Thursday, May 31, 2012

దివ్య గానం


         
పాట పాడటమంటే మాటలు కాదు 
అమృతగానం ఓ అద్భుత తపస్సు 
చక్కని సాహిత్య 
చిక్కని స్వరాల , సుమధుర స్వర పేటికతో
చేసే  శబ్దానుక్రియా కాదు 
చిట్ట స్వరాల చిద్రూప కల్పనతో 
సంగతులను సంతరిస్తూ పలికే 
పాండిత్య ప్రతిభా కాదు సంగీతం 
హావ భావ విన్యాసాల 
రాగ తాళ మేళవింపులతో 
శ్రుతి లయానుబద్దమై సాగేది మాత్రమే 
కాదు గానమంటే ....

దివ్య గానమంటే.....
భావనాప్లావితమైన  రసఝరి 
షట్చక్రాలను ప్రదీప్తించి 
సహస్రారాన్ని ప్రపుల్లితం చేసే దివ్య కాంతి 
భక్తి , అనురక్తి , విషాదం, వినోదం , భావమేదైనా 
రస స్ఫూర్తితో పలికితేనే గీతిక
కృతియో, కీర్తనో, లలితమో, 
మరి జానపదమైనా ...
ఆయా రీతుల లోతులు గని 
పలికితేనే గానము 

ఆరోహ అవరోహణల అనుష్టానమే కాదు 
గానం నవరసానుభూతుల అనుసంధానం 
సరిగమల , రాగాల సంగమమే కాదు 
మధురమై , మంజులమై , 
మనోధర్మానుసారాన సాగి 
భక్తి , జ్ఞాన , ప్రపత్తులతో 
సామవేద సారాన్ని 
సప్త స్వరాల వరాలతో 
అద్వైతాన్ని సిద్ధింప జేసే సన్మార్గము 
పండిత , పామర 
హృదయానురంజకమై
భావోద్దీపన కలిగించే 
నాదాను సత్ సాధనమే సంగీతం !!!
..........................................ప్రేమతో ...జగతి ( అభ్యుదయ రచయితల సంఘం వారి సంకలనం లో ముద్రితమైన కవిత) 





అలలు (15)...(.5.)..




ఈశాన్య రుతు పవనం లా
నను చుట్టేసి 
చల్లని మమతల జల్లు 
కురిపించాడు .....ప్రేమతో...జగతి 

మత్తిలిన  మనో దేహాలకి 
ఇంకా సందేహమే 
తాను వచ్చి 
వెళ్ళాడా నిజంగా.....ప్రేమతో,,,జగతి 

వెయ్యి ఉత్తరాలు
వంద  సందేశాల కన్నా 
ప్రియమైన 
ఒక  మధుర సమాగం మిన్న .....ప్రేమతో...జగతి

అసలు నన్ను ఏమి చూసి 
ప్రేమించావ్ ?
సూటిగా ప్రశ్నించాడు 
ఈ  తర్క బుద్ధి చూసే .....నవ్వేసాను ...ప్రేమతో ...జగతి 

ప్రతి క్షణం 
ఎగిసి పడతాడు 
సముద్రుడు 
ధరణీ ప్రియ చుంబనం కోసం ......ప్రేమతో....జగతి 

అతని మధుర 
దరహాస  రేఖలు 
నన్నో కాంతి 
పుంజాన్ని చేసాయి.....ప్రేమతో ...జగతి 

గగనమంత నా 
స్వామికి .....
వసుధ నిండిన
వలపు సమర్పణను  .....ప్రేమతో ...జగతి 

తను చేసే మధుర 
గాయాలు తడుముకుంటూ 
ఎద తీయగా 
మూల్గుతోంది .....ప్రేమతో ....జగతి 

నా పాపిట 
తన ప్రియ మైన 
ముద్దులు 
ఒక్కొక్క మల్లె మొగ్గ 
కూర్చిన పాపిట చేరులా.......ప్ర్రేమతో ...జగతి 

