విలువల గురించి, స్వార్ధం గురించి భలే వివరిస్తాడు రచయిత. శీర్షిక సబ్బు బిళ్ళ ఇక ఇందులో ఏమి చెప్తాడా అనే ఉత్సాహం చదువుతున్నవారిలో కలుగుతుంది.
తనకి తన పిల్లలూ ఇల్లూ పరిశుభ్రంగా ఎల్లప్పుడూ ఉండాలని , సమాజం , పేద వర్గాలవారు ఎలా పోయినా ఆ మురికి తనకి తన వారికీ అంట కూడదని తాపత్రయ పడే లక్షి౦పతి , సబ్బు బిళ్లల చోరీ తన ఇంట్లో ఎవరూ చేస్తున్నారో కనిపెట్టిన వైనం లో చివరికి తన చిన్న కూతురే ఆ సబ్బు బిళ్ళలను తీసుకెళ్ళి మురికిగా ఉన్న పేదలకు ఇస్తోందని తెలిసినప్పుడు లక్షి౦పతి మనసులో చెలరేగిన తుఫాను. ఈ పిల్లను ఎలా కట్టు బళ్లోకి తేవడం ? అని ఆలోచిస్తాడు తన చిన్నారి కూతురు శశి గురించి. ఇంకా మాటలు కూడా సరిగా రాని పసికూన నాన్న చెప్పిన పాటాన్నేఎలా పాతిస్తుందో చూసేసరికి 
అమ్మయ్యో రేపు ఇలాంటి వారే ఏ సంఘ సేవ లోనో దిగిపోతారు, లేదా నీతీ నిజాయితీ అంటూ ఏ తిరుగుబాట్లోకో దూరి ఉరికంబమేక్కుతారు, అంటూ విపరీతమైన భయం తో వణికి పోతాడు. చివరికి ఆ పిల్లకి ఎలా చెప్పాలో ఈ విషయాలనీ అర్ధం కాక కోపంగా చూస్తాడు అమాయకంగా ఉన్న కూతురు మొహాన్ని. ఆ అమ్మాయి అలాంటి మురికివాల్లకు ఎందుకు సహాయం చేయకూడదో, అసలు మనుషులు మంచిగా ఎందుకు ఉండకూదదోచేప్పడానికి సరి అయిన  కారణాలు కనిపించవు అతనికి. దాంతో కోపం వచ్చేస్తుంది. కూతురి కళ్ళల్లో నీళ్ళు , "ఎందుకా ఏడుపు?' అంటూ గద్దించిన తండ్రికి సమాధానం చెప్పలేని నిస్సహాయత ఆ కళ్ళలో ఆ కన్నీళ్లు ఎందుకు అని చెప్తే మాత్రం ఇతనికి అర్ధమౌతుంది అంటూ కధను ముగిస్తాడు రచయిత. 

ఇక అరటితొక్క కధలో నిర్లిప్తంగా ఉన్న జగన్నాధం పడవ మునకలో మునిగిపోతున్న  ముసలమ్మను ఎలా కాపాడతాడో చివరికి తన జీవితం లో ఏమి కోల్పోయాడో అది తెలుసుకుంటాడు.అతనికి అప్పుడు కుర్ర మేష్టర్ల ఉపన్యాసాలు గుర్తుకువస్తాయి. ఏది లేక తన బతుకు అసంపూర్ణంగా ఉంది పోయిందో అప్పుడతనికి సుస్పష్టంగా బోధపడింది. ముసలామె లో ఇంకా ఈ ఉడుకు తనం ఎందుకు ఇంకా ఏమి సాధించాలని, తన బతుకులోని ఈ నడివయసులోనే ఈ చావు కోరిక ఎందుకు ఎందుకీ తేడా అని ఆలోచిస్తున్న జగన్నాధానికి జీవితం పట్ల మనిషికి ఉండవలసిన మర్యాద కోరిక తమ జీవితాన్ని ఇతరులకి ఉపయోగపడేవిధంగా ఎలా మార్చుకోవాలో , అసలు జీవన కాంక్ష అంటే ఎంతో బోధపడుతుంది. దీన్నే బెర్నార్డ్ షా "లైఫ్ ఫోర్స్ " అంటాడు తన నాటకాల్లో. జీవితానికో అర్ధం పరమార్ధం ఉండి  తీరాలి. నిస్సహాయంగా నికృష్టంగా చచ్చి పోవడానికి కాదు అన్నా విషయాన్నీ , తన పేదరికం ఆ ముసలమ్మా కష్టాల కంటే ఎక్కువ కాదన్నా ఎరుక కలుగుతుంది అతనిలోనూ, అదే సమయం లో చదువుతున్న వారి లోనూ. కధను నడిపించిన తీరు ఆసాంతమూ ఆసక్తి దాయకంగా ఉంటుంది. రావిశాస్త్రి గారి