Friday, February 15, 2013

డైవింగ్ టేబుల్ ....



అనగనగనగా ఒక కుర్చీ 
ఒక కుర్చీ కాదు ఒకే ఒక్క కుర్చీ 

ఒకే ఒక్క టేబుల్ ముందు ఒకే ఒక్క  కుర్చీ 
అంది కదా ఓ రోజు టేబుల్ 
"ఎందుకని ఎప్పుడూ ఒకే కుర్చీ
మరెన్నిటికో కాకున్నా మరో మూడింటికి 
జాగా ఉంది కదా ? "

నవ్వింది కుర్చీ పకపకా 
" ఎందుకోయ్ ఇలా అడుగుతున్నావ్ ఇవాళా ?" అంది 
" ఎన్నాళ్ళీ ఏకాకి బతుకని ?" నీళ్ళు నమిలింది టేబుల్ 
" ఏకాకి అని ఎవరన్నారు ? ఇది నా ఇష్ట సామ్రాజ్యం 
నాకుగా నేనే నిర్మించుకున్నా , ఆనందంగా నే ఉన్నాగా?"

" ఔను గానీ నాకు తెలీకడుగుతా, ఒంటరి గా అనిపించదూ?" 
మళ్ళీ పకాలున నవ్వింది కుర్చీ 

" ఎందుకూ ఒంటరితనం? " 
అని నవ్వుతూ మళ్ళీ తనే చెప్పింది ఇలా 
" అయ్యో పిచ్చి మొద్దూ! దీన్ని ఒంటరితనం అనరు 
స్వయంగా కావాలని  ఏర్పరుచుకున్న ఆనందపు ఏకాంతం "

" ఎందుకెంచుకున్నావీ ఏకాంతాన్ని ?" ఆరాగా అడిగింది బల్ల 
" నేను నేను గా బతకాలని , నా భావాలని బతికించుకోవాలని" 
జవాబు చెప్పింది పెంకి కుర్చీ 

" ఆ పాటి జాగా కనీసం మరో కుర్చీకైనా ఇవ్వచ్చుగా ?" 
హితవు చెప్పబోయింది బల్ల 
" లేదు నా రాత బల్లకి , నా మేత బల్లకి ఉండాల్సినది 
ఒకే ఒక్క కుర్చీ అది చాలు నాకు 
అందుకే ఈ ఏకాంతంతో సావాసం ,ఎన్నెన్నో చెయ్యగలిగిన సాహసం 
అన్నిటికీ స్ఫూర్తి నాకు నేనే " గర్వంగా చెప్పింది కుర్చీ తలెగరేస్తూ .
..........................................................................................................ప్రేమతో ...జగతి 8.39 pm 15th feb 2013 

Sunday, February 10, 2013

అర్ధం చేసుకోవూ ......





ఆత్మ శోధనంటూ అతి శోధనతో 
సహజాన్ని అసహజం చేస్తూ
వాస్తవికతని  అధి వాస్తవికంగా అర్ధం చేసుకుంటావు 
సహజాతాలకి , ప్రకృతి నైజాలకి 
నీ మేధ ను జోడించి ప్రపంచం లో 
నీదే ధు:ఖం అనుకుంటావు 
అది నీ బలమో బలహీనతో 
నీకే అవగతమవ్వాలి మరి  

అక్షరాల కావిడిని  భుజం పై వేసుకుని 
ఓటి కుండలతో కావ్య జలాన్ని  మోద్దామని
ప్రయత్నిస్తూనే ఉంటావు 
ఎందుకీ ఎకాకి కంచి గరుడ సేవ చేస్తున్నావో 
నీ అంతరీక్షణకే తెలియాలి మరి 

అహాలూ అభిజాత్యాలూ ఉండకూడని చోట 
అనంతమైన కావ్య సంపదను 
ఆనందంగా పంచాల్సిన వేళ 
ఆత్మ న్యూనతలూ , ఆత్మ వంచనలూ 
చేసుకుంటూ నీలోని కవన మహరాజునీ
నీ చుట్టూ  ఉన్న శ్రవణ మిత్రులనీ నిందిస్తూ 
అర్ధం లేని ఆవేదనకి గురి అవుతావు 

ఆత్మ నిందాస్తుతి , పరనిందా స్తుతి కి నడుమ 
గబ్బిలం లా వేళ్ళాడుతూ ఆత్మ ద్రోహం 
పర ద్రోహం నీకు తెలియకనే చేస్తుంటావు 
నీ అసంతృప్తి  నీకే అర్ధం కావాలి మరి 

నిర్మలంగా నిన్ను వలచిన 
స్వేచ్ఛాక్షర కన్యను 
తూలనాడి , అర్ధం లేని న్యూనతతో 
ఆవేదనా వేడిమిని అంతరంగం లో మోస్తూ తిరుగుతావు 


స్వచ్చ్ఛంగా నీ చేతుల్లో వాలి పోయి పరవశించాలని 
ఆశతో కలలు కనే కావ్య దేవేరిని 
అపార్ధాల , అర్ధం లేని ముసుగులతో 
అవగాహనా రాహిత్యపు అహంకారంతో 
స్వయంకృతంగా దూరం చేసుకుంటూ 
మరల తనకోసమే అనునిత్యం పరితపిస్తూ పరిగెడతావు 


డొక్క శుద్ధి ఉన్న వాడివి 
ఆత్మ శుద్ధిని ఎందుకు నిలుపుకోవో మరి 


నీలో దాగున్న ఇన్ని ముఖాలను 
సమాజపు సాహిత్యపు నిలువుటద్దం లో 
చూసుకోలేక పరనిందల పరదాల మాటున దాక్కుంటావు 

ఇంతకీ ముగ్గురిలోఉన్న నీవొక్కడివా ?
ఒక్కడిలో ఉన్న ముగ్గురివా ?
బహుముఖీనమైన ప్రతిభను విస్తరింప జేయడం మాని
నీకె తెలియని నీలోని బహు ముఖాలతో 
వ్యర్ధ వేదనతో సంచరిస్తున్నావు 

ఇది సుందర సాహితీ నందనం 
సకల మానవ కళ్యాణాన్ని కోరే ఆత్మ సంకల్పం 
మనసులోని మాలిన్యాలను కడిగి 
మమతల పూలను పూయించాల్సిన కర్తవ్యం 

అంతరంగ సరంగువై 
ఆంతర్యపు అల్లకల్లోల సుడిగుండాలను ఒడుపుగా దాటి 
ఆత్మ శుద్ధితో , వస్తు వైవిధ్యం తో 
అంతులేని అనురాగం తో 
ఆత్మ యాత్ర ఇకనైనా సాగిస్తావని 
నీకోసం నీ మానవత్వపు పదఘట్టనకోసం 
నిలువెల్లా మనసు చేసుకుని 
ఎదురు చూస్తోన్న కావ్య  జగతిని 
నిరాశపరచకు ఇకనైనా ...

కవన సేద్యం తో నీ మా కలలు ఫలింపచేసి 
వసుధైక  కుటుంబకం అనే మన సంస్కృతి ఆత్మను నిలిపి 
అక్షరమై అనంతంగా నువ్వు మిగలాలని 
అందరికీ ఆదర్శం కావాలని 
ఆకాంక్షిస్తూ , అనునిత్యం ప్రార్ధిస్తూనే ఉంటాను 

ఓం శాంతి , అల్లా హో అక్బర్ , ఆమెన్!!!

................................................................ప్రేమతో ...జగతి 6.34 am 10th february 2013 Sunday