పచ్చికకు చెక్కిలి 
అద్దుకున్నట్టు
తన గడ్డం 
గరుకుతనం ....ప్రేమతో జగతి 

అధరాలపై 
కొనగోటి మీటు 
వెళ్లేముందు తనిచ్చిన 
విలువైన కానుక.....ప్రేమతో జగతి 

మరు కలయిక కై 
మది  మారాం చేస్తోందంటే 
అంతవరకూ దాచుకో...
ఈ పరిమళాన్ని అన్నాడు .....ప్రేమతో ...జగతి 

పేద వాణ్ని 
ప్రేమ తప్ప ఏమీ ఇవ్వలేను అంటే...
ప్రేమున్న వారెవరికీ 
పేదతనం లేదు అన్నా...
తన గుండెలపై వాలి .....ప్రేమతో ...జగతి 

తన నుదురు 
నిమురుతూ....
ఎన్నో జ్ఞాపకాల 
మూటలు విప్పాను .....ప్రేమతో జగతి 

తన గుబురైన జుట్టులో 
నా వేళ్ళు....
అతని చురుకు 
చూపులలో నా కనులు  
చిక్కుబడిపోయాయి .....ప్రేమతో ...జగతి
31st May 2012 7pm Thursday 






















అలలు -15 - (4)




అతని తెల్లని 
లాల్చీ పై 
ఛాతీ పై ఎడమ వైపు 
సిందూరపు మరక
నాన్న...కళ్ళల్లో ...
చిలిపి నవ్వు ....ఆనందం....ప్రేమతో ...జగతి 

నేనతన్ని కోరిన 
విలువైన ఆభరణాలు 
చేతులనిండుగా
ఎర్రని మట్టి గాజులు ....ప్రేమతో ...జగతి 

నాకు కవిత్వం రాదు
అన్నాడతను ...
నేను నవ్వేసా..
ప్రేమే కవిత్వం 
ఇక అదెందుకు అంటూ.....ప్రేమతో ...జగతి 

నీకు కోపం రాదా 
అడిగాడు తను 
వస్తుంది ....
నిను చూడగానే 
ప్రేమగా మారిపోతుంది 
అన్నా.........ప్రేమతో...జగతి

ఐదు పదులు దాటినా
ఏమిటీ అల్లరంటే....
తొమ్మిది పదులైనా
తొలి ప్రేమ పదునే
అంటాడు ....గర్వంగా....ప్రేమతో ...జగతి 

పాప కళ్ళలో పడింది 
అతని పెదాల పైన 
కాటుక మరక 
అమ్మ కళ్ళని ముద్దాడావు కదూ
పాప అడగని ప్రశ్నకు ముందే 
నాలో బిడియపు ప్రకంపన .....ప్రేమతో...జగతి 

అనురాగం బంధం
కావోచ్చునేమో ....
బిగిసిన అసూయా 
బంధనం కాకూడదు .....ప్రేమతో ...జగతి 

ప్రేమతో అని రాస్తావు 
అందరన్నా నీకు ప్రేమేనా ?
అడిగారొక పెద్దాయన 
ప్రేమకు తన పర ఉంటుందా అసలు?.....ప్రేమతో జగతి 

ప్రేమ, ద్వేషం 
రెండు లేనే లేవు 
తీవ్రమైన ప్రేమే 
ద్వేషం కూడా.....ప్రేమతో ...జగతి 

తగాదా లేనిదే 
ఏ బంధంలోనూ అందం లేదు
అందుకే ఆ పని 
తనకే వదిలేసా 
తగవు తీరి అలసాక 
నా వడిలో వాలి పోతాడు పాపం యోధుడు...ప్రేమతో ...జగతి 

చదువుకోవాలి నిజమే 
మన మనసుని 
మనమే క్షుణ్ణంగా......ప్రేమతో ...జగతి 

మనసులోకి తొంగి 
చూసావా ....
చాలా బాధాకరం 
ఓడిపోయిన కలలన్నీ 
ఓటి కుండల్ల్లా 
పడి ఉంటాయ్ ......ప్రేమతో ...జగతి 