ప్రతీకల  గురించి , వర్ణనల గురించి ఇక చెప్పనవసరం లేదు. భావ వైరుధ్యం గల  రెండు పోలికలను ఎలా జక్స్టాపోస్ చేస్తారో అని ఆశ్చర్యం కలుగుతుంది. ముసలమ్మ ముగ్గుబుట్టలాంటి తల ఆ ఎండలో వజ్రాల బుట్టలా మెరిసింది, ఈ వాక్యం తో కధ ముగుస్తుంది కానీ మనలో ప్రేరణ మొదలౌతుంది. వయసుడిగిన ముసలమ్మలోని ఆశ నడి వయసులోనే ఏమీ చేయలేని అసహాయ పేద జగన్నాధం లో ఒక కనువిప్పు స్ఫూర్తిని కలిగిస్తుంది. జీవితంలో  పలాయన వాదం కూడదని చెప్పే కధ అరటితొక్క. నిజానికి ఇప్పుడు సినిమా భాష లో మొదలై జనం లో కలిసిపోయిన మాట "తొక్క" అంటే ఏమీ ప్రయోజనం లేని వాటిని ఆ తొక్కలోది అనడం బాగా అలవాటయి  పోయింది . దీనికి ఎప్పుడో అరవైయ్యిల్లోనే రాసిన ఈ కధ ప్రేరణ అనిపిస్తుంది. ఏముందీ తొక్కలో బతుకు అనుకున్నా జగన్నాధానికి జీవితపు  విలువ తెలిసొస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మిగిలిన కధల్లో కూడా ఇలాగే జీవన ప్రతీకలుగా సజీవంగా మనకు దర్సనమిచ్చే ఎన్నో ఉదాహరణలు పాత్రల  రూపం లో కనిపిస్తాయి. నాడు శ్రీశ్రీ సంక్షిప్తంగా కవితల్లో అన్నా మాటకు అతి సరళంగా సహజంగా వస్తావ జీవితానికి అన్వయించి  ఈ తొమ్మిది కధలూ రాసేరు శాస్త్రి గారు . ఈ కదలన్నిటిలోనూ జీవితం పచ్చిగా కనిపిస్తుంది. జీవితం లో మనుషుల ఆవేదన కనబడుతుంది. 
తలుపు గొళ్ళెం కధలో ప్లీడర్ల ను గురించి వర్ణించే తీరు అపూర్వమనిపిస్తుంది. తన వృత్తిలో ఉంటూనే పేదల పట్ల అన్యాయం చేసే దొంగ ప్లీడర్లని వారి సర్కస్ ఫీట్లని ఉతికి అరేస్తారు శాస్త్రి గారు. 
తను గమనించిన సజీవ వేదనలను అంతే సజీవంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. అదో జగత్ సహోదరులు అని శ్రీశ్రీ ఘోషించినా మహా ప్రస్థానం భాష సంక్లిష్టత వలన అందులోని విషయం చదువురాని పేద వాడికి ఎలా బోధ పడుతుంది ,అందుకే శాస్త్రి గారిని మనకిచ్చిందీ  సాహిత్య లోకం. మరింత వివరంగా వారి భాషలోనే వారి కష్టాలను పట్టి చూపిస్తూ  వారు ఎక్కడ ఏ అన్యాయానికి గురి అవుతున్నారో ఆ వర్గాలకు   తాను వ్రుత్తి పరంగానూ ప్రవృత్తి పరంగానూ జీవితం లోనూ సాహిత్యం లోనూ అండగా  నిలిచిన రావి శాస్త్రి మాననీయుడు. రావి శాస్త్రి గారి 90  వ జయంతి సందర్భంగా సందర్భోచితంగా  ఉంటుందని అలాగే ఈ రచనలు  నేటి తరం చదవాలనే ఆకాంక్షతో ఈ చిన్ని వ్యాసపు అద్దం లో కొండంత శాస్త్రి గారిని చూపెట్టే ప్రయత్నం చేశాను. 
.................................................................................................................................................................................జగద్ధాత్రి 30th july 2012....(published in andhrabhoomi daily "sahithi")