నా మనసున తోచిన భావాలు ఎక్కడెక్కడో పారేసుకోకుండా ఇక్కడుంచితే ఎప్పుడన్నా ఎవ్వరైనా చదవరా అనే చిన్ని ఆశతో....ప్రేమతో...జగతి
Friday, November 30, 2012
Monday, November 19, 2012
మారని ఆమె, సముద్రం, నేను
అతని గొంతులో ధ్వనించిన కోపానికి బిత్తర పోయింది ఆమె.
" ఎప్పుడూ ప్రేమ ప్రేమ అని ఎందుకు వెంట బడతావ్ అసలు మనసే లేదు అంటుంటే ప్రేమట ప్రేమ ..." అంత అసహనం ఎప్పుడూ చూడలేదు అతనిలో.
" పలకవు ఉలకవు ఏయ్ నిన్నే !.." ఒక్కసారి అతని వైపు తలెత్తి చూసి మళ్ళీ ఇసికను చేతులతో సవరిస్తూంది ఆమె.
" ఎమన్నా అన్నామా మౌనం అమ్మగారికి ... ఓయ్ ..." ఆమెని కుదిపాడు
తలెత్తి చుసిన ఆమె కళ్ళల్లో నిండుగా నీళ్ళు ఒలక బోయే మేఘాల్లా . ఒక్క క్షణం చలించినా వెంటనే సర్దుకున్నాడు.
" వద్దు ...ఈ కన్నీళ్ళతో ఎవరినే కట్టి పడేయ్యాలేవు ..." విసుగ్గా అన్నాడు
" నేనెప్పుడైనా అలా కట్టి పడేసే ప్రయత్నం చేసానా ?" నెమ్మదిగా ప్రశ్నించింది.
వెంటనే మాటలు రాలేదతనికి ... నిజమే ఎప్పుడూ తను బాధ పడుతుంది తప్ప ఏ విషయం లోనూ ఏదీ అడగదు.
" ఏమో నా వరకు నేనేమీ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు ప్రేమించలేను కూడా ... " నిష్కర్షగా అన్నాడు.
మళ్ళీ తనే " అసలీ ప్రేమ అనే దాన్ని నమ్మని వాళ్ళలో మొదటి వాడిని నేనే "
" ఇవన్నీ ఇప్పుడెందుకు మాటాడు తున్నావో తెలుసుకోవచ్చా...?" నిమ్మళంగా అడిగింది
కాసేపు మౌనం .... " ఏమో చెప్పాలనిపించింది అంతే "
" నేనేమన్నా అడిగానా ?"
" లేదులే ...కానీ , నాకే ఎందుకో నువ్వు పదేపదే ప్రేమ అనడం నచ్చలేదు "
" సరే ఇంకెప్పుడూ అనను ఓకే నా ..." వెంటనే ఒప్పేసుకుంది. ఇక ఏమనాలో తోచలేదు అతనికి.
" ఎందుకు తాత్వికా ! ఈ రోజు నా ప్రేమ ని తిడుతున్నావు ..." పకాపక నవ్వింది
" నేనేమీ ఎవరినీ నిర్బంధించలేదు గా ప్రేమ అంటూ... ఆయినా ప్రేమ బంధం అంటారు కానీ నా దృష్టిలో ప్రేమ బంధ విముక్తి "
" చాల్లే ఆపు తల్లీ నీ సిద్ధాంతాలు ..."
" అదే పొరబాటు ఏ సిద్ధాంతం లేనిదే ప్రేమ "
" నాకు ఈ దేహం పై తప్ప దేని మీద నమ్మకం లేదు ..."
" దేహం లోని ఒక అంగమే మెదడు , హృదయం కాదా ... మరి అందులోంచి జనిన్చేదే గా ప్రేమ ?"
" ఆపు రాక్షసీ ! ఎక్కడో దేన్నో తీసుకొచ్చి దీనికి ముడి పెడతావు "
" సరే మళ్ళీ ఎప్పుడూ మాటాడను లే ..." నిశ్సబ్దంగా తల వంచుకుంది . ఆమె పయ్యెద పై కన్నీళ్లు పారిజాతాల్లా జలజలా రాలడం చూసాడతను
దగ్గరకి తీసుకుందామని చాచిన చేతులు ఎందుకో ఆగి పోయాయి.
ఎలా చెప్పాలి ఈమెకి అనిపించింది ఒక్క క్షణం . ఆమె నమ్మకం ఎలా కాదనాలి. ఎవరు ఏ ద్రోహం చేసినా కూడా ప్రేమతోనే జయించాలి తప్ప ద్వేషం గా మర్చుకోకుడదని వాదించే ఈ ప్రేమ మూర్ఖురాలికి ఎలా చెప్తే బోధ పడుతుంది ? ఎందుకో ఒక్కసారిగా కోపం జాలి విసుగు కలిగాయతనికి.
తనం కోసమంటూ ఏమీ మిగుల్చుకోదు , భవిష్యత్తు ఆలోచించదు ... ప్రేమించే మనుషుల కోసం ఏదైనా చేసేస్తుంది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించెంత వెర్రిది.
అందుకే తల్లి , భర్త , అత్త మామలూ అందరూ మోసం చేసారు , విచిత్రం ఏమిటంటే తెలిసినా ఎవరి పట్లా ద్వేషం పెంచుకోదు. కానీ ఎలా బతుకుతుంది అర్ధం కావడం లేదు.
ఒక్కసారిగా జాలి ( ప్రేమ అనకూడదు లెండి) ఆమె ని దగ్గరగా హత్తుకున్నాడు.
" సర్లే పద వెళ్దాం , నీకు చెప్పినా అదిగో ఆ సముద్రానికి చెప్పినా మీ ఘోష మీదే ...పద పిచ్చీ !" అనునయంగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించాడు మౌనంగా నడిచింది అతనితో.
.............................. .............ప్రేమతో ..జగతి 12.40pm Friday 16th Nov 2012