ప్రేమంటే కట్టి 
పడేసుకోవడం కాదు 
ఎక్కడికెళ్ళినా , ఏమి చేసినా 
నీ దగ్గరికే వచ్చే 
స్వేచ్చనివ్వడం .......ప్రేమతో...జగతి 

అతని కళ్ళలోని
వెలుగు కొరత  
నాకు అర్ధమౌతుంది 
తాను  తప్పటడుగు వేశాడని .....ప్రేమతో ...జగతి 

మన్నించడమంటే...
మరచి పోవడం కాదు 
ఆ విషయాన్నిక 
విషం చేయకుండా 
వదిలేయడం......ప్రేమతో....జగతి 

31st May Thursday 11.40 am 2012



















అలలు 10 ( 3)




ఆతని వెచ్చని 
ఊపిరి తాకి
మది జ్వరించింది....ప్రేమతో....జగతి 

కటువైన తన ముద్దు 
నా పెదవి చిట్లి
వలపు ఎరుపు.....ప్రేమతో ....జగతి 

జాజులు జడలో 
తురుముతూ...
మెడ వంపులో ..
అతని ముని వేళ్ళ గిలిగింత.....ప్రేమతో ...జగతి 

నా చెక్కిలి పై 
తన చిలిపి గాయం 
కొంగు చాటున 
సిగ్గిలుతూ...
పగలంతా....ప్రేమతో ...జగతి 

పొగడ పూలు 
ఏరి తెచ్చా
తెలియదు తనకు 
రాత్రికి మాకవే తలంబ్రాలని.....ప్రేమతో ...జగతి 

ఏకాంతం దొరకని 
దొంగ ముద్దుల 
తీపి ....
అతని కొంటెదనంలో .....ప్రేమతో...జగతి 

ఒంటరి ఆలాపనగా 
సాగే మేను 
అతని స్పర్శలో 
జావళి పలుకుతుంది  ......ప్రేమతో...జగతి 

మణుల కాంతి వెల్లువ  
నీల ద్వయం ...
అతని కనులలో....
నేను.........ప్రేమతో ...జగతి 

నేల రాలినా 
ఆతని పాదాలను  
చేరినందుకు 
ఆనందాంబుధినైన ...
పారిజాతాన్ని .....ప్రేమతో ...జగతి 

మమతార్చనకై 
మరులెన్నో కూర్చాను 
నా స్వామి 
వెన్నెల నవ్వు సోనలో 
మైమరిచి పోయాను .....ప్రేమతో ....జగతి

 30th may 2012 6.20pm Wednesday 






అలలు ....9 (2)




అతని చల్లని 
స్పర్శ .....
తీయని మాదకత 
నరనరాల్లోనూ....ప్రేమతో..జగతి 

ఒక  మంచి   మాట 
ఒక చిన్ని నవ్వు 
ఒక చిట్టి గెలుపు 
జీవితాన్ని నిలబెడతాయి .....ప్రేమతో ...జగతి 

ప్రేమ కోల్పోయాము 
అంటారు కొందరు 
ప్రేమకి పోవడం 
ఉండదు....ఒక సారి కలిగాక....ప్రేమతో...జగతి 

దేహాల కలయిక 
సుఖమే .....
మేధో భావ ప్రాప్తి 
పొందే జంట నడుమ .....ప్రేమతో ...జగతి 

నడుము వంపున 
బలంగా అతని చెయ్యి 
రాముడు ఇలాగే 
శివుని విల్లు ఎత్తాడా.....ప్రేమతో...జగతి 

పెదవుల వణుకుకు
తాను దాటిన
మోమాటపు 
సరి హద్దు 
నా అధరాలపై
తన పంటి గాటు....ప్రేమతో ...జగతి 

కరుకుగా  ఉంటాడు 
మరెందుకో ...
అంత ఆరాటం 
నా క్షేమం తనకి .... ప్రేమతో జగతి 

సుతి మెత్తని 
తన చేతులు 
పువ్వులాంటి 
ఆతని మనసులానే .....ప్రేమతో...జగతి 

మాటలెన్నిచెప్పినా 
మనసు మాత్రం 
విప్పడు సుమా 
నే కలతిస్తే చూడలేనందుకేనేమో.....ప్రేమతో ...జగతి 








అలలు ....9 (1)



గుండె సంద్రం పొంగి పొరలి
నా కలల నురుగై 
తాకింది ఆతని 
పాదాలను....ప్రేమతో ....జగతి 

మాటల  నడుమ 
సరాగం .....
పూలను అల్లే 
దారం లా.......ప్రేమతో ...జగతి 

ఆతని వెన్నెల మోముపై
నా నఖ క్షతం 
జాబిలి పై 
మరకలా.....ప్రేమతో...జగతి 

నా మల్లియల 
తోటకు 
జీవనమాలి 
తాను.....ప్రేమతో...జగతి 

పువ్వును వీడని 
పరిమళం 
ఆతని
బిగి కౌగిలి......ప్రేమతో...జగతి 

తన మాటల 
తేనెల జల్లు 
నా మది మురిసే 
నవ వర్ణాల హరి విల్లు ....ప్రేమతో ....జగతి 

నీ నగవుల కిరణాల 
వేడి సోకి 
కుంకుమ అయ్యింది 
నా పసిడి మేను .....ప్రేమతో ...జగతి 


నిండు పున్నమి 
తన నగవుల మోము
ఖిన్నమాయెను
నా నిరీక్షణలో....ప్రేమతో ...జగతి 

మము గని 
మధువని 
నును సిగ్గుతో 
మారాకు వేసింది .....ప్రేమతో...జగతి 






Saturday, May 19, 2012


పాపకోసం ....
వయసు లేదు మందలిద్దామా అంటే
పసితనం కాదు నాలుగు తగిలిద్దామంటే
ఎలా చెప్పనమ్మా నీకు 
నీలాంటి మరిందరికీ 
పాలుగారు  బుగ్గలపై 
కన్నీటి చారికలా.....
జీవితమంటే మీరు తెచ్చుకునే
మార్కులూ ర్యాంకులేనా?
అమ్మగా నాన్నగా మేము చేసేది తప్పే
కానీ ఈ పోటీ ప్రపంచం లో 
మీరు మాలా గొర్రె తోక బతుకులకి 
ఎక్కడ బలై పోతారో నని 
మా భయం తప్ప ...
మిమ్మల్నే కోల్పోయి మేము
సాధించేదేముంది రా
మేము సాధించని వన్నీ మీలో
చూసుకుంటున్నమని మీరు  అనుకుంటారు 
నిజమేనేమో కానీ సాధించలేక 
ఓడిపోయిన వారం మేమే ఉన్నముగా
మీకు ఉదాహరణగా...
ఆశ పడటం తప్పు కాదు కదమ్మా 
దానికి ఇంత శిక్ష వేస్తావా
చిన్నప్పుడు నీ ఆకలి నీకు తెలియని సమయాన
బలవంతంగా ముద్దు చేస్తూ 
మరో రెండు ముద్దలు పెట్టిన దాన్నే గా నేను 
నాన్న ఎత్తుకుని నిన్ను ఆడిస్తూ పాడిస్తూ
పక్క వాళ్ళబ్బాయి కొనుక్కున్న బొమ్మపై
నీ ఇష్టాన్ని చూసి బనీన్లు కొనుక్కోవలసిన
డబ్బుతో నీకా బొమ్మ ను కొనిచ్చి 
మళ్ళీ  రెండు నెలలు దాకా కూడా చినిపోయిన బనీన్లె 
తోడుక్కున్నరమ్మ .....
ఇదేదో త్యాగమని నే చెప్పడం లేదు
మా స్తోమత కి మించి నిన్ను 
ఒక మనిషిని  చెయ్యాలని 
మా ప్రయత్నం అత్యాశా?
అందుకేనా మమ్మల్నిలా  నట్ట్టేట ముంచి 
అడియాస చేసి వెళ్లి పోయావు?
నీకు పుస్తకాలతో బాటే ఎన్నో 
మంచి మాటలూ చెప్పేవాళ్ళం
ఒక ప్రయత్నం కాకుంటే మరో 
మార్గం ఉందమ్మా పర్వాలేదు అనే ధైర్యమిచ్చాము 
అయినా మా అంతరంగాలలో మమ్మల్ని దోషులుగా
నిలదీసి , ముద్దాయిలని చేసి 
నీకు నువ్వే అలోచంచుకుని 
కనీసం మాటమాత్రం చెప్పకుండా 
ఎలా వెళ్లి పోయావమ్మా?
పరీక్ష అయ్యాక సినిమాకి వెళ్దామా నాన్న?
అని అడిగినప్పుడు అలగేనమ్మ 
చాలా కష్టపడ్డావు తల్లీ
రేపు పరీక్ష కానీ తీసుకువేల్తాననే  అన్నారు గా నాన్న
అమ్మ స్నేహితురాలి ఊరు వేళతానే  అమ్మా  అంటే  
ఊళ్ళో అమ్మవారి పండుగట రమ్మంది 
అంటే అలగేలేరా తప్పక పంపుతనమ్మ అన్నాను 
ఎందుకురా తల్లి మమ్మల్నిలా .......
పరీక్షలో మంచి మార్కులు రాకుంటే 
నాన్నకేమన్న అవుతున్దనుకున్నవా 
అమ్మ ఎమన్నా అంటున్దనుకున్నవా
ఎన్ని ప్రయత్నాలు చేసినా
చివరి నిర్ణయం దైవాధీనం కదురా అమ్మడూ
అయినా ఆ దైవాన్నే ఎదిరించి నీ నిర్ణయం 
నువు తీసేసుకుంటావా?
ఎవరికేమని చెప్పుకోము
మమ్మల్ని మేమెలా క్షమించుకోము  రా బంగారూ?
గత రెండు నెలలుగా నిద్ర మాని నీతో బాటే కూర్చుని 
చదివించుకోవడం అలవాటై పాయిందమ్మ
ఇప్పుడిక నీ కోసం ఏడ్చి ఏడ్చి కన్నీరింకి 
పొడి బారిన కళ్ళకు 
సందడి కోల్పోయిన హృదయాలకు 
ఇక నిదురెక్కడిది? 
దేహాలు అలసి ఒక్క క్షణం మాగన్ను పడితే
అయ్యో పాప ని  లేపి కాఫీ ఇవ్వాలి కదా
అన్న తలంపు తోనే
ఉలిక్కి పడుతూ లేస్తున్నా
నవ్వు లేవన్న నిజాన్ని మరిచి నాన్న
నిన్న గోరింటాకు పట్టుకొచ్చారు  ఆఫీసునుండి వస్తూ
పాపకు ఇష్టం కదా అని
నీవు లేవన్న మరి రావన్న 
నిజానికి మేము ఏల అలవాటు పడాలి ...
ఈ ప్రశ్నకు  సమాధానం నీ ఎమ్సెట్లో 
ఉండదు రా......
అమ్మ నాన్న అంటే నీకున్న ప్రేమలో 
నువ్వు నిజంగానే తప్పు సమాధానం రాసావురా తల్లి
నీ తప్పుడు సమాధానానికి మాకు 
మనశ్శాంతి  మైనస్  మార్కులు వచ్చాయమ్మా
ఇక మేము ఓడి పోయాము ....
ఎక్కడ జరిగిన పొరబాటో తెలుసుకోలేక .....!
.........................................................ప్రేమతో....జగతి  7.09 pm 16th may 2012 wednesday 
(ఎమ్సెట్లో మార్కులు సరిగా రావేమోనన్న భయం తో నిరాశతో ఆత్మ హత్య చేసుకున్న ఒక అమ్మాయి కోసం) 




ఎప్పుడో ఎన్నేళ్ళకో

ఎప్పుడో ఎన్నేళ్ళకో 
ఎక్కడో అంతరాంత రాళం లో 
ఘనీభవించిన ఓ మంచినీటి ముత్యం
సుడిగుండంలో పొర్లుతున్న 
అతలాకుతలమైన హృది నదిని 
నిశ్చలమైన ఓ దోసిలి పట్టి 
కదలనివ్వని నిశ్చింత 
ఎప్పుడో జార విడుచుకున్న 
తియ్యని అవకాశం
కమ్మని మేఘాలలా 
మళ్ళీ కమ్ముకుని 
మదినావరించి ......
మైమరపించిన అనుభూతి 
అతని ఒక్క మాట కోసం
వేయి జన్మలు ఎదురు చూడాలన్న 
ఆవేశపు ఆకాంక్ష 
ఒక్క నిమిషం మాత్రమే నీకోసం 
అన్నా.....మరొక్క క్షణమైతే బాగుండుననే 
దురాశ...............
ఎప్పుడో ఏనాడో 
చవి చూసిన తరి తీపి దనం
రుచి మరవని మధుర స్మృతి 
అతని మాట .....
అతని మందలింపూ
ఇంపుగానే స్వీకరించే 
చిన్ని మనసు ........
అతనికి తెలిస్తే ఎంత బాగుండునో 
అని ఆశ పడే అత్యాశ ....
..........................................ప్రేమతో ...జగతి 7.40pm 27th april 2012 friday 

బాసలు ..


...
నిదుర రాని ప్రతి రేయీ
ఎన్నెన్ని రాతలు రాస్తానో 
మాగన్నుగా కూడా
మూయలేని కనురెప్పల 
కాగితాలపై 
ఎన్ని వేల తలపుల 
అక్షర  శిల్పాలను 
పలవరిస్తానో  ...
ఒంటరిగా నా మది 
ఆలపించిన ఎన్ని రాగాలను 
మౌనంగా నా కనుపాపలకు 
వినిపిస్తానో...
లెక్కలేనన్ని ఊహలు ....
కనులు పట్టనన్ని కలలు 
గత వర్తమాన భవిష్యత్తుల
ట్రై కలర్ స్వాప్నిక జగత్తులో
మల్టీ కలర్ లో నే రాయని 
రాయలేని ...కమ్మని 
కవితలు, కథలూ....పాటలూ 
చెయ్యాలని ,చేసి తీరాలని 
ఎన్నెన్ని బాసల ఊసులో...
ఏమీ చెయ్యలేక పోయానన్న 
దిగులు దిగాలు చూపులు చూస్తే 
ఓదార్పు చిర్నవ్వుతో 
నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ
నన్ను నేనే ప్రేరణ కలిగించుకుంటూ
కనే కలలు , ఊహలు , ఆశలు 
చెప్పాలంటే ఎన్ని రాత్రులు పడతాయో 
రాయాలంటే ఎన్ని పర్వాలౌతాయో 
అందుకే అన్నిటినీ 
తెలవారు ఝామున 
కనులు అలసి మూతలు 
పడుతున్నప్పుడు ...
భద్రంగా కనుల పెట్టెల్లో పెట్టేసి 
తప్పక మీ ఆశలు
నెరవేరుస్తాను సుమా 
అని ఒట్టుపెట్టి.......
కోడి కూసే ఝాము లో 
కాస్త కూడా కునుకు పట్టని హృదయాన్ని
సోలసిపోయిన  దేహాన్నీ 
సేదదీర్చడానికి ప్రయత్నిస్తాను ....
....................................ప్రేమతో...జగతి 4.25pm Wednesday 9/05/2012 (home)